Showing posts with label ఫోకస్. Show all posts
Showing posts with label ఫోకస్. Show all posts

Saturday, February 6, 2010

ఫోకస్: గోవింద`గానం'


ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది భక్తులు సమర్పించిన కానుకల సొమ్మేగాని టిటిడి చేర్మన్ గారి జేబులోది కాదు.పైగా లతాజీని ఆస్థాన విద్వాంసురాలుగా అదే సభలో ప్రకటించారు. ఇప్పటికే బాలమురళీక్రిష్ణ టిటిడి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు. మరి లతాజీ ఎందుకు ? ఎవరి ముచ్చట తీర్చేందుకు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది.
- `నారదలోకం' అభిమాని
హైదరాబాద్

Saturday, November 14, 2009

రోశయ్య నోట `చిరు'నామస్మరణ

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టినా కాంగ్రెస్ లో ఆశలు చావలేదు. ఈసారి మీడియాకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి బేరసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బిహైండ్ ద కర్టెన్ వ్యవహారం కాగా, రోశయ్య మాస్టారు `చిరు'నామస్మరణకు దిగారు. బాలలదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరం నటుల్లో చిరంజీవి అంటే తనకు మక్కువ అంటూ ముచ్చటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా, దానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి. చిరంజీవి గొప్పనటుడంటూ రోశయ్య కితాబు ఇచ్చారు. చిరంజీవిని నెమ్మదిగా కాంగ్రెస్ ముగ్గులోకి దింపడంకోసమే రోశయ్య మాస్టారు ఇలా చిరునామస్మరణ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

`గాలి' - కోడా ఇద్దరూ ఇద్దరే

ఓబుళాపురం గనుల్లో అక్రమాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలిజనార్దనరెడ్డికీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం...
సవాల్: తమపై మోపబడిన ఆరోపణలు నిజమని కోర్టులో నిర్ధారణ అయితే (కావని అన్నదే వారి దీమాలా కనబడుతోంది) రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్కమిస్తానంటూ ఇటు గాలి, అటు కోడా ఇద్దరూ సవాళ్లు విసిరారు.
ట్రంప్ కార్డ్ : ఇద్దరి చేతులో ట్రంప్ కార్డులున్నాయి. గాలి తన పేరులో రెడ్డి అన్న కులం పేరు ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు దాడిచేస్తున్నారనీ, ఒక వేళ తనపేరులో `రెడ్డి' అన్న పదం లేకుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని గాలి `కులం' కార్డు తీస్తే, మరో పక్క మధుకోడా `ట్రైబల్' కార్డు తీశారు. తాను గిరిజనుడైనందునే తనపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదిగినతీరు: వీరిద్దరూ ఇంచుమించూ ఒకేలా ఎదిగారు. ఎనిమిదేళ్ల కితం గాలిపేరుగానీ, అటు మధుకోడా పేరుగానీ ఎవ్వరికీ తెలియదు. మధుకోడా రోజువారీ కూలీ కుటుంబం నుంచి వేలాది కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. గాలి ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అండదండలతో విశ్వరూపం చూపించారు. ఇద్దరూ ఇనుప ఖనిజం గనులను నమ్ముకునే (అమ్ముకునే) కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత రాజకీయలవైపు దృష్టిపెట్టారు. అటుపై ఏకంగా సీఎం సీట్లో కూర్చోవడం, లేదా కూలదోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
మధుకోడా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగా, గాలి కర్నాటక సీఎం సీటుని అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన `సోదరుడు' (ఈమాట గాలి జనార్దనరెడ్డి తాజ్ బంజారా హోటల్ లో మీట్ ద ప్రెస్ లో చెప్పారు) ఎప్పటికైనా అవుతాడని బల్లగుద్ది మరీ గాలి చెప్పేశారు.

Thursday, November 5, 2009

`గ్రేటర్' కేసీఆర్ ఔట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి టిఆర్ఎస్ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమమే తమ టార్గెట్ అని కేసీఆర్ తెల్చిచెప్పేశారు. `గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకోలెక్కకాదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పోటీ చేయం. తెలంగాణ ఉద్యమం జోరేమిటో చూపిస్తాం...' అంటూ ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు. ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారట.
ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అంటున్నారు.
తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కొసమెరుపు: కేసీఆర్ మాటలు ఇలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు.

రోశయ్యకు సోనియా ఏం చెప్పబోతున్నారు?

రోశయ్య హస్తిన యాత్ర ఖరారైంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రోశయ్య ఢిల్లీవెళ్ళి మేడం సోనియాను కలవబోవడం ఇదే మొదటిసారి. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తూ కంట్లో నలుసుగా మారిన నేపథ్యంలో రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను సోనియాకు వివరించడానికే తాను ఢిల్లీ వెళుతున్నట్టుగా రోశయ్య చెబుతున్నా ఆమె ఏం చెప్పబోతున్నారో, రోశయ్య మాస్టారు ఆ తరువాత ఏం చేయబోతున్నారో ఈపాటికే అందరికీ అర్థమైంది. మేడం సోనియా సీఎం రోశయ్యతో ఇలా చెప్పేవచ్చు....
  • మీరు, కొందరనుకుంటున్నట్టుగా తాత్కాలిక ముఖ్యమంత్రికారు. మీరు హ్యాపీగా రూల్ చేసుకోండి.
  • జగన్ వర్గీయుల నుంచి ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మేం చూసుకుంటాం.
  • వీలైనంత త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసుకోండి. నా నుంచి ఎప్పుడూ మీకు గ్రీన్ సిగ్నలే.
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి.
  • ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మేం చెప్పినట్టు మీరు నడుచుకోండి. గ్రేటర్ ఎన్నికల్లో తోకజాడించే నాయకుల పేర్లు పంపించండి.
  • దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ బలోపేతమైంది. ఇలాంటి సమయంలో బలహీనపరిచే శక్తులను చూస్తూఊరుకోం. వాటిని ఎలా లొంగదీసుకోవాలో మాకు తెలుసు.
  • మీపని మీరు చేసుకోండి. మంచి సీఎంగా పేరుతెచ్చుకోండి. గుడ్ లక్....

Tuesday, November 3, 2009

గిల్లి లెక్కచూసుకున్న డిఎస్ !

`గ్రేటర్' ఎన్నికల కోసం ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చేసిన ప్రకటన చివరకు రసాభాస అయింది.పీఆర్పీతో పొత్తుపెట్టుకోవడాన్ని కాంగ్రెస్ లోని జగన్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అటు ప్రజారాజ్యం ఇటు కాంగ్రెస్ లోని రెండు వర్గాల్లోని చిన్నాచితకా నాయకులు మాటలతూటాలను విసురుకున్నారు. పన్నెండు ఛానెళ్లతో వెలిగిపోతున్న తెలుగు మీడియాకు మాత్రం కడుపారా తిట్లుదొరకడంతో ఆరోజుకి ముష్టాన్నం దొరికినంతగా సంబరపడిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం చూశాక ఒక సందేహం కలగకమానదు.
అసలు డీఎస్ ఎందుకు గిల్లినట్టు? ఏమి ఆశించి ఈ రభసకు తెరదీశారు?
పైకి చూడటానికి డిఎస్ తెలివితక్కువగా గిల్లినట్టు కనిపించినా, లోలోపల మాత్రం మహత్తరమైన వ్యూహం ద్యోతకమవుతోంది. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల మధ్య కూర్చున్నప్పుడు డిఎస్ ఈ వ్యూహానికి బీజం వేశారు. జగన్ వర్గంలో ఎంత మంది ఉన్నారు? సీఎల్పీ సమావేశం పెడితే ఎంత మంది చీలిపోతారు? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాల్సిందే. సీఎల్పీ సమావేశం పెట్టి రసాభాస అయ్యేదానికంటే, ముందుగానే బలాబలాలు తేలాలంటే ఓ సమస్యను లేవనెత్తాలి. అందుకే డిఎస్ పథకం ప్రకారం చిరంజీవిని ఒక పావుగా వాడుకోవాలనుకున్నారు. గతంలో వైఎస్సార్ సైతం ఇదే పావును కొంతమేర కదిలించారు. ఆ తరువాత రోశయ్య కూడా చిరంజీవికి ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో చిరు తప్పకుండా తాము విసిరే వలలో పడిపోతారన్న ధీమాను డిఎస్ వ్యక్తం చేశారు. అందకే అధిష్ఠానాన్ని ఒప్పించి పొత్తు వ్యూహంకు తెరదీశారు.
అనుకున్నట్టే జరిగింది. పీఆర్పీతో పొత్తు అనగానే జగన్ వర్గీయులు మండిపడటం ప్రారంభించారు. రఘువీరా, దానం, సబిత, కోమటి వంటి వాళ్లు విరుచుకుపడ్డారు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు వత్తాసు పలికారు. కొండా సురేఖ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె అప్పటికే రాజీనామాతో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆమె భర్త కొండా మురళి కూడా ధ్వజమెత్తారు.
ఈ సీన్లనన్నింటినీ డిఎస్ - రోశయ్య వర్గం నిశితంగా గమనిస్తూ, జగన్ పక్షాన ఉండే నాయకులు పేర్లను రాసుకోవడం ప్రారంభించింది. జగన్ వర్గీయుల జాబితా తయారుచేసుకునే పనిలో పడింది. ఇప్పుడున్నవేడి తగ్గితే ఈ జాబితాలోని పేర్లు తగ్గుతాయన్న నమ్మకాన్ని అధిష్ఠానానికి తెలియజేసింది. ఇక ఈ జాబితాను చూసుకుని అధిష్ఠానం, జగన్ ని బుజ్జగించాలో, బంధం తెంచుకోవాలో తేల్చుకుంటుంది. డిఎస్ పని ఇక్కడితో ముగిసింది.
జగన్ బాటలో ఎవరు వెళతారో, రోశయ్య పంచన ఎవరు ఉంటారో తేల్చుకోవడం కోసం డిఎస్ రచించిన ఈ పొత్తుల వ్యూహం ఫలించింది. పాపం, మధ్యలో చిరంజీవి రాజకీయంగా మరోమారు ప్లాప్ అయ్యారు.
-కణ్వస

Sunday, November 1, 2009

ఫోకస్: పీఆర్పీ కాంగ్రెస్ పాలె`కాపు'

మెగాస్టార్ చిరంజీవి ఏ లక్ష్యంతో ప్రజారాజ్యాన్ని స్థాపించారో, ఆ లక్ష్యాన్ని తుంగలోకితొక్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడంతో ఇంతకాలంగా వేసుకున్న ముసుగు తొలిగిపోయినట్టైంది. అసలు ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే అధికార కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టడానికి. ఈ సంగతి ముందుగానే పసిగట్టడం వల్లనే అసలు ఈ పార్టీనే మొగ్గతొడగకుండా చేయాలని అప్పట్లో కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. దాసరి నారాయణరావు వంటి సీనియర్లను రంగంలోకి దింపి చిరంజీవికి అనేక విఘ్నాలు సృష్టించారు. చివరకు చిరంజీవి పర్సనల్ లైఫ్ లో లొసుగులు బయటకులాగే ప్రయత్నాలు జరిగాయి. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ వివాహం అనంతరం నూతన దంపతులకు అండగా ఉండేవిషయంలో కూడా కాంగ్రెస్ పరోక్షంగా జోక్యం చేసుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. చిరంజీవికి అడుగడుగునా మనస్తాపం కలిగించడానికి కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నంలేదు. అయినా చిరంజీవి ఒక శుభముహర్తాన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మార్పుకోసమే తాను ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకున్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేస్తామంటూ భీషణఘోషణ శపథాలు చేశారు. బలుపోవాపో నిర్ధారించుకోలేక సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టారు. మహాకూటమిలో చేరమంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయ`బేరాలు' సాగించినా కాదుపొమ్మన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ప్రజారాజ్యం నేలమీద నడవటం మొదలుపెట్టింది. సరిగా ఇదే సమయంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్ ప్రజారాజ్యాన్ని దగ్గరతీయడానికి ప్రయత్నించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి కూడా వైఎస్సార్ వైఖరిపట్ల ఆశ్చర్యచికుతులై కాంగ్రెస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్సార్ దుర్మరణంతో ప్రజారాజ్యం అధికార కాంగ్రెస్ కి మరింత చేరువైంది. తిరుపతిలో ముఖ్యమంత్రి రోశయ్య, చిరంజీవి గంటన్నరసేపు రహస్య సమాలోచనలు జరిపినప్పుడే మెగాస్టార్ పొలిటికల్ మెగావ్యూహం అర్థమైంది. ఒక దశలో జగన్ వర్గీయులకు అండగా ఉండాలని కూడా అల్లుఅరవింద్ వ్యూహం రచించారు. అయితే అధిష్ఠానం జగన్ ని దూరంగా ఉంచడంతో సీను అర్థం చేసుకున్న ప్రజారాజ్యం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు లొంగిపోయింది. పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యాలను ఎంచుకుందో, వాటినన్నింటినీ తుంగలోకి తొక్కేసిన చిరంజీవి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీకి సిద్ధమయ్యారు.
ఈ మొత్తం వ్యవహారంతో ఒక్క విషయం బాగా అర్థమైంది, అదేమంటే, చిరంజీవికి పాలి`ట్రిక్స్' బాగానే ఒంటబట్టాయి. ఇక ఫర్వాలేదు. ఎలాగో సిద్ధాంతాలులేని పార్టీగానే ముద్రపడింది కనుక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పంచన పాలె`కాపు'గా ఉంచడమే మంచిది.
- కణ్వస

Tuesday, October 27, 2009

లుచ్ఛా, లఫంగా...ఇది మాభాష


''లుచ్ఛా..., లఫంగా..., బద్మాష్‌... బేకారుగాళ్ళనేది మా తెలంగాణ సొంత భాష. పనికిరానోళ్ళను, గలత్‌ పని సేసేటోళ్ళను, తప్పులు జేసేటోళ్ళను, ఉల్టాఫల్టాగాళ్ళను, ఇట్లాంటోళ్ళను ఇట్లనే అంటం... నా గల్లిdలో, నా తెలంగాణలో ఇదే యాసతో మాట్లాడుతం... అర్థం తెలియకపోతే మీ ఖర్మ... తెలుసుకుని మాట్లాడుండి'' ఇదీ,తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ లో భాషా శాస్త్రాలపై చేసిన సవాల్‌.
''నేను డబ్బుల కోసం ఉద్యమాన్ని చేస్తున్నానని కొందరు సన్నాసులు అంటుంరు, ఈ సంగతిని రుజువుచేస్తే నేను ముక్కు నేలకు రాస్తానని, నాపై సవాల్‌ విసిరే వారికి సిగ్గు, లజ్జ, దమ్ముంటే వైఎస్‌ హయాంలో ఆక్రమణకు గురైన భూములను దున్నుందాం, నార్నే సంస్థ చెర్లపల్లి, గంగాపురం, ఈస్ట్‌సిటీ, కమ్మెటి వంటి గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములను దున్నుదాం, 4లక్షల కోట్ల విలువైన ఆర్యసమాజ్‌, గోకుల్‌ ట్రస్టు భూముల్లో కొంత భాగంలో వైఎస్‌ వివేకానందరెడ్డి పెద్ద భవంతినే నిర్మించాడని, దమ్ముంటే దాన్ని కూడా కూల్చుదాం రండి''- ఇది కేసీఆర్ విసిరిన మరో ఛాలెంజ్.
''`మా భాషను తప్పుబడతున్నారు, దీనిపై మాట్లాడేందుకు శతావధానులను, అష్ఠావధానులను పిలిపించండి, చర్చకు సిద్ధమే''
మా నుడికారం, పడికట్టును విమర్శిస్తారా, తుర్క భాష కలిసిందంటారా, ఇదంతా సమస్యను పక్కదోవ పట్టించేందుకేగా....మా భాష వాడిగా వేడిగా ఉంటుంది, పరుషంగా ఉంటుంది. ఇది మా యుద్ధంలో భాగం-'
ఇది సినిమా కాదు, రాసి మాట్లాడేది కాదు, ఆవేశం, అర్తనాదాల నుంచి వెలువడుతున్న తొలి కేక
కేసీఆర్ తెలుగు భాషపైనా, మాండలికంపైనా చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

Monday, October 26, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసు !


ఈ సృష్టిలో ఏవిఎందుకు జరుగుతాయో తెలుసుకోగలిగితే మనిషి కూడా దేవుడైపోతాడు. ఈ క్షణానికి ఈ దేహం నీసొంతం. కానీ మరుక్షణంలో ఏమవుతుందో చెప్పలేం. రాబోయే విపత్కర పరిణామాలను సూఛాయగా గ్రహించి చెప్పగలిగిన జ్యోతిష పండుతులు దాదాపుగా అన్నిమతాల్లో ఉన్నారు. క్రైస్తవ మతగురువులు, జ్యోతిష పండితులు వైఎస్సార్ జాతకాన్ని చాలా క్షుణ్నంగా పరిశీలించారు. రెండవసారి సీఎం అవుతారనీ, ప్రజాభిమానాన్ని చోరగొంటారని కూడా చెప్పారు. చివరకు అదే జరిగింది. కానీ... సెకండ్ టర్మ్ లో సీఎంగా ఆ జనహృదినేత ఆరునెలలుకూడా ఉండలేకపోయారు. హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులయ్యారు. ఇలా ఎలా జరిగింది? ఈ విపత్తను మతగురువులు, భవిష్యదర్శకులు ముందగా గ్రహించలేకపోయారా...?
ఇది నిజం కాదు. భవిష్య దర్శకులు ముందుగానే పసిగట్టారు. రెండవసారి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత మతపరంగా పుణ్యస్థలమైన జెరూసెలం వెళ్ళారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయమన్నారు. అదే సమయంలో ఆయనకు ఓ చేదునిజం తెలిసింది. సెకండ్ టర్మ్ ఆర్నెల్లు లేదా అంతకన్నా తక్కువగానే ఉంటుందని క్రైస్తవ జ్యోతిష పండితుడొకరు చెప్పారు. వైఎస్సార్ ఒక్కసారిగా షాకయ్యారు. తనకలల ప్రాజెక్ట్ జలయజ్ఞం పూర్తిగా కాకుండానే తాను సీఎం పదవినుంచి దిగిపోతానా...మరో ఐదేళ్లు ప్రజలకు సేవచేసే అవకాశం జారిపోతుందా...అంటూ కలవరపడ్డారు. ప్రజల గురించి తపిస్తున్న వైఎస్సార్ ని చూసి క్రైస్తవ పండితులు, మత గురువుల హృదయాలు ద్రవించాయి. వెంటనేవారు, వైఎస్సార్ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ తన `జీవితకాలమంతా' ముఖ్యమంత్రిగానే ఉండేలా చూడు ప్రభువా...అంటూ ప్రార్థనలు చేశారు. ప్రభువు తప్పక కరుణిస్తారనీ, మీరు చివరి శ్వాసవరకూ సీఎంగానే ఉంటారని ఆ పండితులు శుభాశీస్సులు అందించారు.
అలా శుభాశీస్సులు అందుకున్న తరువాత, వైఎస్సార్ రాష్ట్రానికి తిరిగివచ్చారు. జ్యోతిష పండితులు చెప్పిన మాటలను విశ్లేషించారు. సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపు ఎలా పోతుందాఅని ఆలోచించారు. కెవీపీ వంటి వారిని సలహాలు అడిగారు. మెజారిటీలో ఉన్న ప్రభుత్వం పడిపోవాలంటే అది మైనార్టీలోకి జారుకోవాలి. తెలంగాణా లేదా మరేదైనా ఆందోళన వచ్చి సీనియర్లు, తనంటే గిట్టని వాళ్లు రాజీనామాలకు సిద్ధపడాలి. ఒకవేళ తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సివస్తే కొంతమంది ఎమ్మెల్యేలు జారుకున్నా, ఆ లోటును భర్తీ చేయడానికి వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకే వైఎస్సార్ `ఆకర్ష' పేరిట వల విసిరారు. ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినా తన ప్రభుత్వం మైనార్టీలోకి జారకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇతర పార్టీల వారికోసం తలుపులు బార్లాతెరవడం మొదలుపట్టారు. వైఎస్సార్ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ వైఎస్సార్ అంతరంగంలోని ఆందోళనను మాత్రం ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
రోజులు గడుస్తున్నాయి. నెలలు దొర్లుతున్నాయి. వైఎస్సార్ లోపల మదనపడుతున్నా, పైకి మాత్రం చెక్కుచెదరని చిరునవ్వులతోనే ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుతో - `చూడు, చంద్రబాబూ, నువ్వెన్నాళ్లు ఉంటావో, నేను ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి. ప్రజలచేత మంచి అనిపించుకోవాలి' అంటూ వేదాంతధోరణిలో మాట్లాడారు. అయినా ఆమాటలను మీడియాగానీ, వైఎస్సార్ సన్నిహితులుగానీ అంతగా పట్టించుకోలేదు. ఆయన సహజధోరణిలోనే మాట్లాడారనే అంతా అనుకున్నారు. వైఎస్సార్ లోపల అగ్నిగుండం రగులుతోందనీ, ప్రజాసేవ ఏక్షణంలో ఆగిపోతుందోనన్న దిగులు పెరిగిపోతుందని ఎవ్వరూ గ్రహించలేకపోయారు.
సెప్టెంబర్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైఎస్సార్ ప్రజలకు మరింత చేరువకావడం కోసం `రచ్చబండ' కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. వాతావరణం సరిగాలేదని ఇంట్లో సతీమణి వారించినా, మంత్రల్లో కొందరు అడ్డుతగిలినా ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్సార్ అడుగు ముందుకేవేశారు. `హెలికాప్టర్ బాగుందా...?' అంటూ దానివైపు తేరపారా చూశారు. ఆ చూపులో ఏదో సందేహం...కానీ బయటపెట్టలేదు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రానివ్వకుండా అదే చిరునవ్వుతో హెలికాప్టర్ ఎక్కారు. తోడువచ్చిన వారు చెబుతున్న వీడ్కోలుకు ప్రతిస్పందనగా తానూ చేయి ఊపరు. ఆ చిరునవ్వుతోనే ఆకాశంలోకి ఎగిరారు. ఆ నవ్వుమోముతోనే అదనంత ఎత్తుకు ఎగిరిపోయారు.
జ్యోతిష పండితులు చెప్పేందే నిజమైంది. ప్రియతమనేత వైఎస్సార్ సెకండ్ టర్మ్ ఆర్నెల్లలోపే ముగిసింది. వారు చేసిన ప్రార్థనలు కూడా ఫలించాయి... వైఎస్సార్ జీవితాంతం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. చివరి శ్వాసదాకా ప్రజాసేవకోసమే తపించారు. కానీ విధిని ఎవ్వరూ తప్పించలేరు. మరణ రహస్యాన్ని ఏ జ్యోతిష పండితులు కూడా ఛేదించలేకపోయారు.
-సీహ

Friday, October 23, 2009

జగన్ గెలిచినట్టా, ఓడినట్టా?

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర సాఫల్యమైందా, లేక వైఫల్యతే ఎదురైందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. వైఎస్సార్ మరణానంతరం చురుగ్గా సాగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగాలని ఆశించడమే ప్రధాన భూమిక పోషించింది. గడచిన 50 రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదింపే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్ఠానం చేసింది. జగన్ ఢిల్లీయాత్రలోని రెండు కోణాలను స్పృశిద్దాం...
గెలిచినట్టే...
  • కొంతకాలంగా మేడం సోనియాను కలవాలన్న లక్ష్యం నెరవేరింది. అది కూడా రోశయ్య కంటే ముందే కలవాలన్న కోరిక తీరింది.
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మేడంకు చెప్పే అవకాశం దక్కింది.
  • `అన్నీ నాకిడిచిపెట్టేయ్ జగన్, నేను చూసుకుంటా...'అంటూ సోనియా చెప్పడంతో జగన్ లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
  • `రాబోయే కాలమంతా మీలాంటి యువనేతలదే'-అంటూ సోనియా అనడంతో జగన్ లో ఆశలు చిగరించాయి.
  • దక్షిణాదిన ఉన్న ఏకైక కాంగ్రెస్ పాలితరాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు తగవని సోనియా అనడంతో జగన్ లో మార్పుకు బీజం పడింది.
  • మేడం సోనియా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచడానికి ఈ పర్యటన దోహదపడింది.
  • అధిష్ఠానం పట్ల గౌరవం పెరగడానికి పర్యటన పనికొచ్చింది. తన ప్రమేయం ఉన్నాలేకున్నా జరిగిన అప్రదిష్ఠ మచ్చలను చెరిపేసుకోవడానికి దోహదపడింది.
  • ఇప్పట్లోకాకపోయినా భవిష్యత్ లో తనకలలు నెరవేరుతాయన్న ఆశలు చిగురించాయి.
ఓడినట్టే...
  • మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వెల్లడవుతున్న వేళలో ఎవ్వరినీ నొప్పించడం మేడంకు ఇష్టంలేదు. సరిగా అదే సమయంలో జగన్-కెవీపీ ద్వయం సోనియాను కలిశారు. మేడం వారితో కొద్దిసేపు మాట్లాడారు. కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఆమె వీరితో సుదీర్ఘంగా (45 నిమిషాలో గంటో) చర్చించలేదు. ఆమె కాసేపు మాట్లాడిన తరువాత అక్కడే ఉన్న సీనియర్లతో తాజా పరిణామాలు చర్చించారు.
  • `అన్నీ నాకిడిచిపట్టేయ్ జగన్, నేను చూసుకుంటా..' అని సోనియా అనడంలోని అంతరార్థమేమిటో జగన్ కు అర్థంకాలేదు. ఈ మాటల్ని పాజిటీవ్ గా తీసుకోవాలో, నెగెటీవ్ గా తీసుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కున్నారు.
  • నిన్నమొన్నటి వరకూ ఎప్పుడూ తన వయసు గురించికానీ, అనుభవం గురించికానీ మాట్లాడని జగన్ ఢిల్లీ నుంచి వచ్చీరాగానే వాటి ప్రస్తావన తెస్తూ, `నా వయసు 37 ఏళ్లే. భవిష్యత్ చాలా ఉంది. సీఎం కుర్చీ అంటే తేలిగ్గా లాక్కునే మామూలు కుర్చీకాదు. నేను అధిష్ఠానం చెప్పినట్టు నడుచుకుంటాను. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాను'
  • తండ్రి దర్మరణం పాలైన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. స్టాండింగ్ కమిటీ సమావేశం నెపంతో రోశయ్య కంటే ముందే ఢిల్లీ వెళ్ళి తనమనసులోనిమాట మేడం చెప్పే పయత్నం చేశారు. జగన్ కుటుంబానికి కలిగిన నష్టం, శోకాన్ని దృష్టిలో ఉంచుకుని సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు.
  • కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో బలోపేతమవుతున్న టైమ్ లో ఏ రాష్ట్రంలో కూడా అనిశ్చిత పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్ వివాదానికి ఫల్ స్టాప్ పట్టేయాలని సోనియా భావించారు. అందకే స్టాండింగ్ కమిటీ సమావేశం పేరిట జగన్ ను ఢిల్లీ రప్పించి ఆయన చెప్పిందివిని, తాను చెప్పదలచ్చుకున్న రెండు ముక్కలూ చెప్పేశారు.
  • అధిష్ఠానం నిర్ణయానికి జగన్ కట్టుబడేలా జగన్ ని ఒప్పించగలిగారు.
  • జగన్ తరువాత అదేరోజు కే.కేశవరావు కూడా సోనియాను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మాటలనుబట్టి, అధిష్టానం తన పంతం నెగ్గించుకున్నట్టే కనబడింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు పిల్లచేష్ఠలు కుదరవని చెప్పడంలో అదిష్ఠానం సఫలీకృతమైనట్టు అర్థమైంది. అదిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటానంటూ జగన్ ఇప్పుడు చెప్పారనీ, కానీ, ఈమాటేదే నెలరోజుల ముందే అని ఉంటే, జగన్ అనుచరగణం వల్ల ఇంతగా డామేజ్ అయిఉండేది కాదన్న అర్థం వచ్చేలా కేకే చెప్పారు. కేకే మొహంలో సీనియర్లే గెలిచారన్న ఆనందం కనిపించడం కొసమెరుపు.
- కణ్వస

Thursday, October 22, 2009

అది ప్రమాదమే, కుట్రకాదు

వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుట్రతోనే కూలిపోయిందంటూ `సాక్షి' పత్రిక, `సాక్షి' ఛానెల్ ఊదరగొట్టాయి. కుట్రజరిగినట్టేనంటూ కొత్త సిద్ధాంతాన్ని జనంమీద రుద్దడానికి తీవ్రాతితీవ్రంగా ప్రయత్నించాయి. అయితే నిజానికి హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్ర జరగలేదు. `కూలింది కుట్రతోనే?' అంటూ పేజీలకుపేజీలు రెండురోజుల పాటు రాసేసిన సాక్షి పత్రిక -ఆ తరువాత మెత్తబడింది. చెప్పిన విషయాలే చెప్పిచెప్పి విసుగుపుట్టిందేమో ఆ `కట్టుకథ'ని అంతటితో ఆపేసింది. హెలికాప్టర్ కూలడానికి కుట్ర జరగలేదనీ, అది కేవలం ప్రమాదవశాత్తు కూలిందని ఏవియేషన్ నిపుణుడు ఎస్.ఎన్.రెడ్డి చెబుతున్నారు. కూలడంలో కుట్రజరిగిందంటూ జనాన్ని నమ్మించడానికి ఆ పత్రిక లేవనెత్తిన అంశాలనూ, ఇప్పుడు ఏవియేషన్ నిపుణులు చెబుతున్న వాస్తవాలను ఓ సారి మీరే చదవండి...
సాక్షి: హెలికాప్టర్ కూలడంలో ఏదో కుట్ర జరిగింది. (అదేమిటో స్పష్టంగా చెప్పకపోయినా పేలుడు వల్ల కూలిందేమోనన్న అర్థం వచ్చేలా రాసింది)
నిపుణులు: బాంబులు పెట్టడంవల్లగానీ, లేదా ఏ ఇతర పేలుడువల్లకానీ హెలికాప్టర్ కూలినట్టు కనబడటంలేదు. నిజంగా విస్ఫోటనం జరిగిఉంటే హెలికాప్టర్ శకలాలు దాదాపు పదికిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడిఉండేవి. కానీ అలా జరగలేదు. ప్రమాదశాత్తే హెలికాప్టర్ కూలిఉంటుంది.
సాక్షి: బెల్ 430 హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయంలోని హ్యాంగర్లలో అరకొర భద్రత నడుమ ఉంచారు.
నిపుణులు: వీఐపీలు వినియోగించే హెలికాప్టర్లను నిలిపిఉంచడానికి సొంతంగా హ్యాంగర్లు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొంత హ్యాంగర్ లేకపోవడంతో గత 20 ఏళ్లుగా ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లోనే నిలుపుతున్నారు.
సాక్షి: హెలికాప్టర్ రక్షణ భాద్యతను పట్టించుకోలేదు.
నిపుణులు: హెలికాప్టర్ రక్షణ భాద్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే ఏవియేషన్ అకాడమీ హ్యాంగర్ లో ఉంచడం వల్ల ఏవియేషన్ అధికారులు కూడా పట్టించుకున్నారు. అకాడమీ సొంత ఖర్చుతో కెమేరా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
సాక్షి:
నిర్ణీత ఎత్తులో వెళ్ళాల్సిన హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణించింది? దిశ ఎందుకు మార్చారు?
నిపుణులు: వాతావరణ పరిస్థితులు సరిగాలేనప్పుడు హెలికాప్టర్ ని సురక్షితంగా గమ్యం చేర్చేందుకు పైలెట్ దిశను మార్చవచ్చు. అలాగే, ఎత్తు తగ్గించవచ్చు.
సాక్షి: సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ కూలిందేమో..
నిపుణులు: యాంత్రిక లోపం వల్ల రోటర్ వేగం తక్కువగా ఉండిఉంటే, హెలికాప్టర్ చెట్లకు తగిలిఆగిపోయేది. కానీ అలాజరగలేదు.ఆ సమయంలో గంటకు 260 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో హెలికాప్టర్ ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. అంటే యాంత్రిక లోపం లేనట్టే.
సాక్షి: హెలికాప్టర్ తయారీలో నాసిరకం విడిభాగాలు వాడారేమోనన్న అర్థం వచ్చేలా రాసింది.
నిపుణులు: అలాంటి అవకాశాలే ఉండవు. హెలికాప్టర్ కూలడంలో ఎలాంటి కుట్రలేదు. కేవలం వాతావరణం సహకరించక పోవడం వల్లనే గతితప్పి కూలిఉంటుంది.
- కణ్వస

Wednesday, October 21, 2009

వైఎస్సార్ అల్లుడి గుప్పెట్లో వందలకోట్లు !

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగిందంటూ ఒక పక్క సంచలనాత్మక కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనే మరోపక్క వైఎస్సార్ కుటుంబసభ్యులపైన కూడా నీలినీడలు పరుచుకుంటున్నాయి. ఎస్ఎంఎస్ ల ద్వారా, ఫోన్ల ద్వారా చెప్పుకుంటున్న గుసగుసలకు అక్షర రూపం కల్పిస్తే...
  • వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడు జగన్ కు ఇచ్చింది ఇవ్వగా కోట్లాది రూపాయలను అల్లుడు బ్రదర్ అనిల్ కు ఇచ్చారు.
  • వైఎస్సార్ కొన్ని విషయాల్లో అల్లుడి మాటలనే విశ్వసించేవారు. ఆ సమయంలో జగన్ మాట వినేవారు కారు.
  • వ్యాపార వ్యవహారాల్లో జగన్ కు మద్దతు ఇచ్చినా, రాజకీయ ఎత్తుగడల విషయంలో తండ్రీకొడుకుల మధ్య తేడాలు వచ్చేవి. అలాంటి సమయాల్లోనే అల్లుడు అనిల్ దగ్గరయ్యేవారు.
  • ప్రియమిత్రుడు కేవీపీ, అల్లుడు అనిల్ చెప్పిన మాటలు వినడంతో వైఎస్సార్ తన కుమారుడు జగన్ కు కొన్ని సందర్బాల్లో దూరం అయ్యారు.
  • మతపరమైన వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బ్రదర్అనిల్ మామగారిని ఇట్టే ఆకర్షించుకున్నారు.
  • వందలాది కోట్లు బ్రదర్ అనిల్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు.
  • వైఎస్సార్ దుర్మరణంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా `శూన్యత' ఆవరించింది. (ఇది రాజకీయ శూన్యత కాదు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శూన్యత)
  • ఆ శూన్యత నుంచి విభేదాల చిచ్చు రగులుకుంది. అది చివరకు బావ, బావమరిదిల మధ్య అఘాతాలు సృష్టిస్తోంది.
  • తండ్రి అప్పగించిన వందలాది కోట్లు ఇవ్వమంటూ జగన్ ఒత్తిడి తెచ్చారు. కేవీపీ చేత మధ్యవర్తిత్వం చేయించారు.
  • కేవీపీ సౌమ్యంగా సాగించిన మధ్యవర్తిత్వం నచ్చకపోవడంతో జగన్ ఆ పెద్దాయన్ని కూడా పక్కనపెట్టారు.
  • కుటంబవ్యవహారాలు చక్కదిద్దడానికి జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటానికి దిగారు.
  • తండ్రి మరణంతో తలెత్తిన ఈ ఆర్థిక సమస్యనుంచి ఎలా బయటపడాలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
కూలింది కుట్రతోనే- అంటూ వైఎస్సార్ తనయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున దర్యాప్తు, విచారణ మరింత కట్టుదిట్టంగా జరుపవచ్చు. అదే జరిగితే అసలు సంగతి ఎలా ఉన్నా, తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవుతుందన్న భయం వైఎస్సార్ బంధువర్గంలో వ్యక్తమవుతోంది.
మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో... నారాయణ...నారాయణ...

Tuesday, October 20, 2009

జగన్ Vs రవి ప్రకాష్

రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చు. ఫలానా వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడులే అని అనుకంటే, హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చేసుకోవచ్చు. సినీరంగం నుంచి ఓ ఎన్టీఆర్, ఓ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు. అనేక రంగాలవారు, అనేక వృత్తుల వారు రాజకీయాల్లోచేరి రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వినబడుతున్న టాక్ ఏమిటంటే, ఎలక్ట్రానిక్ మీడియా కింగ్ గా భాసిల్లుతున్న రవిప్రకాష్ అతి త్వరలోనే పొలికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారని. అంతేకాదు, కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతోనే రవిప్రకాష్ ఇకపై జగన్ కు పోటీ కావచ్చు. ఈ ఊహగానాలకు ఊతం ఇస్తున్న అంశాలు ఇవి....
  • సాక్షి పత్రికలో అక్టోబర్ 19 (సోమవారం) ప్రచురితమైన ప్రత్యేకకథనం (కూలింది కుట్రతోనే?) వచ్చింది. ఈ కథనానికి టివీ9 స్పందిస్తూ అదే రోజు రాత్రి ఏడున్నర గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని (కుట్ర సిద్ధాంతం) ప్రసారం చేసింది.
  • సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించాలంటూ రవిప్రకాష్ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
  • ముఖ్యమంత్రి రోశయ్యకూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికీ మనం సపోర్ట్ చేయాలంటూ సిబ్బందికి సంకేతాలు పంపించారు.
  • వెంటనే టివీ9 సిబ్బంది ఉరుకులూ పరుగులుపెట్టి సాక్షి `కుట్ర' సిద్ధాంతాన్ని వెలికిలాగారు.
  • ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో టివీ9 పాతుకుపోవడంతో సహజంగానే ఆయారాష్ట్ర ప్రభుత్వాలతోనూ, అటు కేంద్ర ప్రభుత్వంతోనూ అనేక పనులు ఉంటాయన్న ఉద్దేశంతోనే రవిప్రకాష్ చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నారు. అదేసమయంలో కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలను అందిపుచ్చుకుని రాజకీయ ప్రవేశానికి పావులు కదిపారు. అందులో భాగంగానే వరద బాధితుల సహాయం కోసం ప్రత్యేక ర్యాలీ పెట్టేసి ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నించారు.మరో పక్క రోశయ్యకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
  • జగన్ వర్గం బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టాలంటే మరో యువశక్తి ఉండాలన్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ప్రకారమే రవిప్రకాష్ నడుచుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
  • ఇదే జరిగితే, రాబోయే కాలంలో జగన్ కు రవిప్రకాష్ రాజకీయంగా గట్టి పోటీ ఇవ్వవచ్చు.
- కణ్వస

కేవీపీని టార్గెట్ చేసిన `సాక్షి'

`కూలింది కుట్రతోనే?' అంటూ అక్టోబర్ 19 (సోమవారం) సంచలన కథనాన్ని ప్రచురించిన `సాక్షి' దినపత్రిక మర్నాడు (20వ తేదీ మంగళవారం) మరో కథనంతో ముందుకొచ్చింది. ఈసారి `అగస్టా ఎందుకు రాలేదు'? అంటూ పాఠకుల్ని ప్రశ్నించింది. మొదటి రోజు ప్రశ్నతోనే బిత్తరపోయిన పాఠకుడు, మర్నాడు మరో ప్రశ్న రావడంతో అవాక్కయ్యాడు. ఇంతకీ జగన్ పెట్టుకుంది న్యూస్ పేపరో, `కొశ్చిన్ పేపరో' తెలియక జుట్టుపీక్కున్నాడు. రెండున్నర రూపాయలుపెట్టి కొనుక్కున్న పేపర్ కావడంతో పాఠకుడు గతిలేక చదవడం మొదలుపెట్టాడు. ఈ `అగస్టా' ఏమిటీ, అది ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారో తెలుసుకుందామని మ్యాటర్ లోకి వెళితే, సాక్షి `అంతరంగం' ఆవిష్కృతమైంది. ఆ వివరాలు...
హెలికాప్టర్ కూలడానికి ముందే అధికారులు అంతులేని నిర్లక్ష్యం వహించారు.
(బాగానే ఉంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సారే ఉన్నతాధికారులను దగ్గరుండి నియమించుకున్నారు. కాకుంటే ఆయన ప్రియమిత్రుడు కేవీపీ సలహామేరకు ఆ పని చేశారు. అధికారుల నిర్లక్ష్యం అని ఇప్పుడు సాక్షి అక్కసు వెళ్లగక్కితే అది ఎవరికి తగులుతుంది...దివంగత నేతకా, లేక కేవీపీకా..? తండ్రిమీద బురదజల్లలేడు కనుక జగన్ తన `పేపర్ రాకెట్' ను కేవీపీ `అంకుల్'పై గురిపెట్టాడు. ఢిల్లీలో తన పని కేవీపీ చక్కపెట్టలేకపోయాడన్న అక్కసే అక్షరాల రూపంలో కనబడుతున్నట్టుంది)
అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ ఉండగా బెల్ 430ని ఎందుకు వినియోగించారు?
(ఎవరు వినియోగించారో కూడా చెబితే బాగుండేది. (అసలు ఉద్దేశం ఏమంటే, ప్రజా భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న కేవీపీదే తప్పు అని చెప్పడమే. ఆయన్నే టార్గెట్ చేయడం.)
వైఎస్ ని ఎక్కించుకోవడానికి ముందు బెల్ 430 విమానం బేగంపేట విమానాశ్రయంలోనే అరకొర భద్రత ఏర్పాట్ల మధ్యనే పడిఉంది.
(బేగంపేట విమానాశ్రయాన్ని పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రపోయారన్నదే దీని భావం. మళ్ళీ ఇక్కడా కేవీపీపైనే `సాక్షి' గురిపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది)
ఇలాంటి కొశ్చిన్ మార్కులతో, అస్పష్టంగా ఏదో కుట్రజరిగిందన్న ఆలోచనలతో పుంఖానుఫుంఖాలుగా వార్తా కథనాలను ప్రచురించడంతో సాక్షి ఏ లక్ష్యాలను చేరుకుంటుందో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు కేవీపీ, రేపు రోశయ్య, ఎల్లుండి మరో పుల్లయ్య...ఇలా ఒక దుర్ఘటనపై బురదజల్లుకుంటూ పోతుంటే చివరకు జనం ఆ పేపర్నీ, దాని యాజమాన్యాన్ని నిలదీస్తారు. ఉన్నతాధికారులందర్నీ వైఎస్సారే స్వయంగా తెచ్చి తనపక్కన పెట్టుకున్నప్పుడు ఇక ఎవర్ని నిందించి ఏం లాభం. పైగా వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీ దుర్ఘటన అనంతరం జగన్ సీఎం కావాలని తపించారు. తనకు తోచిన సలహాలు చెప్పారు. అయినా జగన్ వర్గీయులు నానాయాగీ చేస్తుండటంతో ఆ పెద్దాయన మౌనవ్రతంబూనారు. అదే సమయంలో ఇటు జగన్ వర్గీయులు కేవీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే `అగస్టా ఎందుకు రాలేదు?' అంటూ `సాక్షి' మరో అనుమానాస్త్రం సంధించడం.
-కణ్వస

Monday, October 19, 2009

ఫోకస్ : సాక్షి `రాసింది' కుట్రతోనే?


ప్రియతమనేత వైఎస్సార్ దుర్మరణానికి దారితీసిన హెలికాప్టర్ దుర్ఘనటపై సాక్షి (అక్టోబర్ 19) దినపత్రికలో `కూలింది కుట్రతోనే?' అంటూ పతాకశీర్షికన విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఆరోజు, సెప్టెంబర్ రెండవ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవడంకోసం జనహృదినేత వైఎస్సార్ హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లాకు బయలుదేరిన కొద్దిసేపటికే నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. ఇది జరిగిన 50 రోజులకు సాక్షి పత్రికలో కుట్రతోనే హెలికాప్టర్ కూలిందన్న అర్థం వచ్చేలా ఒక కొశ్చన్ మార్క్ తగిలించి ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివిన తరువాత అసలు కుట్ర ఏమిటో అర్థంకాక బుర్రగోక్కోవాల్సిందే. ఎవరైనా దుండగలు విద్రోహక చర్యకు పాల్పడి ఉంటారనే విషయాన్ని కొట్టిపారేయలేమని దర్యాప్తు అధికారులు అంగీకరించడం గమనార్హం అంటూ ముక్తాయింపు పలికారు. ఈ విషయం చెప్పడానికి ఇంత `సీను' (ఇంత కవరేజ్)అక్కర్లేదు.
  • మొత్తం కథనం చదివిన తరువాత పరిశోధనాత్మకంగా కొత్త విషయాలు ఏం చెప్పారో ఒక పట్టాన అర్థంకావు. కుట్ర ఉన్నదని తేల్చేటప్పుడు బలమైన పాయింట్లు ఉండాలి. నిజంగా అలాంటివి ఏవో ఉండిఉంటే వాటిని లోపల దాచేసుకుని (చెప్పాలనుకున్న అసలు సంగతులు చెప్పకుండా) సాదాసీదా అంశాలు, గ్రాఫ్ లు, చిత్రాలతో పేజీ నింపేశారు.
  • ఇదంతా చదివిన వారికి హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న భావంకంటే, అసలు ఈ కథనాన్ని రాయడంలోనే రాజకీయ మతలబు ఉన్నదన్నట్టు అర్థమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఏ లక్ష్యంతో ఈ అస్త్రాన్ని సంధించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
  • కుట్రఏమిటో చెప్పకుండా, ఆ కుట్ర ఎవరు పన్నారో తెలుపకుండా నాన్చుడి ధోరణిలో రాయడం వల్ల ఆ పత్రిక ఏం సాధించాలనుకుంటున్నది?
  • ఎవరో గిట్టని వాళ్లు మన ప్రియతమనేత ఎక్కిన హెలికాప్టర్ ని కూల్చేశారని చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నట్టుండి అలజడి పెరిగిపోదా...దానివల్ల ఎవరికి లాభం?
  • ప్రజల్లో తలెత్తే అలజడి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయదా?. ఇది ప్రభుత్వ పనితీరుని స్తంభింపచేయవచ్చు. ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే తప్పకుండా మనస్తాపం కలుగుతుంది.
  • ప్రజలనుంచి ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం పార్టీ అధిష్టానంమీద కూడా పడుతుంది.
  • పార్టీ కళ్లు తెరిస్తే, వాస్తవాలు గ్రహిస్తే, కొత్త సీఎం ఎంపికలో వేగిరపడుతుంది.
  • ఒక మహా కుట్రవల్ల మహానేతను కోల్పోయామన్న భావన నిజానికి తీవ్రభావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
  • `కుట్ర' అన్న పదమే అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని ప్రయోగించడంద్వారా ఎవరు ఏమి ఆశిస్తున్నారన్న సందేహం కలుగుతుంది.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మీడియా కచ్చితమైన సాక్షాధారాలు లేకుండా కేవలం దర్యాప్తు బృందం ఎప్పుడో , ప్రారంభదశలోనే చెప్పిన అంశాల ఆధారంగా కుట్రతోనే కూలినట్టు రాయడం ఏమేరకు సమంజసం. ఇదంతా చూస్తుంటే సాక్షి పత్రికే కుట్రతో రాసిందని జనం అనుకోరా? మరి దీనికి ఆ పత్రిక ఏమని సమాధానమిస్తుంది?
నారాయణ...నారాయణ...

Friday, October 16, 2009

దీపావళి ఏరోజు జరుపుకోవాలి ?

మరో దీపావళి పండుగ వచ్చేస్తోంది. అయితే దీపావళి ఎప్పుడు జరుపుకోవాలంటూ `నారదలోకం' సంపాదకవర్గాన్ని అనేక మంది ఈ-మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా అడుగుతున్నారు. నరకచతుర్దశి ఎప్పుడొస్తుంది? శనివారంనాడు చతుర్దశి అయితే, మరి పండుగ మర్నాడు ఆదివారం అవుతుందికదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తిథులుమారే సమయాలను బట్టీ, పండుగ తలంట్లు, టపాసులు కాల్చుకునే ఆచారవ్యవహారాలనుబట్టిచూస్తే శనివారమే నరక చతుర్దశి అవుతుంది. ఆ రోజు పొద్దున్నే తలంట్లు పోసుకోవాలి. అదే రోజు రాత్రివేళ ఆనందంగా దీపావళి జరుపుకోవడం శుభకరం. ఇప్పటికే రాష్ట్రాన్ని కీడు పట్టిపడీస్తున్న వేళలో ఆదివారం రాత్రి దీపావళి పండుగ జరుపుకోవడం ఏ రకంగా చూసినా మంచిది కాదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుఝామున పండుగ తలంట్లు పోసుకోవడం శుభకరం. సరిగా ఆవేళలో నరక చతుర్దశి నడుస్తుంటుంది. నరకాసురుడి వధ అనంతరం తలంట్లు పోసుకోవడం మన ఆచారం. ఇక అదే రోజు, శనివారం రాత్రివేళ దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజాదికాలు పూర్తిచేసుకుని టపాసలు కాల్చాలి. బంధుమిత్రులతో కలిసి మధురపదార్ధాలు (స్వీట్స్) ఆరగించాలి.
ఈ ఏడాది తిథులు ఎలా మారాయో, దీపావళి అమావాస్య ఎప్పుడు వచ్చిందో సవివరంగా చూడండి...
  • త్రయోదశి శుక్రవారం మధ్యహ్నాం 2.31తో పూర్తవుతుంది.
  • ఆ తరువాత చతుర్దశి ప్రారంభమై అది శవివారం మధ్యాహ్నాం 12.37 వరకు ఉంటుంది.
  • అంటే శనివారం మధ్యాహ్నం తరువాత అమావాస్య వచ్చేస్తుంది.
  • శనివారం రాత్రి అమావాస్యే అందుకే శనివారమే దీపావళి.
  • ఈ అమావాస్య ఘడియలు ఆదివారం ఉదయం 11గంటల 40 నిమిషాల వరకు ఉంటాయి.
  • ఆ తరువాత కార్తీకమాసం పాడ్యమి మొదలవుతుంది.
  • పైన పేర్కొన్న టైమింగ్స్ భారతకాలమానం ప్రకారం వేసినవి,
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే kanvasas@gmail.comకి మెయిల్ చేయండి.
- కణ్వస

Wednesday, October 14, 2009

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-1)

రోశయ్యకు ఐదు పదులకు పైగానే విశేషంగా రాజకీయ అనుభవం ఉంటే ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతటి సంయమనం పాటించాలో, మరెంతటి హుందాగా మసులుకోవాలో ఈ పెద్దాయన వైఎస్సార్ పక్కనే ఉంటూ అన్నేళ్లు రాజకీయ సావాసం చేసినా వొంటపట్టించుకోలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ పెద్దకాపుదారుడిగా ఉన్న రోశయ్య ఆవేశపడినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరుత్తురలయ్యేవారు. అందుకే రోశయ్యను కొందరు `రోష'య్య అని కూడా చాటుమాటుగా పిలుచుకుంటున్నారు. ఇక పస్తుత విషయానికి వస్తే, రాజకీయంగా ఆయన శిఖరాగ్రానికి చేరారు. వైఎస్సార్ అనూహ్య మరణంతో ఎనభయేళ్లు నిండిన వయసులో ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించింది. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ప్రయత్నిస్తున్న టైమ్ లో అధిష్ఠానం ఆశీస్సులతో రోశయ్య ఆ పదవి దక్కించుకున్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రి సీను ముగిసిన తరువాత రోశయ్యలో ఆవేశం పెరగడం మొదలైంది. మొదటి నుంచి `కట్టె, కొట్టె, తెచ్చే' అన్నట్టుగా మాట్లాడే నైజం ఉన్న రోశయ్య ప్రజారంజకుడు కాలేడన్న విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంపైనైనా తెగేసి చెప్పడం, కుండబద్దల కొట్టడం సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి సరిపడదని చెప్పేవారేలేకపోవడంతో రోశయ్య తరచూ పప్పులో కాలేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులుగానీ, అనుచరగణంలోని వారుకానీ ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా ఉన్నవాళ్లు కారు. అందుకే ఈ పెద్దాయనకు మనసులోని మాట చెప్పి కొరివితో తలగోక్కోవడం ఎందుకని చాలా మంది నోరుమూసుకుంటున్నారు. ఆమాట కొస్తే, ఈ వ్యాస రచయత వయసు కూడా రోశయ్య రాజకీయ అనుభవమంత లేదు.
అయితే, ఒక సమర్ధవంతమైన ముఖ్యమంత్రి దారితప్పుతున్నప్పుడు, ప్రజలకు దూరమవుతున్నప్పుడు తెలియజెప్పాలన్న బాధ్యతను గుర్తెరిగి ఈ వ్యాసపరంపరకు పూనుకోవడం జరిగింది. పొగడ్తలతో ముంచెత్తే భట్రాజులకంటే, సద్వివిమర్శలు చేసేవారే నయం. మంచి మాటలు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లు కూడా చక్కని సూచన చేసినప్పుడు దాన్ని పాజిటీవ్ దుక్పథంతో స్వీకరించాలి. రోశయ్య ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. అలా జరగకపోతే అది వైరి వర్గీయులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకూ, దివగంత నేత వైఎస్సార్ కూ మధ్య ఉన్న తేడాలేమిటో విశ్లేషించుకోవాల్సిందే.
వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడో, లేదా అంతకు ముందు సీఎంగానే మీడియా ముందు మాట్లాడిన సందర్భాలనో పరిగణలోకి తీసుకుంటే రోశయ్య `సీనియారిటీ' ఆయన పాపులారిటీకి అక్కరకు రావడంలేదని అనిపిస్తోంది.
(మిగతా వివరాలు తరువాయి భాగంలో)
-కణ్వస

Monday, October 12, 2009

హెచ్చరిక: భూకంపం రాబోతుందా !

భూ వాతావరణంలో పెను మార్పులు వచ్చినట్టే, భూమి లోపలి పొరల్లో కూడా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని భూగర్భశాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల `ఎల్ నినో' అనే విపరీత పరిస్థితి ఏర్పడటంవల్లనే ఇప్పుడు అనేక దేశాల్లో (ఇందులో భారత్ కూడా ఉంది) అయితే కరువులు, కాకుంటే జలప్రళయాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి తోడుగా భూగర్భ పొరలు కదలిపోతున్నాయి. ఈ కారణంగానే సముద్రగర్భంలో పెను భూకంపాలు వచ్చి తద్వారా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు, వరదలు వచ్చిపడ్డాయి. ఈ విపరీత పరిణామాలు ఇక్కడితో ఆగవనీ, పెను భూకంపాలు కూడా రావచ్చని భూగర్భశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒక వేళ అదే జరిగితే, మానవ తప్పిదాల వల్ల జననష్టం ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ అవసరాల కోసం ఇటవల కాలంలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ఒకనాటి అడవులు, కొండలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోయాయి. ఫలితంగా ఒక మోస్తరుగా భూమికంపించినా జననష్టం అపారంగా ఉంటుంది. పైగా భూకంపాలను చాలా ముందస్తుగా గుర్తించడం కష్టమే. నాగరికత పేరిట మనం సృష్టించుకున్న అత్యాధునిక సౌకర్యాలే మనకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని కూడా పర్యావరణ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. సాధ్యమైనంతవరకూ ప్రకృతిని గౌరవిస్తూ, దాని పరిధికి లోబడే జీవించడం నేర్చుకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బతికిబట్టకట్టగలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. మరి, దీనిపై మీరేమనుకుంటున్నారు. మీ కామెంట్స్ మాకు పంపించండి. రాబోయే విపత్తులను అధిగమించడానికి ఏం చేయాలో సూచించండి.
-కణ్వస

రవిప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ?

మీ ఊహనిజమే. రవిప్రకాష్ అంటే మీరు అనుకుంటున్న రవిప్రకాషే. టివీ 9ని ఎంతో సమర్థవంతంగా నడుపుతున్న రవిప్రకాషే. ఆయనేంటీ, రాజకీయాల్లోకి రావడమేమిటని కాస్తంత ఆశ్చర్యపోవచ్చు. కానీ జరగబోతున్నది అదే. ఈ ప్రతినిధి అత్యంత గోప్యంగా సేకరించిన సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
  • చాలాకాలం క్రిందటే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే ఒక సందర్భంలో రవిప్రకాష్ ని ఎంకరేజ్ చేస్తూ, `మీ లాంటి యూత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో మీలాంటి వాళ్ల సహకారం ఎంతో అవసరం' అని చెప్పారు.
  • మీడియా శక్తివంతమైనదే అయినా, ప్రజలకు సేవ చేయడానికి మీడియాకంటే రాజకీయాలే సరైన వేదికన్న భావన రవిప్రకాష్ లో కలిగించారు.
  • వైఎస్సార్ ఒక ఉద్దేశంతో రవిప్రకాష్ తో ఈ ప్రోత్సాహకరమైన మాటలు చెబితే, వాటినే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మరో రకంగా ఉపయోగించుకుంటున్నది.
  • జగన్ వంటి యువనేత ఒక పక్క ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటూ తనదైన బలాన్నీ, బలగాన్నీ పెంపొందించుకుంటున్నప్పుడు అతగాడికి చెక్ పెట్టాలంటే మరో యువశక్తి కావాలని కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. సినీరంగం నుంచి కానీ, లేదా మీడియా రంగం నుంచి కానీ ఎవరైనా అలాంటి యువకెరటం ఉంటే పని సులువవుతుందని అధిష్ఠానం అనుకుంది.
  • సరిగా అదే సమయంలో సినీనటుడు రాజశేఖర్ పీసీసీ కార్యాలయంలో డిఎస్ కి ఓ సూచన చేశారు. గతంలో కొంతమేరకు ఆసక్తి కనబరిచిన రవిప్రకాష్ ను ఇందుకోసం వినియోగించుకోవచ్చని చెప్పడంతో పావులు చకచకా కదిలాయి. కర్నూలుకి వరద వచ్చినప్పుడు రవిప్రకాష్ మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించిన తీరు ఢిల్లీ పెద్దలను ఆకర్షించింది. వెంటనే రాజశేఖర్ ద్వారా ఓ సందేశం రవిప్రకాష్ కు చేరింది.
  • టివీ 9 కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పాతుకుపోవడంతో వ్యాపారపరంగా అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఇటు కేంద్రంలోని యుపీఏ సర్కార్ తోనూ అనేక అవసరాలు సహజంగానే ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ఉభయతారకంగా ఉంటుందని రవిప్రకాష్ భావించారు.
  • వరదబాధితుల సహాయార్థం అట్టహాసంగా ర్యాలీలు చేపట్టారు. రవిప్రకాష్ తన టీమ్ తో ప్రజల ఫీలింగ్స్ ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.
  • టివీ ఛానెల్ కి సీఈఓ గా ఉన్న రవిప్రకాష్ అంతా అనుకూలిస్తే, అతి త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయవచ్చన్న సంకేతాలు కనబడుతున్నాయి.
- కణ్వస

Saturday, October 10, 2009

పోకస్: బలహీనపడిన జగన్ - 3

వైఎస్ మరణానంతరం రాజకీయంగా శూన్యత ఏర్పడిందనీ, స్తబ్దత చోటుచేసుకుందని ఎవరైనా అంటే అందులో నిజం లేదనే చెప్పలి. ఎందుకంటే, వైఎస్సార్ పార్థివ శరీరానికి అంత్యక్రియలు పూర్తికాకముందే వివిధ పార్టీల శిబిరాల్లో అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు చోటుచేసుకున్నాయి. కాకపోతే ఒక పెద్ద నాయకుడు ఉన్నట్టుండి కనుమరుగు కావడంతో ఎల్లెడలా భావోద్వేగం చోటుచేసుకున్నమాట వాస్తవమే. ఆ భావోద్వేగమే జగన్ వంటివారికి అదనపు బలాన్ని అందించింది. నిజానికి ఇది బలుపా, వాపా అన్నది ఈ యువనాయకుడు గ్రహంచేలోపే అధిష్ఠానం వద్ద - శక్తివంతుడైన యువనేతకు జరగరాని అన్యాయం జరిగిపోయింది. భావోద్వేగం నుంచి ఎగిసినపడిన ఆవేశం జగన్ రాజకీయ కెరీర్ కు మేలు చేయకపోగా కీడు చేసింది. సరిగా ఇదే సమయంలో ప్రత్యర్థులు బలం పుంజుకోవడం ప్రారంభించారు.
ఇదే శీర్షికన మొదటి రెండు భాగాల్లో ప్రస్తావించినట్టు తాత్కాలిక ముఖ్యమంత్రే అనుకున్న రోశయ్య పూర్తిగా సీఎం సీటును ఆక్రమించుకున్నారు. అధిష్టానమంత్రాన్ని వల్లెవేస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. అదే, జగన్ ఈ పని చేయలేకపోయారు. పావురాలగుట్టకు చేరువలోని నల్లకాలువ వద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు జగన్ కనీసం ఒక్క మాట కూడా పార్టీ గురించి కానీ, లేదా అధిష్ఠానం గురించి కానీ ప్రస్తావించలేదు. అధిష్టానమంత్ర మహిమను జగన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీగానీ, అందులోని సీనియర్ నేతలు కానీ ఈ యువనేత మనోభావాలను సరిగా అవగతం చేసుకోలేకపోయారు. జగన్ అనుయాయుల ప్రేలాపనలు, చేష్టలు యువనేతపై రుద్దే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి మరిన్ని కల్పించి చేరవేశారు. సరిగా అదే సమయంలో జగన్ మౌనవ్రతం వీడి వాస్తవాలను స్పష్టంగా వెల్లడించి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండది. జననేత మహాభినిష్క్రమణ తరువాత ఆయన కుమారుడు తండ్రి స్థానంలో కూర్చోవాలనుకోవడంలో తప్పలేదు, కానీ, అందుకు ఆయన ఎంచుకున్న మార్గంలో వైరి వర్గాల వారు అనేక హర్డిల్స్ సృష్టించారు. ఫలితంగా జగన్ ఉన్నట్టుండి రాజకీయంగా బలహీనుడయ్యారు.
రోశయ్య, చంద్రబాబు బలోపేతులైనట్టుగానే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అదునుచూసి పావులు కదుపతూ, బలపడే ప్రయత్నం ప్రారంభించారు. సీఎం కావాలన్న ఆయన ఆశ ఎలాగో ఇప్పట్లో తీరదు కనుక మరోదారిలో సాగతూ, గౌరవప్రదమైన సీటు (వీలైతే హోం మంత్రి పదవి) దక్కించుకోవాలనుకున్నారు. జగన్ ప్రభావం వల్ల రోశయ్య ప్రభుత్వం మైనార్టీలో పడితే, ఆదుకోవడానికి తనవద్ద ఉన్న 18 మంది ఎమ్మేల్యేలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. అయితే ఇందుకు ప్రతిగా హోంశాఖ కావాలని చిరంజీవి రోశయ్యను కోరినట్టు తెలిసింది. తిరుపతిలో రోశయ్యను కలుసుకుని దాదాపు గంటన్నరసేపు ముచ్చట్లు జరిపిన చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ రకంగా చిరంజీవి బలోపేతమవుతూ, జగన్ పై పరోక్షంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరి, తెరాస అధినేత కేసీఆర్ ఏ విధంగా పావులు కదుపుతున్నారు? జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆసక్తికరమైన విషయాలను కూడా విశ్లేషించుకోవాల్సిందే...
(కేసీఆర్ ఎత్తుగడలు తరువాయి భాగంలో)
-కణ్వస