Monday, October 19, 2009

కుట్ర గుట్టు ముందుగా విప్పిన నారదలోకం

వైఎస్సార్ ఎక్కిన హెలికాప్టర్ కూలడంలో కుట్ర జరిగినట్టు సాక్షి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనానికి నారదలోకం స్పందిస్తూ -సాక్షిరాసింది కుట్రతోనే? అంటూ విశ్లేషణాత్మక కథనాన్ని సోమవారం ఉదయంమే అందించాం. ఎలక్ట్రానిక్ మీడియా (ముఖ్యంగా టీవీ ఛానెళ్లు) పెరిగిన ఈ రోజుల్లో కూడా వెంటనే సాక్షిలో ఉద్దేశపూర్వకంగా వచ్చిన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తలు రాలేదు. అన్నింటికంటే ముందుగా నారదలోకం బ్లాగ్ స్పందించింది. ఆ తరువాత రాత్రి ఏడున్నరగంటలకు కుట్ర సిద్ధాంతమంటూ టివీ-- 9లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఎఐసిసీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కూడా హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న వార్తా కథనాన్ని ఖండించారు. ఇలాంటి ఉహాజనత వార్తలను ఇవ్వకూడదంటూ హితవుపలికారు.
నిన్నకాక మొన్న (విజయదశమినాడు) జన్మించిన నారదలోకం న్యూస్ బ్లాగ్ నదురుబెదురులేకుండా మొత్తం మీడియాలో కెల్లా ముందుగా సాక్షి రాసింది కుట్రతోనే అంటూ కథనం ఇవ్వడాన్ని పాఠకులు ఈ పాటికి గమనించే ఉంటారు. నారదలోకం సాహసోపేతమైన కథనాలకు వెనుక ఉన్న బలం పాఠకులే. ఇక ముందు కూడా వాస్తవకోణాలను ఆవిష్కరించడంలో ముందే ఉంటామని హామీ ఇస్తూ...
- ఎడిటర్

రోశయ్య పక్షాన కేవీపీ?

వైఎస్సార్ ఆప్తమిత్రుడు కేవీపీకి కాలం కలిసిరావడంలేదు. గడచిన నాలుగైదేళ్లుగా తన మాటనెగ్గించుకున్న కేవీపీ ఇప్పుడు తన స్నేహితుని కొడుకు జగన్ కి సీఎం పోస్టు ఇప్పించలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో గోడువెళ్లగక్కుకున్నా ఫలితం దక్కలేదు. మరో పక్క జగన్ అనుయాయులు చేస్తున్న నానా ఆగీతో కేవీపి విసిగిపోయారు. చెప్పినా వినని అధిష్టానం, రెచ్చిపోతున్న జగన్ సేన కేవీపీకి మనస్తాపం కలిగిస్తున్నాయి. దీంతో ఏదో ఒక రోజు రోశయ్య పక్షానికే తన ఓటు వేసే పరిస్థితి రావచ్చన్న వాదన బలపడుతోంది.
అధిష్టానం మనోగతాన్ని గ్రహించిన కేవిపి ఆ విషయాన్ని జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్టానం మనకు అను కూలంగా లేనందున, అధినేత్రి మనసు మారి అనుకూల నిర్ణ యం తీసుకునే వరకూ మౌనంగా ఉండాలని, ఆ లోగా ఎమ్మె ల్యేలు, మంత్రులతో ఎలాంటి ప్రకటనలు చేయించకుండా ఉంటే బాగుంటుందని జగన్‌కు ఇటీవలే సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, జగన్‌ వర్గీయులు మాత్రం ఆయనను సిఎం చేయాలన్న పట్టుదలతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అధిష్టానంపై వ్యతిరేకంగా అసహనం పెరుగు తోంది. సంపూర్ణ మెజారిటీ ఉన్నందున బయటకెళ్లిపోదామని జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీనితో కెవిపి పరిస్థితి ఇరకాటంలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమా చారం ప్రకారం.. త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నిర్ణ యానికి రానున్నట్లు తెలుస్తోంది. కెవిపి మాత్రం వారిని ఇంకా సముదాయిస్తూనే ఉన్నారు. కానీ, వారంతా ఎవరిమాట వినే పరిస్థితి లేదు. ఇంకోవైపు.. డిసిసిలు, జిల్లా స్థాయి నాయకులు జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని హామీలిస్తున్నారు. జగన్‌ శిబిరం మాత్రం న్యాయం జరగకపోతే బయటకొచ్చేయాలంటూ ఆవేశంతో ఊగిపోతోంది.
ఈ నేపథ్యంలో.. కెవిపి పాత్రేమిటన్న అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జగన్‌పై అనుచరుల ఒత్తిడి పెరిగి ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పు డు కెవిపి ఎటు వైపు ఉంటారన్న ఆసక్తికరమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తన తర్వాత జగన్‌ను సిఎంగా చూడా లన్నది వైఎస్‌ కల. అలాంటి ప్రాణమిత్రుడి కుమారుడైన జగన్‌ను సిఎంగా చేసేందుకు కెవిపి తన ప్రయత్నాలు చేసి చివరి వరకూ శ్రమించారు. అది ‘ఇప్పట్లో’ అసాధ్యమని తేలిపోయింది. ఈ క్రమంలో జగన్‌ శిబిరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు కెవిపి పాత్రేమిటన్నదే పార్టీ నేతల సందే హం. జగన్‌తోనే ఉంటూ వైఎస్‌ మాదిరిగానే ఆయన ఉన్నతికి కృషి చేస్తారా? అదే జరిగితే ఇప్పుడు కొనసాగుతున్న ప్రజా రక్షణ, భద్రత కమిటీ ఛైర్మన్‌ పదవికి నైతిక విలువల ప్రకారం రాజీనామా చేస్తారా? లేక.. తనను ఈ స్ధాయికి చేర్చిన కాంగ్రె స్‌ నిర్ణయించిన రోశయ్య పక్షం బాహాటంగా నిలుస్తారా? వంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రోశ య్యతో కెవిపి రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లేముందు కెవిపి సిఎంను కలిశారు. అధిష్టానం అందించిన సంకేతాలను, మనోగతాన్ని తాను జగన్‌కు స్పష్టం చేశానని, అయినప్పటికీ వారంతా ఎవరి మాట వినే పరిస్థితిలో లేరని వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని, మీకు వ్యతిరేకంగా తానెలాంటి చర్యలను ప్రోత్సహించడం లేదని, మంత్రులకు సైతం మీకు సహకరించమని సూచించానని కెవిపి ఆయనకు వివరిం చినట్లు తెలిసింది. దానికి తగ్గట్టే ఇటీవలి కొద్దిరోజుల నుంచి కెవిపి సిఎంతో సన్నిహితంగా ఉండేందుకు యత్నిస్తున్నారు. పేషీలో రోజూ ఆయనను కలుస్తున్నారు. విఐపిలను తీసుకువెళ్లి వరద బాధితులకు విరాళాలిప్పిస్తున్నారు.

ఫోకస్ : సాక్షి `రాసింది' కుట్రతోనే?


ప్రియతమనేత వైఎస్సార్ దుర్మరణానికి దారితీసిన హెలికాప్టర్ దుర్ఘనటపై సాక్షి (అక్టోబర్ 19) దినపత్రికలో `కూలింది కుట్రతోనే?' అంటూ పతాకశీర్షికన విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఆరోజు, సెప్టెంబర్ రెండవ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవడంకోసం జనహృదినేత వైఎస్సార్ హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లాకు బయలుదేరిన కొద్దిసేపటికే నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. ఇది జరిగిన 50 రోజులకు సాక్షి పత్రికలో కుట్రతోనే హెలికాప్టర్ కూలిందన్న అర్థం వచ్చేలా ఒక కొశ్చన్ మార్క్ తగిలించి ప్రత్యేక కథనం ప్రచురించారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివిన తరువాత అసలు కుట్ర ఏమిటో అర్థంకాక బుర్రగోక్కోవాల్సిందే. ఎవరైనా దుండగలు విద్రోహక చర్యకు పాల్పడి ఉంటారనే విషయాన్ని కొట్టిపారేయలేమని దర్యాప్తు అధికారులు అంగీకరించడం గమనార్హం అంటూ ముక్తాయింపు పలికారు. ఈ విషయం చెప్పడానికి ఇంత `సీను' (ఇంత కవరేజ్)అక్కర్లేదు.
  • మొత్తం కథనం చదివిన తరువాత పరిశోధనాత్మకంగా కొత్త విషయాలు ఏం చెప్పారో ఒక పట్టాన అర్థంకావు. కుట్ర ఉన్నదని తేల్చేటప్పుడు బలమైన పాయింట్లు ఉండాలి. నిజంగా అలాంటివి ఏవో ఉండిఉంటే వాటిని లోపల దాచేసుకుని (చెప్పాలనుకున్న అసలు సంగతులు చెప్పకుండా) సాదాసీదా అంశాలు, గ్రాఫ్ లు, చిత్రాలతో పేజీ నింపేశారు.
  • ఇదంతా చదివిన వారికి హెలికాప్టర్ కూలడంలో కుట్ర ఉన్నదన్న భావంకంటే, అసలు ఈ కథనాన్ని రాయడంలోనే రాజకీయ మతలబు ఉన్నదన్నట్టు అర్థమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఏ లక్ష్యంతో ఈ అస్త్రాన్ని సంధించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
  • కుట్రఏమిటో చెప్పకుండా, ఆ కుట్ర ఎవరు పన్నారో తెలుపకుండా నాన్చుడి ధోరణిలో రాయడం వల్ల ఆ పత్రిక ఏం సాధించాలనుకుంటున్నది?
  • ఎవరో గిట్టని వాళ్లు మన ప్రియతమనేత ఎక్కిన హెలికాప్టర్ ని కూల్చేశారని చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్నట్టుండి అలజడి పెరిగిపోదా...దానివల్ల ఎవరికి లాభం?
  • ప్రజల్లో తలెత్తే అలజడి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయదా?. ఇది ప్రభుత్వ పనితీరుని స్తంభింపచేయవచ్చు. ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే తప్పకుండా మనస్తాపం కలుగుతుంది.
  • ప్రజలనుంచి ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం పార్టీ అధిష్టానంమీద కూడా పడుతుంది.
  • పార్టీ కళ్లు తెరిస్తే, వాస్తవాలు గ్రహిస్తే, కొత్త సీఎం ఎంపికలో వేగిరపడుతుంది.
  • ఒక మహా కుట్రవల్ల మహానేతను కోల్పోయామన్న భావన నిజానికి తీవ్రభావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
  • `కుట్ర' అన్న పదమే అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని ప్రయోగించడంద్వారా ఎవరు ఏమి ఆశిస్తున్నారన్న సందేహం కలుగుతుంది.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మీడియా కచ్చితమైన సాక్షాధారాలు లేకుండా కేవలం దర్యాప్తు బృందం ఎప్పుడో , ప్రారంభదశలోనే చెప్పిన అంశాల ఆధారంగా కుట్రతోనే కూలినట్టు రాయడం ఏమేరకు సమంజసం. ఇదంతా చూస్తుంటే సాక్షి పత్రికే కుట్రతో రాసిందని జనం అనుకోరా? మరి దీనికి ఆ పత్రిక ఏమని సమాధానమిస్తుంది?
నారాయణ...నారాయణ...

Sunday, October 18, 2009

సెటైర్ : సూక్తుల కేసీఆర్!

విలేఖరి లంబు తెలంగాణభవన్ వైపు ఓసారి చూశాడు. ఎందుకో ఆ భవన్ ని చూడగానే అతగాడికి అరుంధతి సినిమాలోని పాడుపడ్డ కోట గుర్తుకువచ్చింది. భవన్ వైపు అడుగులు వేయాలంటే భయపడుతున్నాడు. ఎప్పుడు దగ్గరకు వెళ్ళినా లోపలి నుంచి కేసీఆర్ మాటలు కర్ణకఠోరంగా వినబడుతుండేవి. ఆ ముచ్చట యాదవగానే లంబు చెవుల్లో కేసీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ లు వినిపించసాగాయి....
`ఓరేయ్...రారా...ఇన్నాళ్లుగా తెలంగాణ ఇవ్వకుండా కుళ్లబెట్టి, బొందపెట్టి మీరు కులుకుతార్రా...రండిరా...ఓసేయ్ బొమ్మాళీ...(ఈవెడవరో! సోనియానా?) తెలంగాణ ఇవ్వకుంటే నిన్నునేను వదలా...వదలను బొమ్మాళీ వదల. ఓరేయ్ రా... అడుగుముందుకేయ్. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీ బొందకు దగ్గరవుతుందిరా...నిన్ను వదలా...నీకు బొందపెడ్తా...పాడికడ్తా...రారా..రా...'
అందుకే లంబుకు తెలంగాణభవన్ కు వెళ్లాలంటే భయం. కానీ ఏంచేస్తాడు పాపం. ఎడిటర్ హుకం చేశాడయె...`వెళ్ళు, తెలంగాణభవన్ కు వెళ్ళు. కేసీఆర్ ప్రెస్ మీట్ పట్టాడు. ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడట...వెళ్ళి కవర్ చేయ్..'
ఇక, గతిలేక లంబు తెలంగాణభవన్ వైపు భయంభయంగా అడుగులువేసుకుంటూ వెళ్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చేసరికి దుర్గంధం స్థానే సుగంధం ముక్కుపుటాలకు సోకింది. మళ్ళీ అరుంధతి సినిమా గుర్తుకువచ్చింది. భయంగా చూశాడు. `ఇది భ్రాంతికాదుకదా...' అనుకుని ఒళ్లు గిల్లుకున్నాడు. కాదు, నిజమే...పరిమళ అగర్ బత్తి వాసనలు వస్తున్నాయి. అంతలో కేసీఆర్ ఒక సాధుపుంగవునిలా, శాంతమూర్తిలా ఎదురుపడ్డారు.
`రావోయ్ లంబు రా... ఎంటీ సంగతులు?'
`అదేంటి సార్....అది నేను అడగాల్సిన ప్రశ్న'
`అంతా బాగున్నారా?'
`సార్! మళ్ళీ నేను అడగాల్సిన ప్రశ్న వేస్తున్నారు. సార్, మీ పార్టీలో అంతా బాగున్నారా?'
`లోకాంసమస్తాం సుఖినోభవంతు'
`అదేంటీసార్! మీనోట సంస్కృతం...'
`దీని అర్థం తెలుసా?'
`అంటే, కొద్దిగా తెలుసు సార్..పూర్తిగా...'
`నేను చెప్తా రాస్కో...ఈ లోకాలన్నీ చల్లగా ఉండాలి. ఎవ్వరూ కొట్టుకోకూడదు. గిల్లుకోకూడదు'
`అంతా కలిసిఉంటేనేకదా సార్...చల్లగా ఉండేది. కలిసిఉంటే కలదు సుఖం అని కూడా మనవాళ్లు అన్నారుగా. అలాంటప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎందుకు సార్?' అమాయకంగా అడిగాడు లంబు.
`అది ఉద్యమం. ఆగదు. ఇది సూక్తి ... సాగుతూనే ఉంటుంది.'
ఈసారి లంబుకి నిజంగానే అర్థంకాలేదు. బుర్రగోక్కున్నాడు.
`యత్రనారీ పూజ్యంతు తత్ర...'
`మళ్లీ, ఇదేంటీసార్...!?'
`అంటే, ఎక్కడ మహిళలు పూజింపబడుదురో...'
`ఆంధ్ర ఉద్యోగులను మరెందుకు వెళ్లగొడుతున్నారు సార్. అందులో మహిళలు కూడా ఉన్నారుగా...'
`అది ఉద్యమం. నీకో విషయం తెలుసా... నిప్పులు చిమ్మతు నింగికి నేనెగిరితే నిభిడాశ్చర్యంతో వీరే...నెత్తురు కక్కుతూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే... ఇక్కడ వీరే అంటే...'
మళ్ళీ ఇదేంటీసార్...!
`అలజడి మన జీవితం కావాలి, ఆందోళన మన ఊపిరి కావాలి. తిరుగుబాటు మన వేదాంతం కావాలి...'
`సార్...మీకేమైందిసార్?'
కేసీఆర్ పాతసినిమాలోని పాట అందుకున్నాడు...
`నమ్మరే, నేను మారానంటే నమ్మరే...నేనొకనాడు...'
`నమ్ముతాం సార్...నమ్ముతాం. ఆపండిసార్ మీ పాట..'
`అయితే, ఈ కవిత విను...చిరకాలం జరిగిన మోసం...బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు...ఇంకానా ఇకపై సాగవు.'
కేసీఆర్ సూక్తులకూ, కవితలకు లంబు భయపడి ఒక్క గెంతుగెంతాడు. మెట్లు ఎక్కాడో, జారాడో తెలియదు. తలుపులు తోసుకుని వచ్చాడో, లేక విరగ్గొట్టుకు వచ్చాడో అంతకన్నా తెలియదు. క్షణాల్లో బయటకువచ్చేశాడు. ఆ పాత బూతులకంటే, ఈ కొత్త కవిత్వాలు వినడం మరీ కష్టమనిపించింది. అంతే, ఉరుకో..ఉరుకు. వెనక నుంచి...తెలంగాణ భవన్ నుంచి ఇంకా సూక్తులు, శ్లోకాలు వినబడుతూనే ఉన్నాయి...
కణ్వస

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-2)

ముఖ్యమంత్రిగా ఉండేవారిలో ప్రధానంగా ఉండాల్సన లక్షణం `సహనం'. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటి రోశయ్య సీఎంగా ఉన్నప్పటికీ ఉన్న తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. అంతేకాదు, వైఎస్సార్ జనహృదయనేతగా ఎందుకు మారారో, రోశయ్య సార్ ఎందుకు మారలేకపోతున్నారో కూడా పోల్చి చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రోశయ్య బీపీ పెంచేసుకుని అన్నమాటలను ఉటంకిస్తూ, అదే వైఎస్సార్ అయితే ఎలా మాట్లాడిఉండేవారో తెల్సుకుంటే ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న అంతరం మీకు ఇట్టే తెలుస్తుంది.
రోశయ్య: (ఓలేరుపల్లెపాలెంలో గండిపడటాన్ని అక్కడి గ్రామస్థులు చెప్పినప్పుడు) గండి ఎందుకు పడింది? కారకులు ఎవరు? తదితర విచారణ నిమిత్తం నేను రాలేదు. బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడానికి వచ్చాను. ( రోశయ్య మాస్టారు అందుకే వచ్చిఉండవచ్చు. ఇందులో నిజంలేకపోలేదు. గ్రామస్థులకు అడ్డుతగులుతూ రోశయ్య కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో వారంతా కంగుతిన్నారు.)
వైఎస్సార్: (ఇదే పరిస్థితుల్లో వైఎస్సార్ ఉండిఉంటే ఆయన చెప్పే పద్ధతి) అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్లారా, చెల్లెళ్ళారా.... ఓ ఒక్కరికీ కష్టం కలుగుకుండా చూస్తాను. ఓలేరుపల్లెపాలెం వద్ద గండి పడినట్టు చెబుతున్నారూ, దీని గురించి హైదరాబాద్ కు వెళ్లగానే వెంటనే చర్యలు తీసుకుంటానూ, అప్పటిదాకా ఓపికపట్టండీ..ఎవ్వరికీ కష్టం కలగకుండా చేస్తాను.
రోశయ్య: (వరద బాధితులతో) నేను చెప్పేది వినడం ఇష్టంలేకుంటే చెప్పండి. ఒకరిద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిగతా వాళ్లు మౌనంగా ఊరుకుంటారా?
వైఎస్సార్: (ఇదే పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తే) మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఆ మాట్లాడుతున్న వారు ఇలా వచ్చి బిగ్గరగా చెప్పండి. మీరు చెప్పేది ఆచరణయోగ్యమైతే వెంటనే పరిష్కరిస్తాం. తమ్ముళ్లూ రండీ...రా అక్కా నువ్వు రా...చెప్పు నీ కష్టాలేమిటో...
రోశయ్య: (పరిహారం భూమి యజమానులే తీసుకుంటున్నారనీ, కౌలు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు) కౌలు రైతులూ, భూయజమానుల మధ్య సరైన అవగాహన ఉండాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. దాన్ని ఎవరైతే తీసుకోవాలో వారే తీసుకోవాలి. అంతకు మించి ప్రభుత్వం ఏం చేయగలదు? (దీంతో జనం అవాక్కయ్యారు)
వైఎస్సార్: (ఇలాంటి సందర్బంలో ఎదురైతే) మీ సమస్య అర్థమైందీ, కౌలుదారీ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కౌలుదారులకు కూడా వర్తించేలా చట్టాలను సవరిస్తాం. అవసరమైతే ఇందుకోసం ఢిల్లీ వెళ్తాం. (జనం చప్పట్లు)
రోశయ్య: (మెరక ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మహిళ గట్టిగా అడిగితే) అలా గట్టిగా అరవమాకు. ఏదైనా ఉంటే కాగితంమీద రాసివ్వండి. అధికారులు చూస్తారు.(అదికారులు ఎలా చూస్తారో తెలిసిన జనం ఇక సీఎంకు చెప్పి ప్రయోజనం లేదని ఢీలాపడిపోయారు)
వైఎస్సార్: (ఇదే పరిస్థితి ఎదురైతే) అమ్మా, నీ ఆవేదన అర్థమైందీ. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. అందరికీ పక్కా ఇళ్లు కట్టించాలన్నదే మా ప్రభుత్వ నిర్ణయం. దాన్ని వెంటనే అమలుచేస్తాం. (జనం తప్పట్లు)
రోశయ్య: (గండి పూడ్చలని గ్రామస్థులు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ ఒక వ్యక్తి ఆరోపించినప్పుడు) ఏమయ్యా! ఎవరైనా పోలీసులు ఎక్కువ నష్టం కలిగించారని చూస్తారా? ఎందుకు అలా అభాండాలు వేస్తారు? (రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై రోశయ్యగారికి ఉన్న నమ్మకం జనాన్నినోరువెళ్లబెట్టేలా చేసింది)
వైఎస్సార్: బాధ్యతా రాహిత్యంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోనేదేలేదు. ప్రజాసంక్షేమానికి అడ్డుతగిలే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తాం.ఇకపై అలా జరగకుండా చూస్తాం. (సంతృప్తి చెందిన జనం)
రోశయ్య మాస్టారిలో రాజకీయ అనుభవం నిండుగా ఉంది. కానీ లౌక్యమేలేదు. రోశయ్య దీన్ని అలవరుచుకుంటే ఈ నాలుగున్నరేళ్లూ లాగగలుగుతారు. లేకుంటే ఎప్పుడో ఒకప్పుడు అధిష్ఠానం చేతిలో మొట్టికాయ తింటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈయనలోని మైనస్ గుణమే, జగన్ కు రేపు ప్లస్ గా మారవచ్చు.
-కణ్వస

Saturday, October 17, 2009

సెటైర్: గ`మ్మత్తు' కేసీఆర్

కేసీఆర్ ప్రవర్తన చాలా చిత్రవిచిత్రంగా ఉంటున్నది. క్షణంలో మాటమార్చేస్తున్నారు. అవునన్నది కాదంటున్నారు. కాదన్నది అవునంటూ అడ్డంగా వాదించేస్తున్నారు. ముఖం చూస్తుంటే కాసేపు `ఫుల్' కొట్టేసినట్టుగా ఉంటే, మరికాసేపు `చుక్క' ముట్టనట్టుగా ఉంది. అసలు ఆయనలో ఇద్దరు కేసీఆర్లు కనిపిస్తున్నారు. `ద్విముఖ జీవి'ని చూసినట్టనిపిస్తోంది. ఈ వింత ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకునేముందు ఆయనగారి `డబుల్ ధమాకా' ఏంటో చూద్దాం.
సమైక్యవాదం:
`ముందు ఆంధ్రప్రదేశ్...నేను అంటున్నది ముందు...`మందు' కాదు... మీడియా, సరిగా రాసుకోండి...ముందు ఆంధ్రప్రదేశ్. ఆ తరువాతనే తెలంగాణ. (ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకున్నతరువాత మొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ అన్న ఈ మాటల్లో సమైక్య వాద లక్షణాలు కనిపించాయి)

`నేను అలా అన్నానా...మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. ముందు ఆంధ్రప్రదేశ్ లేదూ, `మందూ' అంతకన్నాలేదు. తెలంగాణ నా ప్రాణం. అదే నా ఊపిరి. తెలంగాణ కోసం సాయుధపోరాటం చేస్తాం. ఈ ఆంధ్రావోళ్లను రానివ్వం. వెళ్లగొడతాం...బడితపూజ చేస్తాం...బొందలుపెడతాం.'(హైదరాబాద్ వచ్చాక అన్న మాటలివి)
సోనియా ఓ దేవత:
`సోనియాగాంధీ ఓ దేవత. ఆమె చాలా మంచివారు. పరిస్థితిని సరిగా అర్థం చేసుకోగలరు. (ఢిల్లీలో అన్న మాటలు)
`సోనియానా, గీనియానా మాకెందుకూ, మా పని మాకు గావాల్న. ఈళ్ల గురించీ, ఆళ్ల గురించి మాట్లాడే టైం లేదు. ఉద్యమం చేయాల్న' (హైదరాబాద్ వచ్చాక)
రోశయ్యలో మాహాత్మా:
`రోశయ్య, ఆ పెద్దాయనలో నాకు ఓమహాత్మ, ఓ పొట్టి శ్రీరాములు కనిపిస్తున్నారు.' (ఢిల్లీలో చెప్పింది)
`రోశయ్యను నేను పొగడ్లా, మాకేం అవసరం. అసలు ఈ కాంగ్రెసోళ్లను మేము పొగడం. మా పన్లు మాకున్నాయి. ప్రీజోన్ విషయంలో పోరాటం ఎలా చేయాలాని మేం ఆలోచిస్తున్నాం. తీరకలేదు. ఏమంటావ్ ఈటెల రాజేందర్' (హైదరాబాద్ ప్రెస్ మీట్ లో)
వైఎస్సార్ - వరదలు;
`వైఎస్సార్, జగన్ వల్లనే వరదలొచ్చాయ్. హైదరాబాద్ రాగానే అసలు సంగతి చెప్తా' (ఢిల్లీలో)
`వైఎస్సార్ నేనూ చాలాకాలం కలిసే ఆలోచించాం. వాళ్లబ్బాయ్, మా అబ్బాయ్ రామారావుతోటి వాడే. ఏమంటావ్ ఈటెల...జగన్ వయసు ముప్పయిమూడా, ముప్పయినాలుగా...?' (కొడుకు వయసు గుర్తురాక ఈటెలను అడిగి కన్ ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది) జగనూ, మావాడూ ఒక ఈడువాళ్లు. జగను మా అబ్బాయిలోంటి వాడు.'
అది నోరా..? అవేం మాటలు..?? కాసేపు హైవేమీద, అంతలో కాసేపు గతుకుల రోడ్డుమీద పోతున్నట్టున్నాయేంటీ కేసీఆర్ మాటలు..!!.అని మీకూ అనిపించిందా..అయితే అలా ఎందుకు కేసీఆర్ మాట్లాడారో అసలు కారణం చెబుతా...చదవండి..
అసలు కారణం:
ఢిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి డాక్టర్ ని కలిసినప్పుడు ఆయనగారు కేసీఆర్ చేత మందు మాన్పించే ప్రయత్నం చేశారు. మీకు `మందు' కావాలా, ఉద్యమం కావాలా? సిన్సియర్ గా చెప్పండి...అని డాక్టర్ అడిగారు.
ఆ బాలహీన క్షణంలో కేసీఆర్ తడుముకోకుండా...`నాకు ఉద్యమమే కావాలి. తెలంగాణ నా ప్రాణం...నా ఊపిరి....' అంటూ ఆవేశపడ్డారు. పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వెయ్యాలన్నట్టుగా డాక్టర్ వెంటనే కేసీఆర్ నుంచి ప్రామిస్ తీసేసుకున్నారు. మాటమీద నిలబడే తత్వం ఉన్నవాడు కాబట్టి కేసీఆర్ ఆ క్షణం నుంచీ మందు మానేశారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ కేసీఆర్ లో మార్పులొచ్చేశాయి. ద్విముఖజీవిలా మారిపోయారు. ఏ ముఖం ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థంకాక మీడియా చేతులెత్తేసింది. ఈ వింత ధోరణికి కారణం ఏమిటా అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. `మందు' కొట్టేవాడు ఒక్కసారిగా మానేస్తే, అంటే ఫుల్ నుంచి నిల్ అయితే, కొన్నాళ్లు ఫల్ కొట్టినట్టే హాంగోవర్ తప్పదట. కాసేపు ఫుల్ పవర్. అంతలో నిల్ `నీరసం' పట్టేస్తుంటాయి. ఈ గ`మ్మత్తు' చేష్టలే ఇప్పుడు మనం కేసీఆర్ లో చూస్తున్నాం. ఇదీ సంగతి...నారాయణ....నారాయణ...
- కణ్వస

సెటైర్: ఒబామా నోబెల్ వెనుక బుష్ హస్తం?!

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మేథావులు బుర్రలుగోక్కుంటున్నారు. తనకు నోబెల్ శాంతి ప్రైజ్ వస్తే వీళ్లంతా ఇంతలా బుర్రెందుకు గోక్కుంటున్నారో ఓ పట్టాన ఒబామాకు అర్థంకాలేదు. ఆమాటకొస్తే, తన పేరు నోబెల్ జ్యూరీ ఎందుకు సెలెక్ట్ చేసిందో కూడా నల్లజాతి శ్వేతసౌధాదీశునికి అర్థంకావడంలేదు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. ప్రపంచ పటంలో తనకు గర్తున్న దేశాల అద్యక్షులకూ, ప్రధానులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, అర్జెంటీనా, చైనా...ఇలా ఆయా దేశాల అధినేతలను అడిగాడు. ఏమిటో వాళ్లు చెప్పిందేదీ మన బ్లాక్ చాంపియన్ కి సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏ దేశాలున్నాయా...అని ఆలోచిస్తుంటే, వెంటనే మొన్నీమధ్యనే జి-20 దేశాల సమావేశాల్లో కలుసుకున్న భారత ప్రధాని మన్మోహన్ చటుక్కన గుర్తుకువచ్చారు. అంతే ఢిల్లీకి ఫోన్ కలిపాడు.
ఒబామా: గుడ్ మార్నింగ్ మన్మోహన్ సింగ్ జీ.. నాకో సందేహం.
మన్మోహన్: ఆఁ..ఆఁ...గుడ్ ఈవినింగ్... త్వరగా చెప్పండి, అవతల మేడం సోనియా పిలుస్తున్నారు?
ఒబామా: అదే, అర్థమైచావడంలేదు.
మన్మోహన్: ఏమిటీ, చావడం అర్థంకావడంలేదా...?
ఒబామా: చావడం కాదు, రావడం... అదే, నోబెల్ ప్రైజ్ నాకెందుకు ఇచ్చారో అర్థం కావడంలేదు.
మన్మోహన్: అదా! నీ బండపడ... ఇందులో అర్థంకాకపోవడానికి ఏముందీ...జార్జి బుష్ వల్లనే కదా నీకీ అవార్డు వచ్చింది.
ఒబామా: అదేంటీ, జార్జి బుష్ నాకు శత్రువు, ఆయన వల్ల నాకు నోబెల్ ప్రైజ్ రావడమేమిటీ? అర్థంకాలా, కాస్తంత వివరంగా చెప్పండి. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా...
మన్మోహన్: అసలు కథ చెప్పాలంటే, మనం ఆరువేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.
ఒబామా: యూమీన్..సిక్స్ థౌజండ్ ఇయర్స్...!
మన్మోహన్: అవును, సిక్స్ థౌజండ్ ఇయర్సే. అప్పట్లో మా ఏరియాలో ద్వాపరయుగం నడిచేది. ఆకాలంలో నరకాసురుడు అనే ఓ విలన్ ఉండేవాడు. వాడు భూమ్మీద శాంతిలేకుండా చేశాడు. యుద్ధాలేయుద్ధాలు. చావులేచావులు. భూమికి పెనుముప్పుగా మారాడు.
ఒబామా: ఓహ్ఁ...ఈజిట్?
మన్మోహన్: ఎస్, ఇటీజ్ ...ఇక అప్పుడు శ్రీకృష్ణుడు తన వైఫ్ సత్యభామతో కలిసి వార్ కి వెళ్ళాడు. నరకాసురుణ్ణి వధించి ప్రపంచానికే పీస్ తీసుకొచ్చాడు. జనం ఆనందంగా దీపావళి చేసుకున్నారు.
ఒబామా: ఓహ్ఁ... గ్రేట్. కానీ, నాదో డౌట్. ఈ కథకీ, నా నోబెల్ కీ ఏమిటట సంబంధం?
మన్మోహన్: వస్తున్నా, అక్కడికే వస్తున్నా... ఒక వ్యక్తి హీరో కావాలన్నా, లోకరక్షకునిగా మారాలన్నా, అతనే గొప్పవాడవ్వాల్సిన పనిలేదు. అతని శత్రువు లోకకంఠకుడు అయితే చాలు. అలాంటి ఎనిమీని ఓడిస్తే, అఖండ కీర్తి అందుకోవడం ఖాయం. ఇదే ఈ కథలోని నీతి.
ఒబామా: అర్థంకాలా...
మన్మోహన్: (మనసులో) వీడికెవడ్రా ఇచ్చింది నోబెల్ ప్రైజ్. (పైకి) మీ ఏరియాలో బుష్ లేడూ, వాడూ, నేనిప్పుడు చెప్పిన కథలోని నరకాసురుడు ఒకటే టైప్. ఇప్పుడు అర్థమైందా...
ఒబామా: అంటే, బుష్ వల్లనే నాకు నోబెల్ వచ్చిందా?
మన్మోహన్: ఎస్. ఇదే కరెక్ట్. బుష్ యుద్ధాలు చేసి, సిటీలనుకూల్చి, ఆర్థికమాంద్యం తెచ్చేసి, టెర్రర్ పెంచి ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేశాడు.
ఒబామా: ఎస్..ఇదీ కరెక్టే... నా ఎన్నికల ప్రచారంలో ఇదే ఘాటుగా చెప్పాను.
మన్మోహన్: అదీ సంగతి, అలా నువ్వు ఘాటుగా బుష్ ను తిట్టబట్టీ, ఓడించబట్టీ, నోబెల్ జ్యూరీ వాళ్లకు నచ్చేసి నీకు నోబెల్ శాంతి ప్రేజ్ ఇచ్చారు.
ఒబామా: మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అయితే మన్మోహన్ జీ... మీరు నాకో మాటివ్వాలి.
మన్మోహన్: ఏంటది? త్వరగా చెప్పు, మేడం కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు.
ఒబామా: ఈ విషయం అమెరికన్ మీడియాకు చెప్పకండి. ప్లీజ్.

- కణ్వస