Showing posts with label స్పెషల్. Show all posts
Showing posts with label స్పెషల్. Show all posts

Tuesday, November 24, 2009

సెటైర్: ఓటరు - గ్రేటరు

`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనం లాగించేసి కాసేపు టివీలో సినిమాలు చూశాడు. పెళ్లాంబిడ్డలతో కబుర్లాడాడు. రాత్రి పెందలాడే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మంచి నిద్రపట్టేసింది. అంతలో ఎవరో వచ్చి తట్టిలేపారు. `ఛీ, అదివారం పూట కూడా హయిగా పడుకోనివ్వరు...' అంటూ విసుక్కున్నాడు గ్రేటర్. కానీ, ఆ వచ్చినవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అందుకే మళ్ళీమళ్లీ తట్టిలేపుతూనే ఉన్నాడు. దీంతో గ్రేటర్ కి ముసుగుతీయక తప్పలేదు.
`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస

Monday, October 26, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసు !


ఈ సృష్టిలో ఏవిఎందుకు జరుగుతాయో తెలుసుకోగలిగితే మనిషి కూడా దేవుడైపోతాడు. ఈ క్షణానికి ఈ దేహం నీసొంతం. కానీ మరుక్షణంలో ఏమవుతుందో చెప్పలేం. రాబోయే విపత్కర పరిణామాలను సూఛాయగా గ్రహించి చెప్పగలిగిన జ్యోతిష పండుతులు దాదాపుగా అన్నిమతాల్లో ఉన్నారు. క్రైస్తవ మతగురువులు, జ్యోతిష పండితులు వైఎస్సార్ జాతకాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలించారు. రెండవసారి సీఎం అవుతారనీ, ప్రజాభిమానాన్ని చోరగొంటారని కూడా చెప్పారు. చివరకు అదే జరిగింది. కానీ... సెకండ్ టర్మ్ లో సీఎంగా ఆ జనహృదినేత ఆరునెలలుకూడా ఉండలేకపోయారు. హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులయ్యారు. ఇలా ఎలా జరిగింది? ఈ విపత్తను మతగురువులు, భవిష్యదర్శకులు ముందగా గ్రహించలేకపోయారా...?
ఇది నిజం కాదు. భవిష్య దర్శకులు ముందుగానే పసిగట్టారు. రెండవసారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత మతపరంగా పుణ్యస్థలమైన జెరూసెలం వెళ్ళారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయమన్నారు. అదే సమయంలో ఆయనకు ఓ చేదునిజం తెలిసింది. సెకండ్ టర్మ్ ఆర్నెల్లు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటుందని క్రైస్తవ జ్యోతిష పండితుడొకరు చెప్పారు. వైఎస్సార్ ఒక్కసారిగా షాకయ్యారు. తనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు. ప్రజల గురించి తపిస్తున్న వైఎస్సార్ ని చూసి క్రైస్తవ పండితులు, మత గురువుల హృదయాలు ద్రవించాయి. వెంటనేవారు, వైఎస్సార్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ తన `జీవితకాలమంతా' ముఖ్యమంత్రిగానే ఉండేలా చూడు ప్రభువా...అంటూ ప్రార్థనలు చేశారు. ప్రభువు తప్పక కరుణిస్తారనీ, మీరు చివరి శ్వాసవరకూ సీఎంగానే ఉంటారని ఆ పండితులు శుభాశీస్సులు అందించారు.
అలా శుభాశీస్సులు అందుకున్న తరువాత, వైఎస్సార్ రాష్ట్రానికి తిరిగివచ్చారు. జ్యోతిష పండితులు చెప్పిన మాటలను విశ్లేషించారు. సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపు ఎలా పోతుందాఅని ఆలోచించారు. కెవీపీ వంటి వారిని సలహాలు అడిగారు. మెజారిటీలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలంటే అది మైనార్టీలోకి జారుకోవాలి. తెలంగాణా లేదా మరేదైనా ఆందోళన వచ్చి సీనియర్లు, తనంటే గిట్టని వాళ్లు రాజీనామాలకు సిద్ధపడాలి. ఒకవేళ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సివస్తే కొంతమంది ఎమ్మెల్యేలు జారుకున్నా, ఆ లోటును భర్తీ చేయడానికి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకే వైఎస్సార్ `ఆకర్ష' పేరిట వల విసిరారు. ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినా తన ప్రభుత్వం మైనార్టీలోకి జారకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇతర పార్టీల వారికోసం తలుపులు బార్లాతెరవడం మొదలుపట్టారు. వైఎస్సార్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ వైఎస్సార్ అంతరంగంలోని ఆందోళనను మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. వైఎస్సార్ లోపల మదనపడుతున్నా, పైకి మాత్రం చెక్కుచెదరని చిరునవ్వులతోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో - `చూడు, చంద్రబాబూ, నువ్వెన్నాళ్లు ఉంటావో, నేను ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి. ప్రజలచేత మంచి అనిపించుకోవాలి' అంటూ వేదాంతధోరణిలో మాట్లాడారు. అయినా ఆమాటలను మీడియాగానీ, వైఎస్సార్ సన్నిహితులుగానీ అంతగా పట్టించుకోలేదు. ఆయన సహజధోరణిలోనే మాట్లాడారనే అంతా అనుకున్నారు. వైఎస్సార్ లోపల అగ్నిగుండం రగులుతోందనీ, ప్రజాసేవ ఏక్షణంలో ఆగిపోతుందోనన్న దిగులు పెరిగిపోతుందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
సెప్టెంబర్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైఎస్సార్ ప్రజలకు మరింత చేరువకావడం కోసం `రచ్చబండ' కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. వాతావరణం సరిగాలేదని ఇంట్లో సతీమణి వారించినా, మంత్రల్లో కొందరు అడ్డుతగిలినా ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్సార్ అడుగు ముందుకేవేశారు. `హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రానివ్వకుండా అదే చిరునవ్వుతో హెలికాప్టర్ ఎక్కారు. తోడువచ్చిన వారు చెబుతున్న వీడ్కోలుకు ప్రతిస్పందనగా తానూ చేయి ఊపరు. ఆ చిరునవ్వుతోనే ఆకాశంలోకి ఎగిరారు. ఆ నవ్వుమోముతోనే అదనంత ఎత్తుకు ఎగిరిపోయారు.
జ్యోతిష పండితులు చెప్పేందే నిజమైంది. ప్రియతమనేత వైఎస్సార్ సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపే ముగిసింది. వారు చేసిన ప్రార్థనలు కూడా ఫలించాయి... వైఎస్సార్ జీవితాంతం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. చివరి శ్వాసదాకా ప్రజాసేవకోసమే తపించారు. కానీ విధిని ఎవ్వరూ తప్పించలేరు. మరణ రహస్యాన్ని ఏ జ్యోతిష పండితులు కూడా ఛేదించలేకపోయారు.
-సీహ

Tuesday, October 20, 2009

జగన్ Vs రవి ప్రకాష్

రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చు. ఫలానా వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడులే అని అనుకంటే, హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. సినీరంగం నుంచి ఓ ఎన్టీఆర్, ఓ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు. అనేక రంగాలవారు, అనేక వృత్తుల వారు రాజకీయాల్లోచేరి రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వినబడుతున్న టాక్ ఏమిటంటే, ఎలక్ట్రానిక్ మీడియా కింగ్ గా భాసిల్లుతున్న రవిప్రకాష్ అతి త్వరలోనే పొలికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారని. అంతేకాదు, కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతోనే రవిప్రకాష్ ఇకపై జగన్ కు పోటీ కావచ్చు. ఈ ఊహగానాలకు ఊతం ఇస్తున్న అంశాలు ఇవి....
  • సాక్షి పత్రికలో అక్టోబర్ 19 (సోమవారం) ప్రచురితమైన ప్రత్యేకకథనం (కూలింది కుట్రతోనే?) వచ్చింది. ఈ కథనానికి టివీ9 స్పందిస్తూ అదే రోజు రాత్రి ఏడున్నర గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని (కుట్ర సిద్ధాంతం) ప్రసారం చేసింది.
  • సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించాలంటూ రవిప్రకాష్ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
  • ముఖ్యమంత్రి రోశయ్యకూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికీ మనం సపోర్ట్ చేయాలంటూ సిబ్బందికి సంకేతాలు పంపించారు.
  • వెంటనే టివీ9 సిబ్బంది ఉరుకులూ పరుగులుపెట్టి సాక్షి `కుట్ర' సిద్ధాంతాన్ని వెలికిలాగారు.
  • ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో టివీ9 పాతుకుపోవడంతో సహజంగానే ఆయారాష్ట్ర ప్రభుత్వాలతోనూ, అటు కేంద్ర ప్రభుత్వంతోనూ అనేక పనులు ఉంటాయన్న ఉద్దేశంతోనే రవిప్రకాష్ చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలను అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశానికి పావులు కదిపారు. అందులో భాగంగానే వరద బాధితుల సహాయం కోసం ప్రత్యేక ర్యాలీ పెట్టేసి ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నించారు.మరో పక్క రోశయ్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
  • జగన్ వర్గం బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టాలంటే మరో యువశక్తి ఉండాలన్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ప్రకారమే రవిప్రకాష్ నడుచుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
  • ఇదే జరిగితే, రాబోయే కాలంలో జగన్ కు రవిప్రకాష్ రాజకీయంగా గట్టి పోటీ ఇవ్వవచ్చు.
- కణ్వస

Saturday, October 17, 2009

సెటైర్ :`రేచీకటి' రోశయ్య పగటి దీపావళి

రోశయ్య వ్యాఖ్యలపై బోలెడు జోకులొచ్చేస్తున్నాయి. అలాంటి జోకుల్లో ఒకటి దీపావళి టపాసుగా మీకోసం...
సెప్టెంబర్ 2 : ముఖ్యమంత్రి వైఎస్సార్ గారెక్కిన హెలికాప్టర్ కనపిచండంలేదు. అక్కడెక్కడో నల్లమల అడవుల్లో చిక్కుకుపోయినట్టు చెబుతున్నారు. చీకటి పడుతోంది. ఇక మీ ముఖ్యమంత్రిని మీరే కాపాడుకోవాలి. స్థానికులు వెతికి గాలించండి. ఇక్కడ మేము చేసేది ఏమీలేదు. చీకటి పడుతోంది. వెళ్లండి...మీ సీఎంను మీరే వెతుక్కోండి....
అక్టోబర్ 2: వరదలొచ్చేశాయి. పైనుంచి వరదనీరు రావడంతో ఏ క్షణంలోనైనా మీ ఊర్లు మునిగిపోవచ్చు. చీకటి పడుతోంది. ఇక మీ ఊర్లను మీరే కాపాడుకోండి. ప్రభుత్వం చేసేదేమీలేదు. ఈ రాత్రికి మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి. మీరు,బతికుంటే తీరుబడిగా వచ్చి పలకరిస్తాం. చీకటి పడుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి.
అక్టోబర్ 17: దీపావళి వచ్చేసింది. చీకటి పడుతోంది. ఈలోపే టపాకాయలు కాల్చేసుకోండి. చీకటి పడ్డాక ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పొద్దున్నే కాల్చుకుంటే మంచిది. రాత్రిపూటైతే మీ ఒళ్లూఇళ్లూ మీరే కాపాడుకోవాలి.
నవంబర్ 2 : చీకటి పడుతోంది. పెద్దవాడ్నయ్యాను. నేనేమీ చేయలేను. ఇక మీ కొత్త సీఎంను మీరే వెతుక్కోండి.
- కణ్వస

Wednesday, October 14, 2009

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-1)

రోశయ్యకు ఐదు పదులకు పైగానే విశేషంగా రాజకీయ అనుభవం ఉంటే ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతటి సంయమనం పాటించాలో, మరెంతటి హుందాగా మసులుకోవాలో ఈ పెద్దాయన వైఎస్సార్ పక్కనే ఉంటూ అన్నేళ్లు రాజకీయ సావాసం చేసినా వొంటపట్టించుకోలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ పెద్దకాపుదారుడిగా ఉన్న రోశయ్య ఆవేశపడినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరుత్తురలయ్యేవారు. అందుకే రోశయ్యను కొందరు `రోష'య్య అని కూడా చాటుమాటుగా పిలుచుకుంటున్నారు. ఇక పస్తుత విషయానికి వస్తే, రాజకీయంగా ఆయన శిఖరాగ్రానికి చేరారు. వైఎస్సార్ అనూహ్య మరణంతో ఎనభయేళ్లు నిండిన వయసులో ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించింది. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ప్రయత్నిస్తున్న టైమ్ లో అధిష్ఠానం ఆశీస్సులతో రోశయ్య ఆ పదవి దక్కించుకున్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రి సీను ముగిసిన తరువాత రోశయ్యలో ఆవేశం పెరగడం మొదలైంది. మొదటి నుంచి `కట్టె, కొట్టె, తెచ్చే' అన్నట్టుగా మాట్లాడే నైజం ఉన్న రోశయ్య ప్రజారంజకుడు కాలేడన్న విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంపైనైనా తెగేసి చెప్పడం, కుండబద్దల కొట్టడం సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి సరిపడదని చెప్పేవారేలేకపోవడంతో రోశయ్య తరచూ పప్పులో కాలేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులుగానీ, అనుచరగణంలోని వారుకానీ ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా ఉన్నవాళ్లు కారు. అందుకే ఈ పెద్దాయనకు మనసులోని మాట చెప్పి కొరివితో తలగోక్కోవడం ఎందుకని చాలా మంది నోరుమూసుకుంటున్నారు. ఆమాట కొస్తే, ఈ వ్యాస రచయత వయసు కూడా రోశయ్య రాజకీయ అనుభవమంత లేదు.
అయితే, ఒక సమర్ధవంతమైన ముఖ్యమంత్రి దారితప్పుతున్నప్పుడు, ప్రజలకు దూరమవుతున్నప్పుడు తెలియజెప్పాలన్న బాధ్యతను గుర్తెరిగి ఈ వ్యాసపరంపరకు పూనుకోవడం జరిగింది. పొగడ్తలతో ముంచెత్తే భట్రాజులకంటే, సద్వివిమర్శలు చేసేవారే నయం. మంచి మాటలు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లు కూడా చక్కని సూచన చేసినప్పుడు దాన్ని పాజిటీవ్ దుక్పథంతో స్వీకరించాలి. రోశయ్య ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. అలా జరగకపోతే అది వైరి వర్గీయులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకూ, దివగంత నేత వైఎస్సార్ కూ మధ్య ఉన్న తేడాలేమిటో విశ్లేషించుకోవాల్సిందే.
వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడో, లేదా అంతకు ముందు సీఎంగానే మీడియా ముందు మాట్లాడిన సందర్భాలనో పరిగణలోకి తీసుకుంటే రోశయ్య `సీనియారిటీ' ఆయన పాపులారిటీకి అక్కరకు రావడంలేదని అనిపిస్తోంది.
(మిగతా వివరాలు తరువాయి భాగంలో)
-కణ్వస

Monday, October 12, 2009

లేచింది మహిళా లోకం

ఈసారి నోబెల్ ప్రైజ్ లు అందుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. ఆర్థికశాస్త్రంలో అమెరికా వనిత ఎలినర్ ఓస్ట్రోం నోబెల్ బహుమతికి ఎంపిక కావడంతో ఇప్పటివరకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికైన మహిళల సంఖ్య ఐదుకు పెరిగింది. మరో ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, 1969లో ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతిని చేర్చినప్పటి నుంచి ఇంతవరకు ఓ మహిళకు ఈ పురస్కారం దక్కలేదు. 1886లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించడానికి ముందు రాసిన విల్లులో ఆర్థిక శాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వమంటూ పేర్కొనలేదు. అయితే నోబెల్ జ్యూరీ ఆ తరువాత ఈ రంగాన్ని కూడా చేర్చారు. ఎలినార్ ఓస్ట్రోంతో పాటుగా ఆలివర్ విలియంసన్ సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకుంటారు. డిసెంబర్ 10న నోబెల్ జయంతి రోజున స్వీడన్ రాజు చేతులమీదగా వీరిద్దరూ నోబెల్ పురస్కారాలను స్వీకరిస్తారు.
రోమానియాలో పుట్టి జర్మనీలో స్థిరపడిన హెర్టా ముల్లెర్, సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకుని నాలుగవ వనితగా నిలిచారు. కాగా, మెడిసన్ రంగంలో ఎలిస్బత్ బ్లాక్ బర్న్, కరోల్ గ్రీడెర్ (అమెరికా), రసాయన శాస్త్రంలో ఆదా యోనత్ (ఇజ్రేల్) కూడా నోబెల్ బహుమతులు అందుకున్న మహిళామణుల జాబితాలో చేరారు.
2004లో ముగ్గురు మహిళలకు నోబెల్ బహుమతులు దక్కాయి.

హెచ్చరిక: భూకంపం రాబోతుందా !

భూ వాతావరణంలో పెను మార్పులు వచ్చినట్టే, భూమి లోపలి పొరల్లో కూడా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల `ఎల్ నినో' అనే విపరీత పరిస్థితి ఏర్పడటంవల్లనే ఇప్పుడు అనేక దేశాల్లో (ఇందులో భారత్ కూడా ఉంది) అయితే కరువులు, కాకుంటే జలప్రళయాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోడుగా భూగర్భ పొరలు కదలిపోతున్నాయి. ఈ కారణంగానే సముద్రగర్భంలో పెను భూకంపాలు వచ్చి తద్వారా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు, వరదలు వచ్చిపడ్డాయి. ఈ విపరీత పరిణామాలు ఇక్కడితో ఆగవనీ, పెను భూకంపాలు కూడా రావచ్చని భూగర్భశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక వేళ అదే జరిగితే, మానవ తప్పిదాల వల్ల జననష్టం ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ అవసరాల కోసం ఇటవల కాలంలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ఒకనాటి అడవులు, కొండలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోయాయి. ఫలితంగా ఒక మోస్తరుగా భూమికంపించినా జననష్టం అపారంగా ఉంటుంది. పైగా భూకంపాలను చాలా ముందస్తుగా గుర్తించడం కష్టమే. నాగరికత పేరిట మనం సృష్టించుకున్న అత్యాధునిక సౌకర్యాలే మనకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని కూడా పర్యావరణ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. సాధ్యమైనంతవరకూ ప్రకృతిని గౌరవిస్తూ, దాని పరిధికి లోబడే జీవించడం నేర్చుకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బతికిబట్టకట్టగలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. మరి, దీనిపై మీరేమనుకుంటున్నారు. మీ కామెంట్స్ మాకు పంపించండి. రాబోయే విపత్తులను అధిగమించడానికి ఏం చేయాలో సూచించండి.
-కణ్వస

రవిప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ?

మీ ఊహనిజమే. రవిప్రకాష్ అంటే మీరు అనుకుంటున్న రవిప్రకాషే. టివీ 9ని ఎంతో సమర్థవంతంగా నడుపుతున్న రవిప్రకాషే. ఆయనేంటీ, రాజకీయాల్లోకి రావడమేమిటని కాస్తంత ఆశ్చర్యపోవచ్చు. కానీ జరగబోతున్నది అదే. ఈ ప్రతినిధి అత్యంత గోప్యంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • చాలాకాలం క్రిందటే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే ఒక సందర్భంలో రవిప్రకాష్ ని ఎంకరేజ్ చేస్తూ, `మీ లాంటి యూత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో మీలాంటి వాళ్ల సహకారం ఎంతో అవసరం' అని చెప్పారు.
  • మీడియా శక్తివంతమైనదే అయినా, ప్రజలకు సేవ చేయడానికి మీడియాకంటే రాజకీయాలే సరైన వేదికన్న భావన రవిప్రకాష్ లో కలిగించారు.
  • వైఎస్సార్ ఒక ఉద్దేశంతో రవిప్రకాష్ తో ఈ ప్రోత్సాహకరమైన మాటలు చెబితే, వాటినే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మరో రకంగా ఉపయోగించుకుంటున్నది.
  • జగన్ వంటి యువనేత ఒక పక్క ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటూ తనదైన బలాన్నీ, బలగాన్నీ పెంపొందించుకుంటున్నప్పుడు అతగాడికి చెక్ పెట్టాలంటే మరో యువశక్తి కావాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. సినీరంగం నుంచి కానీ, లేదా మీడియా రంగం నుంచి కానీ ఎవరైనా అలాంటి యువకెరటం ఉంటే పని సులువవుతుందని అధిష్ఠానం అనుకుంది.
  • సరిగా అదే సమయంలో సినీనటుడు రాజశేఖర్ పీసీసీ కార్యాలయంలో డిఎస్ కి ఓ సూచన చేశారు. గతంలో కొంతమేరకు ఆసక్తి కనబరిచిన రవిప్రకాష్ ను ఇందుకోసం వినియోగించుకోవచ్చని చెప్పడంతో పావులు చకచకా కదిలాయి. కర్నూలుకి వరద వచ్చినప్పుడు రవిప్రకాష్ మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించిన తీరు ఢిల్లీ పెద్దలను ఆకర్షించింది. వెంటనే రాజశేఖర్ ద్వారా ఓ సందేశం రవిప్రకాష్ కు చేరింది.
  • టివీ 9 కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పాతుకుపోవడంతో వ్యాపారపరంగా అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఇటు కేంద్రంలోని యుపీఏ సర్కార్ తోనూ అనేక అవసరాలు సహజంగానే ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ఉభయతారకంగా ఉంటుందని రవిప్రకాష్ భావించారు.
  • వరదబాధితుల సహాయార్థం అట్టహాసంగా ర్యాలీలు చేపట్టారు. రవిప్రకాష్ తన టీమ్ తో ప్రజల ఫీలింగ్స్ ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.
  • టివీ ఛానెల్ కి సీఈఓ గా ఉన్న రవిప్రకాష్ అంతా అనుకూలిస్తే, అతి త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి.
- కణ్వస

Sunday, October 11, 2009

సెటైర్: `సీఎం' ఫ్లూ స్లోడౌన్

లంబు: హమ్మయ్యా, మొత్తానికి `సీఎం ఫ్లూ' తగ్గుముఖం పట్టిందిరా.
జంబు: సీఎం ఫ్లూనా...! ఇదేంటిరా స్వైన్ ఫ్లూకి కొత్త వర్షనా..?
లంబు: కొత్త వర్షన్ కాదు, అధిష్ఠానానికి పెద్ద టెన్షన్. నిన్నమొన్నటి వరకు సీనియర్లు, జూనియర్లంతా సీఎం ఫ్లూకి ఎటాకైనవాళ్లే.
జంబు: ఎట్లా... ఇంతకీ ఈ సీఎం ఫ్లూ ఏంటీ, దాని సింప్టంమ్స్ ఏమిటీ..?
లంబు: ఈ వ్యాధి సోకితే, పేషెంట్ కీ ఏ కుర్చీ చూసినా సీఎం ఛైర్ లాగానే కనబడుతుంటుంది. దాన్ని అమాంతం లాక్కుని కూర్చోవాలనిపిస్తుంది. ఎక్కువగా పగటి కలలు కంటుంటారు. తాము సీఎం అయిపోయినట్టూ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టేసినట్టూ , హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నట్టూ కలలు కంటుంటారు. దొరికిన చిత్తుకాగితాలుపోగేసి మొదటి ఫైల్ మీద సంతకం పెట్టినట్టు ఫీలైపోతుంటారు. మీడియా మైక్ చూడగానే మైకం కమ్ముతుంటుంది. అసలు, స్వైన్ ఫ్లూ వస్తే పేషెంట్ కే టెన్షన్. కానీ సీఎం ఫ్లూ వస్తే అధిష్టానానికి టెన్షన్...ప్రజలకు ఎటెన్షన్...మీడియాకు కలెక్షన్స్.
జంబు: వ్యాధి ముదిరితే మధ్యంతర ఎలెక్షన్స్. బాగానే ఉంది, ఇంతకీ సీఎం ఫ్లూ ఎంత మందికొచ్చిందేంటీ?
లంబు: చెబుతా లిస్ట్ రాసుకో...కాంగ్రెస్ లో...1. జగన్, 2. వీహెచ్, 3. డీఎస్, 4. కేకే, 5. జానారెడ్డి, 6. జైపాల్ రెడ్డి, 7....
జంబు: చాల్చాలు, ఇంతమందా...! ఇంతకీ ఈ రోగానికి మందుందా?
లంబు: లేకేం, హైకమాండ్ పూటకో డోసేస్తునే ఉంది.
జంబు: ఎవరికీ?
లంబు:రోశయ్యకు.
జంబు: జబ్బు వాళ్లకైతే, మందు రోశయ్యకెందుకూ..!?
లంబు:కాంగ్రెస్ ట్రీట్ మెంటే అంత. రోశయ్యకు ఓవర్ డోసిచ్చి బలోపేతం చేస్తే మిగతా వాళ్లంతా కోమాలోకి వెళ్ళిపోతారన్లే...
జంబు: ఇదేనేట్రా, సీఎం ఫ్లూ తగ్గుముఖం పట్టడమంటే...!
- మన్నవ

Saturday, October 10, 2009

స్పెషల్: ఏంటట బిగ్ బీలో స్పెషాలటీ?


బిగ్ బీ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 11తో ఆయన 67వ వసంతంలోకి అడుగిడబోతున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ స్పెషాలటీలు ఏమిటో తెలుసుకుందాం.


  • పాజిటీవ్ దృక్పధం: ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా నిలిచి, మళ్ళీ కెరీర్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ఇది సాయపడింది.

  • పట్టుదల: చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. అందుకే 20వ ఏటనే తనసొంతఊరు అలహాబాద్ ని వదిలిపెట్టేసి బాలీవుడ్ రాజధాని అయిన బొంబాయి చేరుకున్నారు.

  • డైలాగ్ కింగ్: సన్నగా పుల్లలా ఉన్నాడు. ఇతను సినిమాల్లో పనికారడనుకున్న నిర్మాతలే అమితాబ్ డైలాగ్ లకు మంత్రముగ్ధులై అతని ఇంటి ముందు క్యూ కట్టడం విశేషం.

  • మెగాస్టార్: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని నిరూపించాడు. 1970, 80 దశకాల్లో తిరుగులేని హీరోగా నిలిచాడు. మెగాస్టార్ అయ్యాడు.

  • బహుముఖ ప్రజ్ఞాశాలి: సినీనటునిగా ఉంటూనే ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందారు. నిర్మాతగా మారారు. టెలివిజన్ ప్రెజెంటర్ గా అవతారమెత్తారు. కౌన్ బనేగా కరోడ్ పతీ పేరు చెప్పగానే కళ్లముందు అమితాబ్ రూపమే మెదులుతుంది.

  • రాజకీయం: 1984 నుంచి 89 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు.

  • పర్సనల్: భార్యపేరు జయాబచన్. ఇద్దరు పిల్లలు. శ్వేతనందన్ (కూతురు), అభిషేక్ బచ్చన్ (కుమారుడు). అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ని కోడలిగా చేసుకున్నారు.

  • ఆచారాలు: దైవభక్తి ఎక్కువ. హిందూ ఆచారాలను పాటిస్తుంటారు.

  • విశ్వరూపం: జంజీర్ తో కొత్త వొరవడి సృష్టించుకున్న అమితాబ్ ఆ తరువాత షోలే, దివార్, డాన్ వంటి చిత్రాల్లో అందనంత ఎత్తుకు ఎదిగారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

  • విషాదం: 1982లో కూలీ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత 2005లో మరోసారి ఆరోగ్యం క్షీణించింది. అయినా కోలుకుని తనదైన శైలిలో సాగిపోతూనే ఉన్నారు.

  • బిగ్ బీ ఎట్ ప్రెజెంట్: మూడు సినిమాలు రాబోతున్నాయి. (అల్లాదీన్ - అక్టోబర్ 20న రిలీజ్, పా - డిసెంబర్ 4న, తీన్్ పట్టీ వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండున) బిగ్ బాస్ - 3 టివీ షోలో హోస్ట్ గా ఉండబోతున్నారు.

  • బిగ్ బ్లాగ్: బిగ్ బీ.బిగ్ అడ్డా. కామ్ ద్వారా 2008 ఏప్రిల్ నుంచి ప్రత్యేక వ్యాసాలు రాస్తూ అభిమానుల మన్ననలు అందుకుంటూనే ఉన్నారు.