Showing posts with label సెటైర్. Show all posts
Showing posts with label సెటైర్. Show all posts

Tuesday, November 24, 2009

సెటైర్: ఓటరు - గ్రేటరు

`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనం లాగించేసి కాసేపు టివీలో సినిమాలు చూశాడు. పెళ్లాంబిడ్డలతో కబుర్లాడాడు. రాత్రి పెందలాడే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మంచి నిద్రపట్టేసింది. అంతలో ఎవరో వచ్చి తట్టిలేపారు. `ఛీ, అదివారం పూట కూడా హయిగా పడుకోనివ్వరు...' అంటూ విసుక్కున్నాడు గ్రేటర్. కానీ, ఆ వచ్చినవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అందుకే మళ్ళీమళ్లీ తట్టిలేపుతూనే ఉన్నాడు. దీంతో గ్రేటర్ కి ముసుగుతీయక తప్పలేదు.
`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస

Sunday, November 22, 2009

సెటైర్: బిల్ గేట్స్ ని దాటిన జగన్

ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచం లోని అత్యధిక ధనవంతుల జాబితా ను చూసి అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కి ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే, కేవలం వైట్ మనీ తో వేసే లెక్క లు ఎంత వరుకు కరెక్టు అని!
వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక రహస్య సమావేశం ఏర్పాటుచేసి, ప్రపంచం లోని ధనవంతులదరిని పిలిచి, వారి బ్లాక్ మనీ వివరాలు కూడా తెలుసుకుని, ఆ తరువాత అసలు సిసలైన ప్రపంచ ధనవంతులెవరో తేల్చేసుకుందామని అనుకున్నాడు. ఆ వెంటనే, తన PA ని పిలిచి సమావేశానికి ఏర్పాట్లు చేసేయమన్నాడు. సమావేశ వివరాలు గోప్యంగా ఉంచుతామని అత్యంత గోప్యంగా హామీ ఇవ్వడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ధనికులు తమ బ్లాక్ మనీ రహస్యాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ముందుగా బిల్ గేట్స్ చాలా హుందాగా లేచాడు. టై సరిచేసుకున్నాడు. గొంతు విప్పాడు....
బిల్ గేట్స్: ఎస్, నేను మైక్రోసాఫ్ట్ కింగ్ ని నా సంపాదన ... ఫ్యూర్ వైట్... నాలుగువేల కోట్ల డాలర్లు. బ్లాక్ కూడా మరో నాలుగువేల కోట్లు ఉందనుకోండి...సో, వైటైనా, బ్లాక్ అయినా, నేనే అత్యంత ధనికుణ్ణి...ఎనీ డౌట్.
అనిల్ అంబానీ: నా వైట్ మనీ 1750 కోట్ల డాలర్లు. బ్లాక్ 8వేల కోట్ల డాలర్లు. టోటల్ గా సుమారు 10 వేల కోట్ల డాలర్లు. నేనే గ్రేట్. (సోదరుడు ముఖేష్ వైపు చూస్తూ ఎగతాళి నవ్వు నవ్వాడు)
ముఖేష్ అంబానీ: ఓరేయ్ అనిల్. నువ్వు పిల్లోడివేరా... వయసులోనూ, వైట్ లోనేకాదు, బ్లాక్ లోనూ నీకంటే ఎక్కువేరా... టోటల్ గా నా దగ్గర 15 వేల కోట్లు ఉందిరోయ్... నేనే నెంబర్ వన్.
ఇలా ఒక్కొక్కరూ లేచి తమ బ్లాక్ అండ్ వైట్ వివరాలు కలర్ పుల్ గా చెబుతుంటే అప్పుడు లేచాడు ఓ తెలుగోడు.
చంద్రబాబు: ఒక్కసారి నా లిస్టు చూస్తుంటే మీకే తెలుస్తుందీ, నేను ఎలా ముందుకు పోతున్నానో...నా వైట్, బ్లాక్ కలిపితే, 32వేల కోట్ల డాలర్లు. ఆ విధంగా తెలుగుజాతి ముందుకుపోతుంది. అందుకే మీకు చెబ్తున్నాను, హైదరాబాద్ ని నెంబర్ వన్ చేశాను, అదే మాదిరిగా, నేనూ నెంబర్ వన్ అయ్యాను.
ఇదే సమావేశానికి లేటుగా హాజరై చివరి వరసలో కూర్చున్న అల్లుఅరవింద్ తన బావ చిరంజీవితో అంటున్నాడు...
అల్లుఅరవింద్: చూశావా బావా...నేను ముందు నుంచి చెబ్తునే ఉన్నాను. సినిమాటికెట్లకంటే, పార్టీ టికెట్లు అమ్ముకుంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని. పదేళ్లకిందటే నువ్వు పార్టీ పెట్టిఉంటే, మనమే నెంబర్ వన్ అయ్యేవాళ్లం బావా...
ఇంతలో జగన్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. జగన్ తనదైన శైలిలో తలఎడమ పక్కకి వొంచుతూ, చాలా అమాయంకంగా చెప్పుకుపోతున్నాడు....
జగన్: బ్లాక్ మనీ అయినా, వైట్ మనీ అయినా, అందరికీ ఆదర్శం మా నాన్నగారే. ఆయన బాటలో నడుస్తున్న నేను బ్లాక్ అండ్ వైట్ లో ఎంత కూడబెట్టానని మిస్టర్ ఒబామా అడుగుతున్నారు. అయితే నేను చెబ్తున్నాను, అన్నీ కలర్ పేజీలు వేస్తున్న సాక్షిలో ఉన్నదంతా బ్లాక్ మనీనే...ఇంకా చెబ్తున్నా, నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలిపి సుమారుగా 1లక్షా 36వేల 760 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చు...ఇంకా..

అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఒబామాకు కళ్లు బైర్లుకమ్మాయి. `ఔరా' అని ఇంగ్లీష్ లో అనుకుంటుండగానే తన పక్కనే కూర్చున్న బిల్ గేట్స్ అవుట్ పుట్ రాని ప్రోగ్రాం లాగా సడన్ గా దబీమని పడిపోయాడు. గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నీళ్లు చల్లి లేపాక ఒకటే మాట కలవరిస్తున్నాడు....
బిల్ గేట్స్: నేను ఇండియా పోతా...నేను ఇండియా పోతా....పోతా...పో...

- రాజేష్

Sunday, November 8, 2009

సెటైర్: ఈ గాలీ,ఆ జగనూ, అంతలో అద్వానీ

`పవర్' పాలిటిక్స్ కి వరుసావావి ఉండదు. నీరు ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తున్నట్టూ, గాలి ఎటువీస్తే అటే `పవర్' కదులుతున్నట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పయనం. ఈ పాలసీని ఆసరాగాతీసుకునే కర్నాటకలో గాలిసోదరులు ఓ ఆటఆడిస్తున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప, గాలి సోదరుల మధ్య రేగిన చిచ్చు చల్లార్చాలని బిజెపీ అధిష్ఠానం నడుం బిగించింది. సరిగా ఈ నేపథ్యంలో అద్వానీ, గాలి జనార్ధనరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...
అద్వానీ: హలో గాలి జనార్ధనేనా?
గాలి: ఎస్, గాలి స్పీకింగ్ హియర్..
అద్వానీ: (స్వగతం) అంతే, మనీపవర్ నెత్తికెక్కితే డైలాగ్స్ ఇలాగే ఉంటాయి,(పైకి) హలో గాలి, నేను అద్వానీని.
గాలి: ఏంటిసార్, తొందరగా చెప్పండి, అవతల శంషాబాద్ నోవాటెల్ లో నా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళాలి.
అద్వానీ: ఉండవయ్యా, నీ అసాధ్యం కూలా...తొందరపడకు. అయినా బెంగళూరులో మంచి హోటల్స్ చాలానే ఉంటే, శంషాబాద్ హోటలెందుకట...
గాలి: అదాసార్, చంద్రబాబు గతంలో హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేలను మూసేసి సీఎం సీటు దక్కించుకోలా. ఆ స్పూర్తితోనే హైదరాబాద్ ఎంచుకున్నా.
అద్వానీ: సర్లే, ఆ పాత వెన్నుపోట్ల మాటెత్తకు, నాకు వెన్నులో చలిపుట్టుకొస్తోంది. ఇంతకీ నీ డిమాండ్లేమిటి?
గాలి: పెద్దగా డిమాండ్లేమీలేవుసార్. నాకొన్నది ఒకటే డిమాండ్.
అద్వానీ: హాహ్హహ్హాఁ...ఒకటేనా, చెప్పేయ్, త్వరగా తీర్చేస్తా.
గాలి: జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: జగనా, అతనెవరూ...నీ దగ్గరున్న 50 మంది ఎమ్మెల్యేల్లో ఒకడా..అయినా ఈ పేరు వినలేదే.
గాలి: అతను కర్నాటక ఎమ్మెల్యే కాదుసార్.
అద్వానీ: మరీ!
గాలి: ఆంద్రా ఎంపీ. వైఎస్సార్ కొడుకు జగన్
అద్వానీ: అదేంటయ్యా! కాంగ్రెస్ ఎంపీ అయిన జగన్ ని మనమెలా సీఎంని చేస్తామయ్యా?
గాలి: అవన్నీ నాకు తెలియవుసార్. జగన్ ని సీఎం చేయాల్సిందే.
అద్వానీ: అది కుదరదయ్యా, ఇంకేదైనా అడుగు
గాలి: నాకు ఇంకేమీ వద్దుసార్. మా జగనన్న సీఎం అవ్వాల్సిందే.
అద్వానీ: (స్వగతం) ఓర్నాయనో, ఆంధ్రా జాఢ్యం కర్నాటకకు పట్టుకున్నట్టుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది.
గాలి: ఏంసార్. మాట్లాడటంలేదు. ఒకేనా. చెప్పండి. అవతల టైం లేదు. ప్రభుత్వం కూల్చేయాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: ఓరినా గాలో...అంతపని చేయకయ్యా. సర్లే సీఎంని చేద్దాం.ఇంతకీ ఏ రాష్ట్రానికి సీఎంని చేయాలి. ఆంధ్రాకా, కర్నాటకకా
గాలి:అదీ...అదీ...సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా...జగన్ ని అడిగి చెప్తా.
అద్వానీ: (స్వగతం) ఈ గాలి ఎప్పుడు ఎటువీస్తుందో అర్థంకావడంలేదు. కొంపదీసి గుజరాత్ కి సీఎంని చేయమని అడగడుకదా...
గాలి: సార్, తెలిసిందిసార్. మా జగనన్న ఆంధ్రకే సీఎం కావాలనుకుంటున్నాడు.
అద్వానీ: అమ్మయ్యా, నా టెన్షన్ తగ్గింది. మరైతే మధ్యలో నేనేం చేయాలయ్యా. నీ డిమాండ్ నాకర్థం కావడంలేదు.
గాలి: అవన్నీ నాకు తెలియదుసార్. జగన్ సీఎం అవ్వాలి. లేకుంటే నా 50 మంది ఎమ్మెల్యేలు...
అద్వానీ: ఆపవయ్యా, నీ రికార్డింగ్. ఆగిన రైల్లో చైన్ లాగేసే ఫేసూనువ్వూ...కాస్త ఆలోచించుకోనీ...ఆఁ, సర్లేవయ్యా, నేను సోనియాతో మాట్లాడతా...ఎలాగో ఒప్పిస్తా. జగన్ ని ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళి సోనియాను కలవమను. సెంటిమెంట్ అక్కరకు వస్తుంది.
గాలి: అట్లాగే సార్, త్వరగా తేల్చండి... అవతల నోవాటెల్ వాడు నా గనులు పిండుతున్నాడు. ఇంకొన్నాళ్లయితే, నా ఆస్తిమొత్తం లాక్కుంటాడేమో...
- టి. రాజేష్

Sunday, November 1, 2009

సెటైర్: `కొండ' గాలి సోకింది

కొండా సురేఖ పట్టుచీర కట్టుకని, నుదిటమీద పెద్దబొట్టుపెట్టుకుని వడివడిగా వీధిలో నడుచుకుంటూపోతున్నది. ఎడమపక్క ఓ ఇంటిపిట్టగోడమీద ఎన్.డి.తివారీ అన్న నేమ్ ప్లేట్ చూసింది. `యురేకా...దొరికింది...' అంటూ ఆనందోత్సాహంతో కేకలు పెడుతూ, ఆ ఇంట్లోకి దూసుకువెళ్ళింది.
ఇంటిలోపల హాల్ లో సైక్రియాట్రిస్ట్ ఎన్.డి.తివారీ తీరుబడిగా సోపాలో కూర్చుని ఆరోజు వచ్చిన పేపర్లను చూస్తున్నారు. ప్రాక్టీస్ చేసినన్నాళ్లుచేశాడు. ఎంతోమంది మానసిక రోగులకు నయం చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతానికి రిటైర్ మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు డాక్టర్ ఎన్.డి.తివారి.
అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే కొండా సురేఖ వడివడిగా లోపలకు వచ్చేసింది.అప్పుడు...
కొండాసురేఖ: నమస్కారమండి, తివారీగారు. మిమ్మల్ని చూడాలని చాలారోజులుగా అనుకుంటున్నాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలా అనిపిస్తోందా... (తన దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలా మంది ముందుగా అనేమాట ఇదే కావడంతో తివారీకి అలవాటైపోయింది)
కొండాసురేఖ: నిజంసార్. ఆ రోశయ్యగారిని కలవాలని అనిపించలేదుసార్. నేరుగా మిమ్మల్నే కలవాలనుకున్నా సార్..
ఎన్.డి.తివారీ: ఓహో అలా కూడా అనిపించిందా...ఇంతకీ ఎవరా రోశయ్య? కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చారా?
కొండాసురేఖ: కొత్తగానే వచ్చారు సార్. టెంపరరీ పోస్ట్ అని నేను చెబ్తున్నా వినకుండా పర్మినంట్ అయినట్టు ఫోజులిస్తున్నాడుసార్.
ఎన్.డి.తివారీ: ఓహో...నువ్వు అలా డిసైడ్ అయిపోయావన్నమాట.
కొండాసురేఖ: సార్, మీరు చాలా మంచివారు సార్...ఈ పూల బొకే తీసుకోండి...ఎందుకో మిమ్మల్ని కలవాలనుకోగానే పూలబొకే ఇవ్వాలనిపించి తెచ్చాను.
ఎన్.డి.తివారీ: ఓహో అలాకూడా అనిపించిందా...
కొండాసురేఖ: అంతేకాదు సార్. ఇదిగో ఈ లేఖ కూడా ఇవ్వాలనుకున్నా.
ఎన్.డి.తివారీ: (ఆశ్చర్యంగా) అదేమిటమ్మా, లేఖ అంటున్నావ్. మరి లావుపాటి పుస్తకం ఇస్తున్నావ్. ఇంతకీ ఇదేమన్నా నీ జీవిత చరిత్రా, లేక ఏదైనా పవిత్రగ్రంథమా.
కొండాసురేఖ: ఇది నా పవిత్ర రాజీనామా లేఖ.
ఎన్.డి.తివారీ: ఓహో...పుస్తకాన్ని చూస్తే లేఖలా అనిపిస్తుందా...
కొండాసురేఖ: ఇది పుస్తకం కాదుసార్. రాజీనామాలేఖే. కాకపోతే వెరైటీగా ఉంటుందని 600 పేజీలు రాశా.
ఎన్.డి.తివారీ: ఏంటీ! ఇలా కూడా అనిపిస్తుందా అమ్మా...
కొండాసురేఖ: (సిగ్గుపడుతూ) ఎంటో, అలాఅలా రాసుకుంటూపోతే, 600పేజీలైందిసార్. నేనే కాదుసార్. ఇలాగే నా వెనుక చాలా మంది రాజీనామాలు రాసేసి పట్టుకొస్తున్నారు.
ఎన్.డి.తివారీ: ఏంటీ! నువ్వేకాకుండా, ఇంకా చాలామంది ఈ లక్షణాలతోనే రీమ్ లురీమ్ లు రాజీనామాపత్రాలు రాసేస్తున్నారా తల్లీ.
కొండాసురేఖ: నిజంసార్. మీరు నమ్మడంలేదుకదూ...ఇదిగో నా వెనుక ఎవరున్నారో చూడండి.
ఎన్.డి.తివారీ: ఎవరున్నారమ్మా! ఎవరూలేరుగా...
కొండాసురేఖ: ఎందుకులేరుసార్. ఇదిగో ఈమె సబితారెడ్డి. నా అక్క. చూడక్కా, నువ్వు ఇక్కడే ఉంటే తివారీ సార్ జోకులేస్తున్నారు. ఇదిగో, బొత్సా అన్న, రఘువీరారెడ్డిసార్, దానం నాగేంద్రసార్..ఇంకా వస్తున్నారుసార్. మీకు కనబడటంలేదా...?
ఎన్.డి.తివారీ: ఓహో...ఇలా కూడా అనిపిస్తుందన్నమాట.
కొండాసురేఖ:
తొందరగా రాజీనామా పత్రంపై సంతకం పెట్టండిసార్. జగన్ కళ్లలో ఆనందం చూడాలి. ఈ లేఖను తీసుకెళ్ళి వైఎస్సార్ సమాధిమీద పెట్టాలి.
ఎన్.డి.తివారీ: ఓహో, అలా డిసైడైపోయావాతల్లీ.
అంతలో కొండా సురేఖ పీఏ పరుగుపరుగునవచ్చి, `మేడం, మీరు రాంగ్ అడ్రస్ కివచ్చారు. ఈయన మీరనుకున్న ఎన్.డి. తివారీకారు. సైక్రియాట్రిస్ట్ తివారి. పదండి రైట్ అడ్రస్ కి వెళ్దాం.
ఎన్.డి.తివారీ: ఇది నీకు రాంగ్ అడ్రస్ కావచ్చు. కానీ నాకు మాత్రం ఈమె రైట్ పేషెంటే అనిపిస్తోంది...
కొండాసురేఖ: ఓహో, మీకు అలా అనిపిస్తోందా!
ఎన్.డి.తివారీ: కన్ఫర్మ్ గా...ముందు నా ఫీజిచ్చివెళ్ళండి.
-కణ్వస

Sunday, October 25, 2009

సెటైర్: వైఎస్సార్ వీలునామాలో సీఎం సీటు!

జగన్ ఇప్పుడేం చేస్తున్నాడో చూద్దామని కేవీపీ జగన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ జగన్ హడావుడిగా కనిపించాడు. లాయర్ల మధ్యలో కూర్చుని కీలకపత్రాలు తిరగేస్తున్నాడు జగన్. కేవీపీ అడుగుపెట్టాడోలేదో, ఇంటినుంచి `యురేకా' అంటూ పెద్దకేక వినిపించింది. అది జగన్ పెట్టిన కేకేనని కేవీపీ ఇట్టే గ్రహించి కంగారుగా జగన్ దగ్గరకు వెళ్లాడు. `ఏమిటిదంతా జగన్?' అంటూ ఆరాతీశాడు.
`దొరికింది అంకుల్... నాకు దొరికింది'
`ఏం దొరికింది...? మొన్న కనిపించకుండాపోయిన కడప బాంబా?'
`కాదంకుల్. నాన్న రాసిన వీలునామాలో నాకు కావాల్సింది దొరికింది'
`ఏంటది?'
`ఇదిగో, ఈ వాక్యంలో ఏముందో చూడంది...`సీఎం సీటు'ని కూడా నాన్న నాకు రాసిచ్చాడు. ఇక నన్ను ఏ శక్తి ఆపలేదు. అధిష్ఠానం అడ్డుకోలేదు. బస్తీమే సవాల్...నాకెవ్వరూ అడ్డురారు. సీఎం సీటు నాదే...'
`చాల్లే ఆపు, వాక్యం పూర్తిగా చదవని...'
`చదువంకుల్...చదువు. అవతల తొలి ఫైల్ మీద సంతకం చేయాలి...'
`ఆఁ...ఇక్కడ సీఎం సీటు అని ఉన్నమాట నిజమే...కానీ దాని పక్కన ఏముందో చూడు...సీఎం సీటును తనఖాపెట్టి చేసిన అప్పుల వివరాలు ఇవి.. `పైన వివరించిన అప్పలన్నీ నా పుత్రుడైన జగన్ మోహన్ రెడ్డికి వారసత్వంగా సంక్రమిస్తాయని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను...' ఈ అప్పులన్నీ కలిపి పదివేల కోట్లకు పైమాటే...'
`సీఎం సీటు తనఖా పెట్టడమేమిటంకుల్?'
`సీఎం సీటు వారసత్వంగా వస్తుందని నీవు అనుకుంటే తప్పులేదుకానీ, సీఎం సీటు తనఖా పెడితే తప్పేమిటట...అయినా ఎంతైనా నీ బాబుకదా.. అసలు విషయం ఏమిటంటే, ఫైళ్లమీద సంతకాలు పెడతానంటూ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నవి...'
`అవి పెట్టుబడులు..ఉరఫ్ లంచాలు...'
`కరెక్టే, కానీ సంతకం పెడితేకదా..పనిపూర్తికాలేదుకాబట్టి అవి అప్పులే అవుతాయి. అదీ, సీఎం సీటును తనఖా కథ...'
`అమ్మో...సీఎం సీటంటే, తనఖాపెట్టిన సీటా...అంకుల్...నువ్వే నన్ను కాపాడాలి'
`ఎవరు అంకుల్...?ఎవరు నువ్వు...?? నీకూనాకూ సంబంధంలేదు. ఆ అప్పుల సీఎం సీటు నీవే ఉంచుకో..బైబై...
- రాజేష్

సెటైర్: రాజకీయనటనకు నందులు

రోశయ్య మాస్టారికి ఆలోచన ఇట్టేరాగానే కేవీపీ రంగంలోకి దూకి 2009 సంవత్సరానికిగాను రాజకీయ నందులను ప్రకటించారు. ఆ వివరాలు ఇవి...
ఉత్తమ రాజకీయ చిత్రం: ప్రజారాజ్యం (కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా, అల్లుఅరవింద్ నిర్మాణ సారథ్యం, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబువంటి స్టార్ల అద్భుత నటనతో ఒక మల్టీ స్టారర్ సినిమాగా ప్రజలను బాగా ఆకట్టుకుంది)
ఉత్తమకుటుంబకథాచిత్రం: తెలుగుదేశం-2009 (చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రాం, తారకరత్న...ఇలా ఫ్యామిలీఫ్యామిలీ మొత్తం కలిసి `తెలుగుదేశం -2009' సినిమాలో బాగా నటించారు)
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్. (ఈ నామినేషన్ కి చిరంజీవి, బాలకృష్ణ కూడా పోటీపడినప్పటికీ యాక్సిడెంటై మంచమీద పడుకుని కూడా నగదుబదలీ పథకం పేరుచెప్పి, అమ్మలారా, అక్కలారా ఇప్పుడే ఈ క్షణమే అకౌంట్లు ఓపెన్ చేయమని చెబుతూ ఎన్టీఆర్ తనదైన శైలి లో అద్భుతమైన నటనను కనబరిచారు)
ఉత్తమనటి: రోజా (తెలుగుదేశం మహిళా అధ్యక్షురలిగా పలు యాక్షన్ సన్నివేశాలలో నటించి, చీప్ లిక్కర్ బాటిల్స్ ని తెగ పగలగొట్టేసింది. చివరాఖర్లో ప్లేట్ తిప్పేసి, కాంగ్రెస్ లో చేరే సీన్లో అద్భుతంగా నటించింది.)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ కల్యాణ్. (ప్రజారాజ్యం సినిమాలో హీరో చిరంజీవికి సహాయపడుతూ, అరుపులూకేకలు పెట్టడం. ఆయన చెప్పిన `పంచలూడదీస్తాం' అన్న డైలాగ్ సినిమాకే హైలైట్.)
ఉత్తమ సహాయ నటి: జీవిత (తన భర్తకేకాకుండా `కాంగ్రెస్ పార్టీ 2009' సినిమాకు కూడా తనవంతు సహాయం చేయడం. తన సినిమా గురించి పట్టించుకోకుండా పక్కహాల్లో నడుస్తున్న ప్రజారాజ్యం సినిమాను విమర్శించడం. వీలుచిక్కినప్పుడల్లా పోలీస్ కేసులు పెట్టడం. చిరంజీవి ఫ్యాన్స్ చేసిన దాడి సీన్లో అద్భుతంగా నటించారు.)
ఉత్తమ హాస్యనటుడు: కేఏ పాల్ (ఈ కేటగిరీలో టఫ్ పైటే జరిగింది. నామినేషన్లలో బాలయ్యబాబు, రాజేశేఖర్, కేసీఆర్ కూడా పోటీపడ్డారు. అయితే మొదటినుంచీ ఎంతో బిల్డప్ ఇచ్చి, టివీషోల్లో అదరగొట్టి, 292 సీట్లూ తనవే అంటూ డైలాగ్ లుకొట్టి చివరకు నామినేషన్ వేసే వేళకు ఓటర్ల లిస్ట్ లో తన పేరు లేదని తెలుసుకుని భంగపడ్డ సీన్ లో కేఏ పాల్ అద్భుతంగా నటించి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.)
ఉత్తమ హాస్యనటి: గంగాభవాని (నోటికొచ్చినకాడికి తాను తిడుతూ, అందర్నీ నవ్వించడంలో అద్భుతంగా నటించింది)
ఉత్తమ దర్శకుడు: చంద్రబాబునాయుడు (`మహాకూటమి' పేరిట భారీ సెట్టింగ్ లతో గ్రాపిక్స్ తో తీసిన సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కలవని మనుషుల్ని కలపడానికి చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా ఈయనగారి దర్శకత్వ ప్రతిభ వెలుగుచూసింది)
స్పెషల్ జ్యూరీ అవార్డ్: చిరంజీవి (స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా అధ్బుతంగా నటించిన ప్రజారాజ్యం సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కాలేకపోయినప్పటికీ జనంచేత జేజేలు చెప్పించుకున్నందుకు)
-రాజేష్

సెటైర్: రోశయ్య `నందీశ్వురులు'

`సీ' బ్లాక్ లో సీఎం రోశయ్య చాలా అసహనంగా అటూఇటూ తిరుగుతున్నారు. బట్టతలను పదేపదే తడుముకుంటున్నాడు. ఆలోచన ఎంతకీ తెగకపోవడంతో సలహాకోసం కేవీపీని కేకేశారు. `ఈ పెద్దాయన ఇప్పుడెందుకు పిలిచాడా...ఏం లెక్కలు చెప్పమంటాడో ఏమో...అవి ఏవరి పీకకు చుట్టుకుంటాయోఏమో...చెబితే ఒక తంటా, చెప్పకపోతే మరో తంటా. సీనియర్లు, జూనియర్లు తననుమరీ ఫుట్ బాల్ ఆడేస్తున్నార'నుకుంటూ పెదాలు తడుముకుంటూ గొణుక్కుంటూ కేవీపీ లోపలకు వచ్చాడు.
`చూడు కేవీపీ, నాకీ లెక్కతేలడంలేదు.'
`అదేంటీ, మీరే ఓ లెక్కలమాస్టారాయె...' నసిగాడు కేవీపీ
`కావచ్చు, కానీ ఈ లెక్క రావడంలేదు. అసలు ఎన్ని నందులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? చెప్పు..' సూటిగా అడిగాడు రోశయ్య.
రోశయ్యలో బెత్తంపట్టుకున్న మాస్టారు కేవీపీకి. బుర్రగోక్కున్నాడు.
కేవీపీకి అర్థంకాలా. నందులు ఇచ్చేశాక ఇప్పుడు నందులంటాడేమిటీ ఈయన! పెద్దరికం రావడంతో ఇట్టే మరచిపోతున్నాడేమో...అనుకుంటూ `అదేంటిసార్, నందులు ఇచ్చేశాంగా...'
`ఇచ్చేశారా! ఎప్పుడు? ఎవరికి?' రోశయ్య ప్రశ్నమీద ప్రశ్న సంధించారు.
కేవీపీ నసుగుతూ చెప్పాడు..గుర్తుతెచ్చుకుంటూ, `గమ్యం ...ఉత్తమ చిత్రం, రవితేజ ఉత్తమ హీరో, అరుంధతీ...ఉత్తమ...'
`ఛత్...ఇవికావు నేను అడిగేది, రాజకీయ నందుల గురించి.'
`రాజకీయ నందులా! ఇవిఎక్కడినుంచి వచ్చాయి...!'
`రాలేదు, రప్పించాలి. చూడు మిస్టర్ కేవీపీ, నువ్వుఏం చేస్తావో నాకు తెలియదు. 2009 సంవత్సరానికి వెంటనే రాజకీయ నందులు ప్రకటించాలి. వెంటనే వెళ్ళి పని చూడండి...'
.................... 2 ....................

కేవీపీ బయటకురాగానే తలుపుచాటునుంచీ వింటున్న కొండా సురేఖ కనిపించింది.
`ఏమిటిది? ఛండాలంగా...' అసహనంగా అన్నాడు కేవీపీ.
సురేఖ ముఖం తుడిచేసుకుంటూ,
`ఏంటీ పెద్దాయన పందులూ, గిందులూ అంటున్నాడు.'
కేవీపీకి మరోసారి చికాకేసింది. `పెద్దాయన అన్నది పందుల గురించికాదు, నందుల గురించి. సగం వినీ సగం వినక ప్రతిదీ హడావుడి చేయడం నీకలవాటైపోయింది.'
`నందులా భలేభలే..మళ్ళీ ఎవరికీ...?
`మనకే, అంటే రాజకీయనాయకులు ఇవ్వాలంటున్నాడు.'
`నందులన్నీ ఆయనే కొట్టేద్దామని ఆశదోశ అప్పడం..వడ...'
`ఆపు,నీ మెనూ...ఆయనేం ఈపోటీలో లేరు. అసలు ఆయనే ఒక పెద్దనంది. ఇంకా ఆయకెందుకు నంది...'
`అర్థంకాలా...'
`మరి,అదే, సీనియర్లను గౌరవించడం నేర్చుకో. రోశయ్యకు వైఎస్సారే శివయ్యలాంటివారు. వైఎస్సారీశ్వరునిమీద ఈగలు వాలితేచాలు తన శృంగాలతో పొడిచిపొడిచి చంపేవారు. నందిపాత్ర బాగా పోషించడంతో ఇప్పుడు ఇతరులకు నందులు ఇవ్వాలనుకుంటున్నారు...అదీ స్టోరీ....' చాలా తెలివిగా చెప్పాననుకున్నాడు కేవీపీ.
`హమ్మయ్యా, ఈ పెద్దాయన పోటీలో లేడుకదా...అయితే సంతోషమే. నాకో సందేహం.;
`ఏమిటో చెప్పు....'
`మరణానంతరం కూడా నందీ అవార్డులు ఇస్తారా...?'
`ఈవిషయం రోశయ్య చెప్పలేదు. అయినాఇదేం ప్రశ్న.'
`నా కోరిక తీరాలంటే, కృతజ్ఞతాభావం చెప్పుకోవాలంటే ఇదే చక్కని మార్గం. మరణానంతరం కూడా నందులు ఇస్తే, వైఎస్సార్ సార్ కి పది నందులు రావడం ఖాయం. ఆయన ఎలాగో లేరుకనుక ఆ నందులన్నీ మా జగన్ బాబే అందుకుంటారు. అలా జగన్ షోకేస్ లో పదినందులు చేరినట్టవుతుంది. సీఎం పోస్టు ఇప్పించలేకపోయినా, నందులన్నా ఇచ్చానన్న తృప్తి నాకు మిగులుతుంది'
`ఏడ్డినట్టుంది, నీ రాజకీయం. ఒక నందిలాంటి రోశయ్యనే చూసి జడుసుకుంటుంటే, పది నందులు షోకేస్ లో పెడతావా..చాల్లే పో...'
`సార్ మరో ఆశ...'
`మళ్ళీఏంటీ?'
`అరుంధతిలో నటించిన అనుష్కకు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారుగా, అలాగే నిరంతరం, ప్రతిక్షణం జగన్ సీఎం కావాలంటూ `ఆరంధి' (ఆ యావ)లోనే ఉంటున్న నాకూ స్పెషల్ అవార్డు ఇవ్వకూడదూ...'
`ఆరంధి' ఎక్కవయ్యే, రోశయ్య మాస్టారికి దూరం అయ్యావ్. నంది తరువాత నీ పదివి సంగతి ముందు చూసుకో..'
కేవీపీ పరుగుపరుగునవెళ్ళి రాజకీయ నందుల కోసం జ్యూరి ఏర్పాటు చేశాడు. వారంరోజుల్లో రాజకీయ నందులను ప్రకటించారు.
-కణ్వస

Sunday, October 18, 2009

సెటైర్ : సూక్తుల కేసీఆర్!

విలేఖరి లంబు తెలంగాణభవన్ వైపు ఓసారి చూశాడు. ఎందుకో ఆ భవన్ ని చూడగానే అతగాడికి అరుంధతి సినిమాలోని పాడుపడ్డ కోట గుర్తుకువచ్చింది. భవన్ వైపు అడుగులు వేయాలంటే భయపడుతున్నాడు. ఎప్పుడు దగ్గరకు వెళ్ళినా లోపలి నుంచి కేసీఆర్ మాటలు కర్ణకఠోరంగా వినబడుతుండేవి. ఆ ముచ్చట యాదవగానే లంబు చెవుల్లో కేసీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ లు వినిపించసాగాయి....
`ఓరేయ్...రారా...ఇన్నాళ్లుగా తెలంగాణ ఇవ్వకుండా కుళ్లబెట్టి, బొందపెట్టి మీరు కులుకుతార్రా...రండిరా...ఓసేయ్ బొమ్మాళీ...(ఈవెడవరో! సోనియానా?) తెలంగాణ ఇవ్వకుంటే నిన్నునేను వదలా...వదలను బొమ్మాళీ వదల. ఓరేయ్ రా... అడుగుముందుకేయ్. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీ బొందకు దగ్గరవుతుందిరా...నిన్ను వదలా...నీకు బొందపెడ్తా...పాడికడ్తా...రారా..రా...'
అందుకే లంబుకు తెలంగాణభవన్ కు వెళ్లాలంటే భయం. కానీ ఏంచేస్తాడు పాపం. ఎడిటర్ హుకం చేశాడయె...`వెళ్ళు, తెలంగాణభవన్ కు వెళ్ళు. కేసీఆర్ ప్రెస్ మీట్ పట్టాడు. ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడట...వెళ్ళి కవర్ చేయ్..'
ఇక, గతిలేక లంబు తెలంగాణభవన్ వైపు భయంభయంగా అడుగులువేసుకుంటూ వెళ్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చేసరికి దుర్గంధం స్థానే సుగంధం ముక్కుపుటాలకు సోకింది. మళ్ళీ అరుంధతి సినిమా గుర్తుకువచ్చింది. భయంగా చూశాడు. `ఇది భ్రాంతికాదుకదా...' అనుకుని ఒళ్లు గిల్లుకున్నాడు. కాదు, నిజమే...పరిమళ అగర్ బత్తి వాసనలు వస్తున్నాయి. అంతలో కేసీఆర్ ఒక సాధుపుంగవునిలా, శాంతమూర్తిలా ఎదురుపడ్డారు.
`రావోయ్ లంబు రా... ఎంటీ సంగతులు?'
`అదేంటి సార్....అది నేను అడగాల్సిన ప్రశ్న'
`అంతా బాగున్నారా?'
`సార్! మళ్ళీ నేను అడగాల్సిన ప్రశ్న వేస్తున్నారు. సార్, మీ పార్టీలో అంతా బాగున్నారా?'
`లోకాంసమస్తాం సుఖినోభవంతు'
`అదేంటీసార్! మీనోట సంస్కృతం...'
`దీని అర్థం తెలుసా?'
`అంటే, కొద్దిగా తెలుసు సార్..పూర్తిగా...'
`నేను చెప్తా రాస్కో...ఈ లోకాలన్నీ చల్లగా ఉండాలి. ఎవ్వరూ కొట్టుకోకూడదు. గిల్లుకోకూడదు'
`అంతా కలిసిఉంటేనేకదా సార్...చల్లగా ఉండేది. కలిసిఉంటే కలదు సుఖం అని కూడా మనవాళ్లు అన్నారుగా. అలాంటప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎందుకు సార్?' అమాయకంగా అడిగాడు లంబు.
`అది ఉద్యమం. ఆగదు. ఇది సూక్తి ... సాగుతూనే ఉంటుంది.'
ఈసారి లంబుకి నిజంగానే అర్థంకాలేదు. బుర్రగోక్కున్నాడు.
`యత్రనారీ పూజ్యంతు తత్ర...'
`మళ్లీ, ఇదేంటీసార్...!?'
`అంటే, ఎక్కడ మహిళలు పూజింపబడుదురో...'
`ఆంధ్ర ఉద్యోగులను మరెందుకు వెళ్లగొడుతున్నారు సార్. అందులో మహిళలు కూడా ఉన్నారుగా...'
`అది ఉద్యమం. నీకో విషయం తెలుసా... నిప్పులు చిమ్మతు నింగికి నేనెగిరితే నిభిడాశ్చర్యంతో వీరే...నెత్తురు కక్కుతూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే... ఇక్కడ వీరే అంటే...'
మళ్ళీ ఇదేంటీసార్...!
`అలజడి మన జీవితం కావాలి, ఆందోళన మన ఊపిరి కావాలి. తిరుగుబాటు మన వేదాంతం కావాలి...'
`సార్...మీకేమైందిసార్?'
కేసీఆర్ పాతసినిమాలోని పాట అందుకున్నాడు...
`నమ్మరే, నేను మారానంటే నమ్మరే...నేనొకనాడు...'
`నమ్ముతాం సార్...నమ్ముతాం. ఆపండిసార్ మీ పాట..'
`అయితే, ఈ కవిత విను...చిరకాలం జరిగిన మోసం...బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు...ఇంకానా ఇకపై సాగవు.'
కేసీఆర్ సూక్తులకూ, కవితలకు లంబు భయపడి ఒక్క గెంతుగెంతాడు. మెట్లు ఎక్కాడో, జారాడో తెలియదు. తలుపులు తోసుకుని వచ్చాడో, లేక విరగ్గొట్టుకు వచ్చాడో అంతకన్నా తెలియదు. క్షణాల్లో బయటకువచ్చేశాడు. ఆ పాత బూతులకంటే, ఈ కొత్త కవిత్వాలు వినడం మరీ కష్టమనిపించింది. అంతే, ఉరుకో..ఉరుకు. వెనక నుంచి...తెలంగాణ భవన్ నుంచి ఇంకా సూక్తులు, శ్లోకాలు వినబడుతూనే ఉన్నాయి...
కణ్వస

Saturday, October 17, 2009

సెటైర్: గ`మ్మత్తు' కేసీఆర్

కేసీఆర్ ప్రవర్తన చాలా చిత్రవిచిత్రంగా ఉంటున్నది. క్షణంలో మాటమార్చేస్తున్నారు. అవునన్నది కాదంటున్నారు. కాదన్నది అవునంటూ అడ్డంగా వాదించేస్తున్నారు. ముఖం చూస్తుంటే కాసేపు `ఫుల్' కొట్టేసినట్టుగా ఉంటే, మరికాసేపు `చుక్క' ముట్టనట్టుగా ఉంది. అసలు ఆయనలో ఇద్దరు కేసీఆర్లు కనిపిస్తున్నారు. `ద్విముఖ జీవి'ని చూసినట్టనిపిస్తోంది. ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకునేముందు ఆయనగారి `డబుల్ ధమాకా' ఏంటో చూద్దాం.
సమైక్యవాదం:
`ముందు ఆంధ్రప్రదేశ్...నేను అంటున్నది ముందు...`మందు' కాదు... మీడియా, సరిగా రాసుకోండి...ముందు ఆంధ్రప్రదేశ్. ఆ తరువాతనే తెలంగాణ. (ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకున్నతరువాత మొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ అన్న ఈ మాటల్లో సమైక్య వాద లక్షణాలు కనిపించాయి)

`నేను అలా అన్నానా...మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. ముందు ఆంధ్రప్రదేశ్ లేదూ, `మందూ' అంతకన్నాలేదు. తెలంగాణ నా ప్రాణం. అదే నా ఊపిరి. తెలంగాణ కోసం సాయుధపోరాటం చేస్తాం. ఈ ఆంధ్రావోళ్లను రానివ్వం. వెళ్లగొడతాం...బడితపూజ చేస్తాం...బొందలుపెడతాం.'(హైదరాబాద్ వచ్చాక అన్న మాటలివి)
సోనియా ఓ దేవత:
`సోనియాగాంధీ ఓ దేవత. ఆమె చాలా మంచివారు. పరిస్థితిని సరిగా అర్థం చేసుకోగలరు. (ఢిల్లీలో అన్న మాటలు)
`సోనియానా, గీనియానా మాకెందుకూ, మా పని మాకు గావాల్న. ఈళ్ల గురించీ, ఆళ్ల గురించి మాట్లాడే టైం లేదు. ఉద్యమం చేయాల్న' (హైదరాబాద్ వచ్చాక)
రోశయ్యలో మాహాత్మా:
`రోశయ్య, ఆ పెద్దాయనలో నాకు ఓమహాత్మ, ఓ పొట్టి శ్రీరాములు కనిపిస్తున్నారు.' (ఢిల్లీలో చెప్పింది)
`రోశయ్యను నేను పొగడ్లా, మాకేం అవసరం. అసలు ఈ కాంగ్రెసోళ్లను మేము పొగడం. మా పన్లు మాకున్నాయి. ప్రీజోన్ విషయంలో పోరాటం ఎలా చేయాలాని మేం ఆలోచిస్తున్నాం. తీరకలేదు. ఏమంటావ్ ఈటెల రాజేందర్' (హైదరాబాద్ ప్రెస్ మీట్ లో)
వైఎస్సార్ - వరదలు;
`వైఎస్సార్, జగన్ వల్లనే వరదలొచ్చాయ్. హైదరాబాద్ రాగానే అసలు సంగతి చెప్తా' (ఢిల్లీలో)
`వైఎస్సార్ నేనూ చాలాకాలం కలిసే ఆలోచించాం. వాళ్లబ్బాయ్, మా అబ్బాయ్ రామారావుతోటి వాడే. ఏమంటావ్ ఈటెల...జగన్ వయసు ముప్పయిమూడా, ముప్పయినాలుగా...?' (కొడుకు వయసు గుర్తురాక ఈటెలను అడిగి కన్ ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది) జగనూ, మావాడూ ఒక ఈడువాళ్లు. జగను మా అబ్బాయిలోంటి వాడు.'
అది నోరా..? అవేం మాటలు..?? కాసేపు హైవేమీద, అంతలో కాసేపు గతుకుల రోడ్డుమీద పోతున్నట్టున్నాయేంటీ కేసీఆర్ మాటలు..!!.అని మీకూ అనిపించిందా..అయితే అలా ఎందుకు కేసీఆర్ మాట్లాడారో అసలు కారణం చెబుతా...చదవండి..
అసలు కారణం:
ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి డాక్టర్ ని కలిసినప్పుడు ఆయనగారు కేసీఆర్ చేత మందు మాన్పించే ప్రయత్నం చేశారు. మీకు `మందు' కావాలా, ఉద్యమం కావాలా? సిన్సియర్ గా చెప్పండి...అని డాక్టర్ అడిగారు.
ఆ బాలహీన క్షణంలో కేసీఆర్ తడుముకోకుండా...`నాకు ఉద్యమమే కావాలి. తెలంగాణ నా ప్రాణం...నా ఊపిరి....' అంటూ ఆవేశపడ్డారు. పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వెయ్యాలన్నట్టుగా డాక్టర్ వెంటనే కేసీఆర్ నుంచి ప్రామిస్ తీసేసుకున్నారు. మాటమీద నిలబడే తత్వం ఉన్నవాడు కాబట్టి కేసీఆర్ ఆ క్షణం నుంచీ మందు మానేశారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ కేసీఆర్ లో మార్పులొచ్చేశాయి. ద్విముఖజీవిలా మారిపోయారు. ఏ ముఖం ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థంకాక మీడియా చేతులెత్తేసింది. ఈ వింత ధోరణికి కారణం ఏమిటా అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. `మందు' కొట్టేవాడు ఒక్కసారిగా మానేస్తే, అంటే ఫుల్ నుంచి నిల్ అయితే, కొన్నాళ్లు ఫల్ కొట్టినట్టే హాంగోవర్ తప్పదట. కాసేపు ఫుల్ పవర్. అంతలో నిల్ `నీరసం' పట్టేస్తుంటాయి. ఈ గ`మ్మత్తు' చేష్టలే ఇప్పుడు మనం కేసీఆర్ లో చూస్తున్నాం. ఇదీ సంగతి...నారాయణ....నారాయణ...
- కణ్వస

సెటైర్: ఒబామా నోబెల్ వెనుక బుష్ హస్తం?!

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మేథావులు బుర్రలుగోక్కుంటున్నారు. తనకు నోబెల్ శాంతి ప్రైజ్ వస్తే వీళ్లంతా ఇంతలా బుర్రెందుకు గోక్కుంటున్నారో ఓ పట్టాన ఒబామాకు అర్థంకాలేదు. ఆమాటకొస్తే, తన పేరు నోబెల్ జ్యూరీ ఎందుకు సెలెక్ట్ చేసిందో కూడా నల్లజాతి శ్వేతసౌధాదీశునికి అర్థంకావడంలేదు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. ప్రపంచ పటంలో తనకు గర్తున్న దేశాల అద్యక్షులకూ, ప్రధానులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, అర్జెంటీనా, చైనా...ఇలా ఆయా దేశాల అధినేతలను అడిగాడు. ఏమిటో వాళ్లు చెప్పిందేదీ మన బ్లాక్ చాంపియన్ కి సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏ దేశాలున్నాయా...అని ఆలోచిస్తుంటే, వెంటనే మొన్నీమధ్యనే జి-20 దేశాల సమావేశాల్లో కలుసుకున్న భారత ప్రధాని మన్మోహన్ చటుక్కన గుర్తుకువచ్చారు. అంతే ఢిల్లీకి ఫోన్ కలిపాడు.
ఒబామా: గుడ్ మార్నింగ్ మన్మోహన్ సింగ్ జీ.. నాకో సందేహం.
మన్మోహన్: ఆఁ..ఆఁ...గుడ్ ఈవినింగ్... త్వరగా చెప్పండి, అవతల మేడం సోనియా పిలుస్తున్నారు?
ఒబామా: అదే, అర్థమైచావడంలేదు.
మన్మోహన్: ఏమిటీ, చావడం అర్థంకావడంలేదా...?
ఒబామా: చావడం కాదు, రావడం... అదే, నోబెల్ ప్రైజ్ నాకెందుకు ఇచ్చారో అర్థం కావడంలేదు.
మన్మోహన్: అదా! నీ బండపడ... ఇందులో అర్థంకాకపోవడానికి ఏముందీ...జార్జి బుష్ వల్లనే కదా నీకీ అవార్డు వచ్చింది.
ఒబామా: అదేంటీ, జార్జి బుష్ నాకు శత్రువు, ఆయన వల్ల నాకు నోబెల్ ప్రైజ్ రావడమేమిటీ? అర్థంకాలా, కాస్తంత వివరంగా చెప్పండి. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా...
మన్మోహన్: అసలు కథ చెప్పాలంటే, మనం ఆరువేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.
ఒబామా: యూమీన్..సిక్స్ థౌజండ్ ఇయర్స్...!
మన్మోహన్: అవును, సిక్స్ థౌజండ్ ఇయర్సే. అప్పట్లో మా ఏరియాలో ద్వాపరయుగం నడిచేది. ఆకాలంలో నరకాసురుడు అనే ఓ విలన్ ఉండేవాడు. వాడు భూమ్మీద శాంతిలేకుండా చేశాడు. యుద్ధాలేయుద్ధాలు. చావులేచావులు. భూమికి పెనుముప్పుగా మారాడు.
ఒబామా: ఓహ్ఁ...ఈజిట్?
మన్మోహన్: ఎస్, ఇటీజ్ ...ఇక అప్పుడు శ్రీకృష్ణుడు తన వైఫ్ సత్యభామతో కలిసి వార్ కి వెళ్ళాడు. నరకాసురుణ్ణి వధించి ప్రపంచానికే పీస్ తీసుకొచ్చాడు. జనం ఆనందంగా దీపావళి చేసుకున్నారు.
ఒబామా: ఓహ్ఁ... గ్రేట్. కానీ, నాదో డౌట్. ఈ కథకీ, నా నోబెల్ కీ ఏమిటట సంబంధం?
మన్మోహన్: వస్తున్నా, అక్కడికే వస్తున్నా... ఒక వ్యక్తి హీరో కావాలన్నా, లోకరక్షకునిగా మారాలన్నా, అతనే గొప్పవాడవ్వాల్సిన పనిలేదు. అతని శత్రువు లోకకంఠకుడు అయితే చాలు. అలాంటి ఎనిమీని ఓడిస్తే, అఖండ కీర్తి అందుకోవడం ఖాయం. ఇదే ఈ కథలోని నీతి.
ఒబామా: అర్థంకాలా...
మన్మోహన్: (మనసులో) వీడికెవడ్రా ఇచ్చింది నోబెల్ ప్రైజ్. (పైకి) మీ ఏరియాలో బుష్ లేడూ, వాడూ, నేనిప్పుడు చెప్పిన కథలోని నరకాసురుడు ఒకటే టైప్. ఇప్పుడు అర్థమైందా...
ఒబామా: అంటే, బుష్ వల్లనే నాకు నోబెల్ వచ్చిందా?
మన్మోహన్: ఎస్. ఇదే కరెక్ట్. బుష్ యుద్ధాలు చేసి, సిటీలనుకూల్చి, ఆర్థికమాంద్యం తెచ్చేసి, టెర్రర్ పెంచి ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేశాడు.
ఒబామా: ఎస్..ఇదీ కరెక్టే... నా ఎన్నికల ప్రచారంలో ఇదే ఘాటుగా చెప్పాను.
మన్మోహన్: అదీ సంగతి, అలా నువ్వు ఘాటుగా బుష్ ను తిట్టబట్టీ, ఓడించబట్టీ, నోబెల్ జ్యూరీ వాళ్లకు నచ్చేసి నీకు నోబెల్ శాంతి ప్రేజ్ ఇచ్చారు.
ఒబామా: మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అయితే మన్మోహన్ జీ... మీరు నాకో మాటివ్వాలి.
మన్మోహన్: ఏంటది? త్వరగా చెప్పు, మేడం కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు.
ఒబామా: ఈ విషయం అమెరికన్ మీడియాకు చెప్పకండి. ప్లీజ్.

- కణ్వస

సెటైర్ :`రేచీకటి' రోశయ్య పగటి దీపావళి

రోశయ్య వ్యాఖ్యలపై బోలెడు జోకులొచ్చేస్తున్నాయి. అలాంటి జోకుల్లో ఒకటి దీపావళి టపాసుగా మీకోసం...
సెప్టెంబర్ 2 : ముఖ్యమంత్రి వైఎస్సార్ గారెక్కిన హెలికాప్టర్ కనపిచండంలేదు. అక్కడెక్కడో నల్లమల అడవుల్లో చిక్కుకుపోయినట్టు చెబుతున్నారు. చీకటి పడుతోంది. ఇక మీ ముఖ్యమంత్రిని మీరే కాపాడుకోవాలి. స్థానికులు వెతికి గాలించండి. ఇక్కడ మేము చేసేది ఏమీలేదు. చీకటి పడుతోంది. వెళ్లండి...మీ సీఎంను మీరే వెతుక్కోండి....
అక్టోబర్ 2: వరదలొచ్చేశాయి. పైనుంచి వరదనీరు రావడంతో ఏ క్షణంలోనైనా మీ ఊర్లు మునిగిపోవచ్చు. చీకటి పడుతోంది. ఇక మీ ఊర్లను మీరే కాపాడుకోండి. ప్రభుత్వం చేసేదేమీలేదు. ఈ రాత్రికి మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి. మీరు,బతికుంటే తీరుబడిగా వచ్చి పలకరిస్తాం. చీకటి పడుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి.
అక్టోబర్ 17: దీపావళి వచ్చేసింది. చీకటి పడుతోంది. ఈలోపే టపాకాయలు కాల్చేసుకోండి. చీకటి పడ్డాక ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పొద్దున్నే కాల్చుకుంటే మంచిది. రాత్రిపూటైతే మీ ఒళ్లూఇళ్లూ మీరే కాపాడుకోవాలి.
నవంబర్ 2 : చీకటి పడుతోంది. పెద్దవాడ్నయ్యాను. నేనేమీ చేయలేను. ఇక మీ కొత్త సీఎంను మీరే వెతుక్కోండి.
- కణ్వస

Sunday, October 11, 2009

సెటైర్: `సీఎం' ఫ్లూ స్లోడౌన్

లంబు: హమ్మయ్యా, మొత్తానికి `సీఎం ఫ్లూ' తగ్గుముఖం పట్టిందిరా.
జంబు: సీఎం ఫ్లూనా...! ఇదేంటిరా స్వైన్ ఫ్లూకి కొత్త వర్షనా..?
లంబు: కొత్త వర్షన్ కాదు, అధిష్ఠానానికి పెద్ద టెన్షన్. నిన్నమొన్నటి వరకు సీనియర్లు, జూనియర్లంతా సీఎం ఫ్లూకి ఎటాకైనవాళ్లే.
జంబు: ఎట్లా... ఇంతకీ ఈ సీఎం ఫ్లూ ఏంటీ, దాని సింప్టంమ్స్ ఏమిటీ..?
లంబు: ఈ వ్యాధి సోకితే, పేషెంట్ కీ ఏ కుర్చీ చూసినా సీఎం ఛైర్ లాగానే కనబడుతుంటుంది. దాన్ని అమాంతం లాక్కుని కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కువగా పగటి కలలు కంటుంటారు. తాము సీఎం అయిపోయినట్టూ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టేసినట్టూ , హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నట్టూ కలలు కంటుంటారు. దొరికిన చిత్తుకాగితాలుపోగేసి మొదటి ఫైల్ మీద సంతకం పెట్టినట్టు ఫీలైపోతుంటారు. మీడియా మైక్ చూడగానే మైకం కమ్ముతుంటుంది. అసలు, స్వైన్ ఫ్లూ వస్తే పేషెంట్ కే టెన్షన్. కానీ సీఎం ఫ్లూ వస్తే అధిష్టానానికి టెన్షన్...ప్రజలకు ఎటెన్షన్...మీడియాకు కలెక్షన్స్.
జంబు: వ్యాధి ముదిరితే మధ్యంతర ఎలెక్షన్స్. బాగానే ఉంది, ఇంతకీ సీఎం ఫ్లూ ఎంత మందికొచ్చిందేంటీ?
లంబు: చెబుతా లిస్ట్ రాసుకో...కాంగ్రెస్ లో...1. జగన్, 2. వీహెచ్, 3. డీఎస్, 4. కేకే, 5. జానారెడ్డి, 6. జైపాల్ రెడ్డి, 7....
జంబు: చాల్చాలు, ఇంతమందా...! ఇంతకీ ఈ రోగానికి మందుందా?
లంబు: లేకేం, హైకమాండ్ పూటకో డోసేస్తునే ఉంది.
జంబు: ఎవరికీ?
లంబు:రోశయ్యకు.
జంబు: జబ్బు వాళ్లకైతే, మందు రోశయ్యకెందుకూ..!?
లంబు:కాంగ్రెస్ ట్రీట్ మెంటే అంత. రోశయ్యకు ఓవర్ డోసిచ్చి బలోపేతం చేస్తే మిగతా వాళ్లంతా కోమాలోకి వెళ్ళిపోతారన్లే...
జంబు: ఇదేనేట్రా, సీఎం ఫ్లూ తగ్గుముఖం పట్టడమంటే...!
- మన్నవ

సెటైర్: క్విక్ గన్ జగన్...మైండ్ బ్లాక్!

లంబు: ఏరా జంబుగా, క్విక్ గన్ జగనేందిరా సైలెంటైపోయాడు?
జంబు: క్విక్ గన్ జగనా? వాడెవడూ...క్విక్ గన్ మురుగన్ బ్రదరా?
లంబు: కాదురా, వైఎస్సార్ సన్నూ..మన జగనన్న..సైలెంట్ గా ఉన్నాడెందుకా అనీ...!
జంబు: గన్ లో బులెట్లయిపోయాయేమోరా.
లంబు: బులెట్లేందిరా?
జంబు: అదేరా, మొదట్లో సానుభూతి బులెట్ గురెట్టాడా, ఆ తరువాత భావోద్వేగం బులెట్ వదిలిపెట్టాడా, ఆపై సాక్షి మిషన్ గన్ తో రోజుకో 20 బులిటెన్లు వదిలిపెట్టాడా..ఏదీ టార్గెట్ కి తగల్లేదాయే. అంతేకాక, రోశయ్యకే ఫుల్ సపోర్టిచ్చేస్తూ హైకమాండ్ ఇచ్చిన దెబ్బకి మనోడికి మైండ్ బ్లాకైపోయుంటుంది.
లంబు: అంటే, ఎవరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో, వాళ్లే కొట్టారన్నమాట.
జంబు: అంతేగామరీ, మొక్కై వొంగనిదే మానై వొంగదని ఆళ్లకీ అర్థమైపోయింది.
లంబు: పాపం మనోడికే ఇంకా అర్థంకాలా...
- కణ్వస

Saturday, October 10, 2009

సెటైర్: కేసీఆర్ తిట్లకు అర్థాలే వేరులే

కేసీఆర్ వాక్చాతుర్యం అంతాఇంతాకాదు. ఆయన నోరు విప్పితే చాలు పవర్ ఫుల్ పదాలు దూకేస్తుంటాయి. అందుకే ఆయనగారి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమవుతుంటాయి. గొడవ ఎక్కువైతే, కేసీఆర్ చాలా తాపీగా `అంత లొల్లెందుకు, ఇదంతా మా తెలంగాణ యాస. మేమట్టనే అంటాం' అంటూ తేల్చిపారేస్తారు. కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకుని ఢిల్లీ నుంచి వరద బాధితులను పరమర్శించడానికని రాష్ట్రంలో కాలుమోపగానే తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా హెలికాప్టర్ దిగుతూ పడ్డారు కూడా...కొద్దిలో ముక్కు నేలకు తాకే ప్రమాదం తప్పిపోయింది.
కేసీఆర్ తాజాగా విసిరిన పవర్ ఫుల్ మాటలు, వాటి అర్థాలు ఓ సారి చూద్దాం...
`దిక్కుమాలిన చావుచచ్చిన వైఎస్సార్ పీనుగ హైదరాబాద్ కు రాకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్రచేపట్టింది ఎవరు?'
కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిపదార్థం చూద్దాం...
దిక్కుమాలిన= అనూహ్యంగా, దిగ్భ్రాంతికరంగా
చావుచచ్చిన= మరణించిన, మృతిచెందిన, కాలం చేసిన, స్వర్గస్థులైన, దివంగతులైన.
వైఎస్సార్ పీనుగ = వైఎస్సార్ శవం, వైఎస్సార్ మృతదేహం, వైఎస్సార్ పార్థివ శరీరం
ఇక కేసీఆర్ వ్యాఖ్యలోని అసలు భావం చూద్దాం..
`దిగ్ర్బాంతికరంగా, అనూహ్యంగా మరణించిన వైఎస్సార్ పార్థివ శరీరం హైదరాబాద్ కు చేరకముందే జగన్ ని సీఎం చేయాలని రాజ్ భవన్ యాత్ర చేపట్టింది ఎవరు?'
కేసీఆర్ తిట్లకు అర్థాలే వేరులే అని ఇప్పటికైనా మీరు నమ్ముతారా...
- కణ్వస
Tags: Telangana KCR Telugu

Saturday, October 3, 2009

సెటైర్: చూస్తూనే ఉండండి టివీ 99

టివీ  99 న్యూస్ ఛానెల్ లో మళ్ళీ వార్తలొచ్చేస్తున్నాయ్. అసలే వానలు, ఆపైన వరదలు రావడంతో జనం కూడా రాత్రంతా టివీ సెట్లకే అంటిపెట్టుకున్నారు. టివీ 99 న్యూస్ యాంకర్ బ్రహ్మం స్క్రీన్ మీదకొచ్చేసి తన సహజధోరణిలో ఓ నవ్వునవ్వేసి, కర్నూలు ప్రతినిధి శ్రీరామ్ ని లైన్లో కలిపాడు.
బ్రహ్మం; హలో శ్రీరామ్,శ్రీరామ్: .....
బ్రహ్మం; వినబడటంలేదా... శ్రీరామ్...శ్రీరామ్
శ్రీరామ్: అడగండి బ్రహ్మం, (తనలో) అడిగేవాడికి చెప్పేవాడికి లోకువేగా.
బ్రహ్మం; కర్నూలులో వరద పరిస్థితి ఎలా ఉంది?
శ్రీరామ్: ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావ్ బ్రహ్మం. రాత్రంతా అడుగుతూనే ఉన్నావ్. చెబుతూనే ఉన్నా.
బ్రహ్మం; తప్పదు శ్రీరామ్. ఎప్పటికప్పుడు వార్తలందిస్తామని మనం కమిటయ్యాం.
శ్రీరామ్: ఎవడినడిగి కమిటయ్యారట. ఇక్కడ కాళ్లవరకు నీరొచ్చి తడిసిపోతుంటే.
బ్రహ్మం: చాలా చక్కని విషయం చెప్పావ్ శ్రీరామ్. మా ప్రతినిధి కాళ్లవరకు నీళ్లొచ్చాయ్. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు మీకందిస్తుంటామ్..ఇప్పుడో చిన్న బ్రేక్.
.. బ్రేక్....బ్రేక్...బ్రేక్...
బ్రహ్మం; వెల్ కమ్ బ్యాక్. ఆఁ చెప్పు శ్రీరామ్. కాళ్లకిందకు నీళ్లొచ్చాయ్ అని చెప్పావ్. ఇక్కడ మన ఎనలిస్ట్ బట్టతల బాపూరావ్ కాచుకుని ఉన్నార్. చెప్పు..చెప్పు...
శ్రీరామ్: నా చెప్పుతెగి నేనేడుస్తుంటే, మధ్యలో వాడూ వచ్చాడూ...సర్లే, ఆఫీస్ ఉప్పుతింటున్నాక చెప్పక తప్పుతుందా... అడగండి.
ఎనలిస్ట్ బాపూరావ్: చూడు శ్రీరామ్. కాళ్లవరకు నీళ్లొచ్చాయని చెప్పావ్. అరికాళ్లవరకా...మోకాళ్ల వరకా?
శ్రీరామ్: మోకాళ్లవరకు.
ఎనలిస్ట్ బాపూరావ్: కుడిమోకాలా, ఎడమమోకాలా?
శ్రీరామ్: రెండు మోకాళ్లురా..నీ యవ్వాఁ...
బ్రహ్మం: కూల్ డౌన్ శ్రీరామ్... కూల్ డౌన్. ఇంతకీ బాపూరావ్ గారు ఎందుకని ఆ ప్రశ్న వేశారో వారినే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బాపూరావ్.
ఎనలిస్ట్ బాపూరావ్: ఇప్పటికే మోకాళ్ల వరకు నీళ్లొచ్చాయంటే, మరో రెండు గంటల్లో మీ వాడి బొడ్డుదాకా కూడా నీళ్లు రావచ్చు. ఇన్ నైంటీన్ సెవంటీ సెవన్ లో దివిసీమలో కూడా...
బ్రహ్మం: బాపూరావ్ గారూ మీ ఎనాలసిస్ ఆపండి. ఇప్పుడొక కాలర్ మనకోసం ఎదురుచూస్తున్నారు. హలో...హలో చెప్పండి...
కాలర్: ఇందాకటి నుంచి  కర్నూల్ జిల్లా ప్రజల గురించి చెప్పకుండా మీ ప్రతినిధికి కాళ్లకిందకు నీళ్లొచ్చాయా, ఏ మోకాలు తడిసిందని చర్చ పెడతారా...ఆయ్ఁ... పనిలేని ఆ బట్టతల బాపూరావ్ గాడ్ని ఎందుకు పిలిచార్రా...నీ యవ్ఁ
.... బీప్...బీప్....
బ్రహ్మం: లైన్ కట్టయింది. మరో కాలొచ్చేలోపు శ్రీరామ్ ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పు శ్రీరామ్. పిల్లలెలా ఉన్నారు?
శ్రీరామ్: నా పిల్లల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాను.
బ్రహ్మం: మనది న్యూస్ మీడియా శ్రీరామ్. మైక్ మందు మాత్రం  అందరి గురించే చెప్పుకోవాలి. సరే, మన కెమేరామన్ ఎలా ఉన్నాడు?
శ్రీరామ్: వాడా, కేమేరాను దండానికి కట్టి ఎప్పడో సురక్షిత ప్రాంతానికి చెక్కేశాడు.
బ్రహ్మం; ఆఁ, ఒకే...ఒకే. సరే, ప్రజలేమనుకుంటున్నారు?
శ్రీరామ్: కనబడితే తంతామంటున్నారు, బ్రహ్మం.
బ్రహ్మం: ఎవర్నీ! అధికారుల్నా?
శ్రీరామ్: కాదెహెఁ. మనల్నే.
బ్రహ్మం: (కట్ చేస్తూ) ఒకే, ఒకే శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం. సరే, చివరి మాటలు చెప్పేసేయ్.
శ్రీరామ్: (తనలో) ఓహ్ఁ, ఇదొకటి ఏడ్చింది కదూ...(బిగ్గరగా) కెమేరాను దండానికి కట్టేసి పారిపోయిన కేమేరామన్ ప్రకాష్ తో పారిపోవడానికి సిద్ధమైన శ్రీరామ్. టివీ 99 కర్నూలు.

- కణ్వస

Friday, October 2, 2009

సెటైర్: సానుభూతి ఉన్నప్పుడే సీఎం అవ్వాలి !

 తెల్లషర్ట్ , తెల్లప్యాంట్ వేసుకుని ఫుల్ హ్యాండ్ చేతులను కాస్తంత పైకి ముడిచి,  ఎడమచేతికి నల్లటి బెల్టున్న వాచీ పెట్టుకుని జగన్ అద్దం ముందు నిలబడి రాజకీయనేతగా తండ్రి వైఎస్సార్ స్టైల్ లో ప్రసంగపాఠాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు.
జగన్: ఏ ఒక్కరికీ నష్టం కలుగకుండా, ఏ ఒక్కరికీ కష్టం కలుగకుండా చూస్తానూ...
వ్యాపారి జగన్: (అద్దంలో సడన్ గా ప్రత్యక్షమై) ఏమిటీ స్టైల్.. నీ సొంత స్టైల్ ఏమైందీ...?
జగన్: (ఆశ్చర్యంగా) అరే, ఎవరు నువ్వు... నన్నే ప్రశ్నిస్తున్నావ్?
వ్యాపారి జగన్: నల్లప్యాంట్, తెల్లషర్ట్..చూస్తే తెలియడంలా.. నేను వ్యాపారి జగన్ ని.
జగన్: అయితే, నాలో ఉండాల్సినవాడివి, బయటకెందుకొచ్చావ్!
వ్యాపారి జగన్: నువ్, ఫుల్ టైమ్ రాజకీయనేతగా మారాలని శపథం చేస్తే నేను నీలో ఎలా ఉండగలను, అందుకే బయటకువచ్చేశా.
జగన్: పిచ్చివాడా,  కోటి విద్యలూ కూటికొరకే. అసలు రాజకీయమే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వ్యాపారం. ఛాన్స్ వచ్చినప్పుడే చంకెక్కాలి. బూమ్ ఉన్నప్పుడే భూములు కొనాలి, సానుభూతి ఉన్నప్పుడే సీఎం అవ్వాలి. ఇదే జగన్ చెప్పే జీవిత సత్యం.
వ్యాపారి జగన్: అవునవును నాకీ `సత్యం' గురించి బాగానే తెలుసు.

సెటైర్: వెయిటింగ్ లిస్ట్ లో జగన్!

సీఎం పోస్ట్ కి వెయిటింగ్ లిస్ట్ లో జగన్ తన నెంబర్ ఎక్కడుందో, తన లక్కు ఎలా ఉందో చూడాలనుకున్నారు. ఢిల్లీ
విచారణ కార్యాలయంకి ఫోన్ చేస్తుంటే, లైన్స్ మూడు రాష్ట్రాల ఎన్నికలతో బిజీబిజీఅనీ, దయచేసి ఓ ఏడాది తరువాత
సంప్రదించమంటూ కబురొచ్చింది. కనీసం వెయిటింగ్ లిస్టులో నెంబర్ అయినా కనుక్కుందామని ఆన్ లైన్ నొక్కారు.
బీప్...బీప్...మంటూ ధ్వనించిన తరువాత ఢిల్లీ వాయిస్ వచ్చేసింది.
ఢిల్లీ సూచన: ఒకసారి టెన్ డిజిట్స్ ఉన్న పీఎన్నార్ నెంబర్, వైఎస్సార్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి.
జగన్: ఆ చేశాను.
ఢిల్లీ సూచన: అలా చెప్పక్కర్లేదు. చేస్తే చాలు.
జగన్: ఐతే ఒకే.. తరువాత...
ఢిల్లీ సూచన: మీరెక్కాలనుకున్న ట్రయిన్ పేరు చెప్పండి.
జగన్: (ఏమాత్రం తడుముకోకుండా) ఏపీ పవర్ ఎక్స్ ప్రెస్...
ఢిల్లీ సూచన: ఏక్లాసట..?
జగన్: జబర్బస్త్ క్లాస్.
ఢిల్లీ సూచన: ఏ కోటాలో?
జగన్: వారసత్వ కోటాలోనే...
ఢిల్లీ సూచన: మీ వెయిటింగ్ లిస్ట్ డెభైఏడు...
జగన్: ఏడ్చినట్టే ఉంది. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు...నాకు ఒకటో నెంబర్ కావాల్సిందే.
ఢిల్లీ సూచన: వాళ్లంతా నీకంటే సీనియర్లు. పదేళ్లక్రితం అప్లై చేసుకున్నవారూ ఉన్నారు. ఒకటో నెంబర్ కుదర్దు.
పాతికేళ్లక్రదటి నుంచి పడికాపులుకాస్తున్న రోశయ్యకి నిన్ననే ఆర్ ఏ సీ నుంచి బెర్త్ కన్ఫర్మ్ చేశాం.
జగన్: ఐతే, నాకూ ఓ ఆర్ ఎ సీ తగలేయండి... అదే బెర్త్ లో ఓ మూల కూర్చుంటా...
ఢిల్లీ సూచన: కుదరదు. అలా చేస్తే రోశయ్యకు నిద్రపట్టదు. ప్రస్తుతం `జనం' బోగీలో రా... ఖాళీ వస్తే చూద్దాం.
- దళపతి (`నారదలోకం' - ఒంగోలు ప్రతినిధి)

Monday, September 28, 2009

సెటైర్: రోశయ్య పవరెన్నాళ్లట !

కణ్వస: నారద మహర్షిగారు, నాకో డౌట్
నారద: ఇంకెందుకు లేటు, అడుగు
కణ్వస: ఈ ఆనం లేడూ...
నారద: ఏ ఆనం...మంత్రేనా?
కణ్వస; అవును, ఆయినే..రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి అన్నాడు.
నారద: బాగనేఉంది, ఆనమే కాదు, జగనానుచరులు అంటున్నమాటేగా అది
కణ్వస: అదే, అందుకే నాకో డౌట్
నారద: ఏమిటో చెప్పండి మహర్షి.
కణ్వస: అసలు తాత్కాలిక ముఖ్యమంత్రి అంటే ఏమిటీ. ఎన్ని రోజులుండవచ్చు...?
నారద: నాలుగున్నరేళ్లు ఉండవచ్చు. `అమ్మ' దయ ఉంటే.
కణ్వస: మరి, జగన్ ని సీఎం చేస్తారని అధిష్ఠానం మాటిచ్చారట...
నారద: (ఓ నవ్వు నవ్వి) తెలంగాణ ఇస్తామని కూడా మాటిచ్చారుగా... నారాయణ...నారాయణ