Friday, October 9, 2009

నోబెల్ శాంతి ప్రైజ్ కి ఒబామా అర్హుడేనా?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2009 నోబెల్ శాంతి బహుమతికి ఎంపికకావడం ఆశ్చర్యమే. నార్వీజియన్ నోబెల్ కమిటీ ఆయనకు ఏ సదుద్దేశాలు అంటగట్టి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ ప్రైజ్ ఇచ్చిందో, కమిటీ చెబుతున్న కారణాల్లో ఏమేరకు నిజం ఉందో తెలుసుకోవాలనుకునేవారు ఈ వ్యాసం చదవాలి.
  • నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ల ఆఖరి గడువు ఫిబ్రవరి ఒకటవ తేదీ కాగా, ఈ తేదీకి కేవలం రెండువారాల ముందే ఒబామా అమెరికా దేశాధ్యక్షుడయ్యారు.
  • మొత్తం 205 నామినేషన్లు వస్తే, అందులో ఒబామాలోనే కమిటీ సభ్యులు శాంతి మూర్తిని వీక్షించగలిగారు.
  • ప్రపంచ మానవాళికి శాంతినిచ్చే మహానుభావునిగా కమిటీ కొనియాడింది.
  • వివిధ సమాజాల నడుమ సహకారం, శాంతి వెల్లివిరయడానికి ఒబామా చేసిన కృషిని కమిటీ ప్రశంసించింది.
  • అణ్వాయుధాల వ్యాప్తి నిరోధకునిగా కమిటీ గుర్తించింది. శాంతి దూతగా కొనియాడింది.
  • అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన భావాలను చిగురింపజేసిన మహిమాన్వితునిగా గుర్తించింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలవడంలో ఇంతటి నూతనత్వం ఉందని బహుశా మరెవరూ ఊహించి ఉండరేమో)
  • నల్లజాతీయుడు శ్వేతసౌధాన్ని అధిష్ఠించినందుకే బహుశా ఈ అవార్డు ఇచ్చారేమో.
  • అమెరికా దేశాధ్యక్షునిగా ఎన్నికైన 9 నెలల్లోనే ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం ఆశ్చర్యమే.
  • ఒబామా ఈ నొబెల్ శాంతి అవార్డును డిసెంబర్ పదిన అందుకుంటారు. బంగారు పతకంతోపాటుగా స్పెషల్ డిప్లొమా, 14 లక్షల డాలర్ల నగదు బహుమతిని అందుకుంటారు.
  • 1885లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో నోబెల్ శాంతి బహుమతి ఎలాంటి వారికి ఇవ్వాలో చాలా వివరంగానే ప్రస్తావించారు. 'ప్రపంచ దేశాల శాంతి కోసం తపిస్తూ అందుకోసం తన జీవిత కాలంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తికి ఈ ప్రైజ్ ఇవ్వాలి. అలాగే, యుద్ధాలు జరగకుండా తీవ్రంగా ప్రయత్నించే వ్యక్తిని ఎంచుకోవాలి'
  • అమెరికా అధ్యక్ష హోదాలో ఉండగా నోబెల్ శాంతి ప్రైజ్ అందుకున్న వారిలో ఒబామా మూడవ వ్యక్తి (రోస్వెట్ - 1906, ఉడ్రో విల్సన్ - 19919) కాగా, మాజీ అధ్యక్షునిగా 2002లో జిమ్మీ కార్టర్ ఈ బహుమతికి ఎంపికయ్యారు.
- కణ్వస

ట్యాగ్: Obama , Nobel , Peace

స్పెషల్: ఎటు వెళ్ళినా మనోళ్లే...!

ఈ భూమండలం మొత్తాన్ని `మనోళ్లు' ఆక్రమించినట్లే ఉన్నారు. ఎక్కడకు వెళ్ళినా ఎటుచూసినా ఎన్నారైలు కనబడుతున్నారు. ఆఫ్రికా ఆడవుల్లోకి వెళ్ళినా, బొలీవియా కొండలెక్కినా, చివరకు ఐస్ లాండ్ కు వెళ్ళినా మనోళ్లు కనబడుతుంటారు.
`మనవోళ్ళు మేథావులోయ్, ఎక్కడైనా బతికేయగలరు' అంటూ వెటకారం చేయాల్సిన పనేలేదు. నిజంగానే ప్రపంచంలోని 183 దేశాల్లోని 180 దేశాల్లో ఎన్నారైలు ఎంచక్కా జీవించేస్తున్నారు. అయితే మిగతా మూడింటి మాటేమిటంటారా... ఉత్తర కొరియా, పాకిస్తాన్, భూటాన్ దేశాల్లో మాత్రం మనవాళ్లు లేరని తేలింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మధ్యనే రాబట్టిన సమాచారం ప్రకారం అత్యధికంగా 17 లక్షల మంది ఎన్నారైలు సౌదీ అరేబియాలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో 14 లక్షల మంది, అమెరికాలో పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నారట.
పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న ద్వీపం Palauలో కూడా ముగ్గురు ఎన్నారైలు ఉన్నారు. ఈ ద్వీపానికి ఈమధ్యనే స్వాతంత్ర్యం వచ్చింది. అలాగే బొలీవియా పర్వతప్రాంతాల్లో మనవాళ్లు ఓ 20 మందిదాకా ఉన్నారు. గుజరాత్ కు చెందిన వ్యాపారులూ, తమిళనాడుకు చెందిన చెట్టినాడ్లు కొన్నివందల సంవత్సరాల కిందటే దూరదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. మీకో జోక్ గుర్తుకువచ్చే ఉంటుది. అమెరికావాళ్లు చంద్రమండలం మీద కాలుమోపిన తొలినాళ్లలో పేలిన జోక్ ఇది...
చంద్రుడిమీద అమెరికా వాళ్లు తిరగాడుతూ, తామే చంద్రుడిమీద ముందుగా కాలుమోపామని సంబరపడుతుంటే, అప్పుడక్కడకు `ఆఁ..:ఛాయ్, ఛాయ్...'అంటూ ' టీ అమ్ముకునే కేరళవాడు వచ్చాడట.
గ్లోబలైజేషన్ పుణ్యామా అని ఈ మధ్య మన భారతీయులు ఏ దేశంలోనైనా ఉద్యోగం చేయడానికి రెడీ అవుతుండటంతో ఏటా ఎన్నారైల సంఖ్య పెరిగిపోతున్నదట. ఇదీ సంగతి.
- రాజ్ (విజయవాడ ప్రతినిధి)

పోకస్: బలహీనపడిన జగన్ - 2

జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని మొదటి భాగంలోనే చెప్పాను. అలాంటి శక్తి బలహీనపడిందంటే, దానర్థం వ్యతిరేక శక్తులు బలోపేతమయ్యాయనే అర్థం చేసుకోవాలి. తాత్కాలిక ముఖ్యమంత్రిగానే రోశయ్య ఉంటారని జగన్ అనుయాయులు అనుకుంటే, అది కాస్తా రివర్సయింది. రోశయ్య మస్టారు సీఎం సీట్ ని ఫుల్ గానే ఆక్రమించేశారు. అంతేకాదు, బెత్తం పట్టుకుని దారికిరాని పిల్లల్ని (మంత్రులను, అధికారులను) లొంగదీసుకునే పని కూడా చేపట్టారు. రోశయ్య ఇలా బలోపేతమవుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరోపక్క బలోపేతమవుతున్నారు.

CBN బలోపేత క్రమం..

వైఎస్సార్ మరణం బాధాతకరమైనదే అయినా, రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరిపోసిందనే చెప్పాలి. వైఎస్సార్ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును నిద్రపోనియ్యకుండా చేశారు. గత ఎన్నికల్లో టిడిపీ ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ వైఎస్సార్ ముందు బెడిసికొట్టాయి. 2014నాటికి టిడిపీని నామరూపాలు లేకుండా చేయాలని వైఎస్సార్ అత్యంత రహస్యంగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే టిడిపీలోని ప్రముఖులను తనవైపు ఆకర్షింపజేసుకునే పని మొదలుపెట్టారు. ఈ ఆకర్షణకే సినీనటి రోజా కూడా పడిపోయింది. సరిగా అలాంటి సమయంలో దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం పాలయ్యారు. రాజకీయంగా ఆలోచిస్తే, ఇది టిడిపీకి నూతన జవసత్వాలను అందించిన ప్రధాన సంఘటనగా మారింది. సంతాప దినాలు పూర్తయ్యేదాకా మాట్లాడకుండా, ఆ తరువాత చంద్రబాబు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆరంభించారు.
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరువు, ఆతరువాత విరుచుకుపడిన వరదలు CBNకు రాజకీయంగా ప్లస్ పాయింట్లై కూర్చున్నాయి. వరదలు రాగానే బాబు చకచకా పావులు కదపడం మొదలుపెట్టారు. తానే సీఎం అయినట్టుగా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారుల్లోని వైఫల్యాలను ఎండగట్టారు. హెలికాప్టర్ లో ఎక్కి ఏరియల్ సర్వేలు నిర్వహించారు. వరదలు రావడానికి ప్రధాన కారణం అధికారుల్లో నిర్లక్ష్యమేనని తేల్చారు. తాను సీఎంగా ఉండగా, వరదలొచ్చినప్పుడు ఎలా స్పందించానో పోల్చి చెప్పారు. కర్నూలు పట్టణాన్ని కేవలం రెండు రోజుల్లో బాగుచేయవచ్చంటూ అసమర్థ అధికార గణాన్ని తూర్పారబట్టారు.
వరద సాయం కోసం చంద్రబాబు నడుం బిగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట నిధులు సేకరించే పనిలో పడ్డారు. అన్నార్తులను ఆదుకునేందుకు నేనున్నానంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల చెక్కును నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడంతో కంగుతున్న చంద్రబాబు ఆ వెంటనే తేరుకుని మేనళ్లుడిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ జూనియర్ (రాజకీయంగా జూనియరే) తన జేబులో నుంచి మరో 20 లక్షలు తీసి ట్రస్టుకు ఇవ్వక తప్పిందికాదు.
తానూ, తన పార్టీ ప్రజల మేలుకే ఉన్నదన్న అభిప్రాయం కలిగించేలా చంద్రబాబు రేయిబవళ్లు కృషిచేస్తున్నారు. ఇంతకాలం రాజకీయంగా తనకు పక్కలో బళ్లెంలా ఉన్న వైఎస్సార్ ఎలాగో లేరుకనుక అందివచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని 2014నాటికి బలోపేతమై అధికార పగ్గాలు చేపట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అదే సమయంలో మరో పక్క సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ముచ్చటపడిపోతున్న జగన్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నిన్నమొన్నటి దాకా ఊగిపోయిన జగన్ సేన `వరద సీన్లో' కనబడటంలేదు. ఒక వేళ కనిపించినా ప్రజాస్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇంకో పక్క సీఎం కావాలని తెగ తపించి సొంతంగా పార్టీ పెట్టుకుని భంగపడిన మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారో కూడా గమనించాల్సిందే...
(చిరంజీవి, కేసీఆర్ వ్యూహాలు తరువాయి భాగంలో)

Thursday, October 8, 2009

రోశయ్యకు అండగా కేసీఆర్!

నిన్నమొన్నటిదాకా వైఎస్సార్ నీ, రోశయ్యను తిట్టిపోసిన కేసీఆర్ కు ఇప్పుడు lతాతయ్య పక్షానే నిలవాలనుకుంటున్నారు. వైఎస్సార్ కారణంగానే తన రాజకీయ వ్యూహాలకు దెబ్బతగిలిందన్న ప్రగాఢంగా నమ్ముతున్న కేసీఆర్ ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కు బద్ధ విరోధిగా మారిపోయారు. ఒక వేళ జగన్ అనుచరులుగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు తోక జాడించే పక్షంలో తన పక్షాన ఉన్న పది మంది ఎమ్మెల్యేలు (తెరాస ఎమ్మెల్యేలు) రోశయ్య పక్షాన నిలవడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ అధిష్ఠానాన్నీ, మరీ ముఖ్యంగా సోనియా మేడమ్ ను పొగడినట్టు సమాచారం అందింది.
రాష్ట్రంలో జగన్ సీఎం కావాలంటూ ఉద్యమం ఊపందుకోవడం, ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించడం, ఆపైన మంత్రులు కొందరు బహిరంగంగానే జగన్ కు సీఎం పదవి ఇవ్వకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదరించడంతో అధిష్ఠానం రోశయ్యకు రక్షణ కవచం తయారుచేసేపనిలో పడింది. ఒక వేళ రోశయ్య ప్రభుత్వం మైనార్టీలో పడితే, విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే, అప్పుడు అటు పీఆర్పీ ఎమ్మెల్యేలను, ఇటు తెరాస ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతున్నట్టు తెలుసుకునే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియాను పొగడ్తలతో ముంచెత్తారు. అందుకే, రోశయ్యను మహాత్మాగాంధీతోనూ, పొట్టి శ్రీరాములతోనూ పోల్చారు.
కణ్వస

పోకస్: బలహీనపడిన జగన్ - 1

 వైఎస్సార్ తనయుడు, పార్లమెంట్ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డి నిజానికి ఒక వ్యక్తి కాదు. అతనో శక్తి. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వైఎస్సార్ మరణానంతరం సీఎంగా జగన్ నే చూడాలని అనేకులు కోరుకున్నమాట కూడా నిజమే. మొదట్లో అనుకూల పవనాలు వీచినా ఆ తరువాత అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడంతో రాజకీయంగా జగన్ బలహీనపడటం మొదలైంది. జగన్ సేనలో కూడా మొదట్లో ఉన్న ఉత్సాహం, పట్టుదల క్రమేణా తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు.
 ముఖ్యమంత్రి పదవన్నది వారసత్వంగా వచ్చేది కాదని తెలిసినప్పటికీ,  వైఎస్సార్ వారసునిగా జగన్ నే ఆ సీట్లో కూర్చోబెట్టాలన్న పట్టుదల రాష్ట్రంలో శ్రుతిమించింది. ఎక్కడా, ఏ నలుగురు మాట్లాడుకున్నా జగన్ సీఎం అవుతాడా? కాదా? అన్న ప్రశ్నలే తలెత్తాయి. వైఎస్సార్ భౌతిక కాయం ఇంకా ఇడుపులపాయకు కూడా చేరకుండానే వ్యూహాత్మకంగా జగన్ ని సీఎం చేసే బృహత్తర కార్యక్రమం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే వైఎస్సార్ అనుంగు మిత్రుడు కేవీపీ ఢిల్లీ చుట్టూ బలపం కట్టుకుని మరీ తిరిగారు. మొదట్లో సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆ తరువాత బిగదీసుకోవడం మొదలెట్టింది. రోశయ్యను తాత్కాలిక మఖ్యమంత్రిగానే మొదట్లో భావించినా ఆ తరువాత మనసుమార్చుకుని `తాతయ్య'కే సీఎం సీటు ఖరారు చేయడంతో జగన్ వర్గీయులు కంగుతిన్నారు. దీంతో జగన్ బలహీన పడ్డాడు.
 చాలా ఆశ్చర్యకరమైన పరిణామమేమంటే, వైఎస్సార్ మరణానంతరం జగన్ బలహీనపడుతుంటే, మరో పక్క నలుగురు రాజకీయ ఉద్దండులు బలపడటం. వారిలో మొదటి వ్యక్తి రోశయ్య.
  వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడూ, ఇప్పుడూ అధిష్ఠానం మాటకే కట్టుబడిఉండే తత్వంగల ఈ కాంగ్రెస్ తాతయ్య ఒక్కమాటలో చెప్పాలంటే అధిష్ఠానం చేతిలో కీలుబొమ్మ. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అధిష్ఠానం ఎవ్వరిని సీఎం సీట్లో కూర్చోబెట్టినా తాను వారికి పూర్తి మద్దతు ఇస్తానంటూ చాలా లోక్యంగా సెలవిచ్చారు. రాష్ట్రాన్ని వరద బీభత్సం చుట్టుముట్టినా తనకున్న పాలనాచాతుర్యంతో తొట్రుపాటుపడకుండా రోశయ్య అత్యంత సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు. వాస్తవ పరిస్థితులను కుండబద్దలుకొట్టినట్టు చెప్పేతత్వంగల రోశయ్య విషయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా గురి కుదిరినట్టే ఉంది. వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికని సోనియా వచ్చినప్పుడు రోశయ్య మాస్టారికి కితాబు ఇచ్చినట్టు సమాచారం అందింది. మేడం సోనియా పూర్తి ఆశీస్సులు ఉండబట్టే రోశయ్య వైఖరిలో మార్పు వచ్చింది. అందుకే పోలీస్ అధికారుల శాఖలను బదలాయించారు. వివాదాస్పద వ్యక్తులైన యూదవ్ వంటి వారిని దూరం నెట్టేశారు. జవాబుదారీతనం, పారదర్శకత పట్ల విశ్వాసం ఉన్న అధికారులను దరికిచేర్చుకున్నారు. అలాగే రేపోమాపో మంత్రివర్గాన్ని తనకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. జగన్ ని చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయి ప్రేలాపనలు ఆడిన కొందరికి ఉద్వాసన తప్పేలాలేదు.
 రోశయ్య అతి త్వరలోనే మరోపని కూడా చేయబోతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాప్రయోజన పథకాలకు అవుతున్న వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత వెళుతున్నదీ, అలాగే, కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ప్రజలకు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పత్రికా ప్రకటన కూడా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాలంలోనూ, ఆ తరువాత కూడా రాష్ట్ర పజల్లో  సరైన అవగాహన లేక పథకాలన్నీ రాష్ట్ర ఖజానా నుంచే వస్తున్నాయన్న భ్రాంతి ఏర్పడింది. ప్రజలను ఈ భ్రాంతి నుంచి బయటపడేయాలని ఇప్పుడు రోశయ్య మాస్టారు లెక్కలు చెప్పాలనుకుంటున్నారు. దీని వల్ల కేంద్రం నుంచి ఎంత భారీగా సాయం అందుతుందన్న విషయం పజలకు కళ్లకుకట్టినట్టు కనబడుతుంది. ఈ వాస్తవాలు తెలియకనే చాలా మంది కేంద్ర ప్రభుత్వాన్నీ, దాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని (అధిష్ఠానాన్ని) చులకనచేసి మాట్లాడుతున్నారనీ, అందుకే వాస్తవాలు తెలియజెప్పి అధిష్ఠానం గొప్పదనాన్ని చాటిచెప్పాలని ఢిల్లీ నుంచి కబురు రావడంతో ఇక్కడ సీనియర్లలో కదలిక వచ్చింది. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ జలయజ్ఞంలో నాలుగైదు పథకాలను జాతీయ పథకాలుగా గుర్తించాలన్నా, అభయహస్తం మొదలుకుని రుణమాఫీల దాకా అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాల వెనుక కాంగ్రెస్ అధిష్ఠాన హస్తం ఉన్నదని చాటిచెప్పేందుకే రోశయ్య నడుం బిగించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంత మంది అడ్డుతగిలినా తన సీటు పదిలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే రోశయ్య అధిష్ఠానం ఆశీస్సులతో ఈ ఫార్ములాను ఎంచుకున్నారు. రోశయ్యేనే 2014 వరకు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. అందుకే వయసు పైబడినా రోశయ్య మాస్టారు శ్రమఅనుకోకుండా పనులు చక్కబెట్టుకుంటున్నారు.
 జగన్ బలహీన పడటానికి రోశయ్య ఒక్కరే కారణం కాదు. మరో ముగ్గురు (చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి)కూడా కారణభూతులే. ఇలాంటి సంకట స్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు? రాజకీయంగాఎలాంటి ఎత్తులు వేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.
    (ఆ వివరాలు తరువాయి భాగంలో..)
- కణ్వస

Wednesday, October 7, 2009

ఫోకస్: `ట్రస్ట్' మీ ఫ్లీజ్...

వరద తగ్గుముఖం పట్టగానే `విరాళాల వరద' రాష్ట్రాన్ని చుట్టుముడుతోంది. మానవత్వం అడుగంటుతున్న వేళలో ధన, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వడానికి దాతలు క్యూకడుతుండటం హర్షనీయ పరిణామమే. అయితే, ఇదే సమయంలో స్వార్థపూరిత సంస్థలు దాతలను బుట్టులో పడేసుకునే పనిలో నిండా మునిగిపోయాయి. వివిధ రకాల ఫౌండేషన్స్, సంస్థలు, సేవా సంఘాలు వరద బాధితులకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి. వీటిలో కొన్ని బోగస్ వేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాతలు అయోమయంలో పడిపోతున్నారు. అన్నార్తులను ఆదుకోవడం కోసం ముందుకు తరలివస్తున్న కోట్లాది మందిని బురిడీ కొట్టేంచేందుకు అనేక సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలలు విసురుతున్నాయి. తామందించే సాయం నేరుగా బాధితులకు చేరుతుందా?లేక ఆర్గనైజర్ల జేబులోకి చేరుతుందా తెలియక దాతలు కలవరపడుతున్నారు.
దాతల నుంచి తమకందిన భూరి విరాళాలను ఒడుపుగా కాజేసే ఘనులున్నారు. అందుకే దాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేరుగా ఛీప్ మినిస్టర్ సహాయ నిధికే చెక్కులు పంపితే చాలా మంచిది. అలాగే, ప్రభుత్వం లేదా పూర్తిగా నమ్మదగ్గ సంస్థకు మాత్రమే వస్తువులు, దుస్తులు అందించడమే మేలు. బాధితుల కడగండ్లు తీర్చాలన్న తపనతో దాతలు ఇచ్చే విరాళాలు స్వార్థపరుల హస్తాల్లో చిక్కుకోకుండా చూడాలి.
విరాళాలు పంపదలచుకున్నవారు క్రాస్డ్ చెక్ ని చీఫ్ మినిస్టర్ రలీఫ్ ఫండ్ పేరిట సెక్రటరేట్, హైదరాబాద్ కు పంపించడం సర్వోత్తమం. మిగతా ఎవరికి అందించినా అది దీనికి సాటిరాదు. బహుశా అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ కూడా 20 లక్షల రూపాయల చెక్ ను తన తాతగారిపేరిట ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ కి కూడా ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రి రోశయ్యకే ఇచ్చారు. అలా అని టిడిపీతో ఆయన విభేదించారనో, లేదా చంద్రబాబుకు దూరం అయ్యారనో అనుకోవాల్సిన పనిలేదు. ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు ఐఎస్ఐ మార్క్ ఎలా చూస్తామో, అలాగే మనం దానంగా ఇచ్చేటప్పుడు కూడా `విశ్వసనీయత'ను చూడటంలో తప్పులేదు. ఆ విశ్వసనీయత ఈ తాతగారిలో (రోశయ్యలో) జూనియర్ ఎన్టీఆర్ చూశారేమో..ఏమే.అంరతేకానీ, `మామకు షాకిచ్చిన అల్లుడు' అంటూ ఒక పేపర్ రాసినంతగా సీను లేదు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకంటే తన కెరీర్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారన్నదే నిజం. ఇలాంటప్పుడు తోటి హీరోలకు(అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్) పోటీగానే, ప్రచారం కూడా ఎక్కువ రావాలనే ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా కేవీపీతో కలిసి సీఎంను కలిశారు. రాజకీయాల్లో నిండా మునిగి మొన్నీమద్యనే చేతులు కాల్చుకున్న ఎన్టీఆర్ ఇప్పట్లో మళ్ళీ అలాంటి సాహసం చేయకపోవచ్చు.
-కణ్వస

Tuesday, October 6, 2009

ఎడిటర్స్ వాయిస్: గోరంత సేవకు కొడంత ప్రచారం!

నిన్నటిదాకా లేనిపోని భయాలు సృష్టించి, వరద న్యూస్ తో రేటింగ్ పెంచుకోవాలని చూసిన కొన్ని ఛానెళ్లు (కొన్ని ఛానెళ్లని ఎందుకనాల్సి వస్తుందంటే, ఒకటి రెండు న్యూస్ ఛానెళ్లలో ఇంకా జర్నలిజం ఎథిక్స్ చావలేదుకనుక) ఇప్పుడు వరద బాధితులకు తమ టివీ ఛానెల్ సహాయం చేస్తుందని ఊదరగొడుతున్నాయి. మందిస్తున్న సహాయక కార్యక్రమాలను పదేపదే చూపిస్తూ, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడంలేదన్న భ్రాంతి కలిగేలా చేస్తున్నారు. ఏక సంఖ్యతో ఉండే నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ మొదటి నుంచి వార్తా విశేషాలను రేటింగ్ కోణంలోనే ఇస్తోంది. కర్నూలు బాధితులకు సాయం చేయాని విజ్ఞప్తి చేస్తూ, ఏకంగా ఫ్యాక్షనిస్టులకు మేలుకొలుపు గీతం పాడింది. ఆ మేలుకొలుపు గీతం సారం ఇదే..
`మీరు ఫ్యాక్షనిస్టులుగా హత్యలు చేసి ఉంటారు. నెత్తురు పారించి ఉంటారు.మీ సీమ కష్టాల్లో పడింది. ఇప్పుడు మేలుకొండి. వరద బాధితులకు సాయం చేయండి. మీ పాపాలు కడుక్కొండి.'
ఇలా చెప్పడం వల్ల కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కత్తులు, బాంబులు ఓ మూలకు విసిరేసి బుద్ధిగా టాటా సుమోలెక్కి సదరు టివీ ఛానెల్ ఆఫీసుకు రయ్యిమంటూ వచ్చేసి సదరు ఛానెల్ సీఈఓ దగ్గర చెంపలు వాయించుకుని కోట్లు కుమ్మరింస్తారని నెంబర్ వన్ ఛానెల్ భ్రమించి ఉండవచ్చు. మీ పాపాలు కడుక్కొండి అంటూ నీతి వాక్యాలు వల్లించిన వాళ్లలో చాలా మంది ఫ్యాక్షనిస్టులకంటే అత్యంత ప్రమాదకరమైన కేపటలిస్టులే. నిజానికి ప్రస్తుతం అత్యంత గౌరవప్రదమైన జర్నలిజం క్యాపటలిజం చేతిలో నలిగిపోతున్నది. క్యాపటలిస్టులు జర్నలిస్టుల ముసుగులో అందిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారన్నది `జగ'మెరిగిన సత్యం.
మరో ముఖ్యమైన విషయం ఏమంటే, నెంబర్ వన్ ఛానెల్ నుంచి నిన్న మొన్న పుట్టిన `పుల్ల' ఛానెల్ దాకా చాలా మటుకు గోరింత సాయం చేస్తూ కొడంత ప్రచారం చేసేసుకుంటున్నాయి. అసలు ప్రభుత్వం కంటే తామే ఎక్కువ సాయం చేసేమన్న భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక టివీ రిపోర్టర్ ఓ మహిళామంత్రిని ఇదే విషయంపై ప్రశ్నిస్తూ, `మీ కంటే మేమే ఎక్కువ సాయం చేస్తున్నాం...మేము సాయం చేస్తున్న చోట్ల అధికారులు కనబడటంలేదు. ఇది అధికారుల వైఫల్యం కాదా?' అంటూ తన తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళా మంత్రి చాలా కూల్ గా సమాధానమిస్తూ, `మీ టీవీల వాళ్లు మమ్మల్ని అడిగే వెళుతున్నారు. మా అధికారుల సాయం తీసుకునే మీ వాళ్లు పనులు చక్కబెట్టుకుంటున్నారు. అధికార వైఫల్యం అన్నదే లేదు. ఎవరన్నా సాయం చేయడానికి వస్తే, వాళ్లు బాగా చేస్తుంటే అధికారులు మరో చోటకు వెళుతుంటారు. ఇదే జరుగుతోంది...' దీంతో అవాక్కవడం రిపోర్ట్ వంతైంది.
వరద సాయంగా చెక్కులు, నగదు పంపించాలంటే నేరుగా టివీ ఆఫీస్ కు పంపించవచ్చంటూ ఒకటి రెండు ఛానెళ్లు ఊదరగొట్టాయి. తమ పేరిటే చెక్కులు, డ్రాఫ్ట్ లు పంపమన్నారు. అయితే ఇదే సమయంలో మరో ఛానెల్ మాత్రం తమ పేరిట కాకుండా నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట క్రాస్డ్ చెక్ తమ కార్యాలయానికి పంపిస్తే వాటిని సీఎంకు అందజేస్తామంటూ తనలోని నిజాయితీని చాటుకోవడం గమనార్హం.