Saturday, November 14, 2009

`గాలి' - కోడా ఇద్దరూ ఇద్దరే

ఓబుళాపురం గనుల్లో అక్రమాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలిజనార్దనరెడ్డికీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం...
సవాల్: తమపై మోపబడిన ఆరోపణలు నిజమని కోర్టులో నిర్ధారణ అయితే (కావని అన్నదే వారి దీమాలా కనబడుతోంది) రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్కమిస్తానంటూ ఇటు గాలి, అటు కోడా ఇద్దరూ సవాళ్లు విసిరారు.
ట్రంప్ కార్డ్ : ఇద్దరి చేతులో ట్రంప్ కార్డులున్నాయి. గాలి తన పేరులో రెడ్డి అన్న కులం పేరు ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు దాడిచేస్తున్నారనీ, ఒక వేళ తనపేరులో `రెడ్డి' అన్న పదం లేకుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని గాలి `కులం' కార్డు తీస్తే, మరో పక్క మధుకోడా `ట్రైబల్' కార్డు తీశారు. తాను గిరిజనుడైనందునే తనపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదిగినతీరు: వీరిద్దరూ ఇంచుమించూ ఒకేలా ఎదిగారు. ఎనిమిదేళ్ల కితం గాలిపేరుగానీ, అటు మధుకోడా పేరుగానీ ఎవ్వరికీ తెలియదు. మధుకోడా రోజువారీ కూలీ కుటుంబం నుంచి వేలాది కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. గాలి ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అండదండలతో విశ్వరూపం చూపించారు. ఇద్దరూ ఇనుప ఖనిజం గనులను నమ్ముకునే (అమ్ముకునే) కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత రాజకీయలవైపు దృష్టిపెట్టారు. అటుపై ఏకంగా సీఎం సీట్లో కూర్చోవడం, లేదా కూలదోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
మధుకోడా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగా, గాలి కర్నాటక సీఎం సీటుని అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన `సోదరుడు' (ఈమాట గాలి జనార్దనరెడ్డి తాజ్ బంజారా హోటల్ లో మీట్ ద ప్రెస్ లో చెప్పారు) ఎప్పటికైనా అవుతాడని బల్లగుద్ది మరీ గాలి చెప్పేశారు.

Sunday, November 8, 2009

సెటైర్: ఈ గాలీ,ఆ జగనూ, అంతలో అద్వానీ

`పవర్' పాలిటిక్స్ కి వరుసావావి ఉండదు. నీరు ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తున్నట్టూ, గాలి ఎటువీస్తే అటే `పవర్' కదులుతున్నట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పయనం. ఈ పాలసీని ఆసరాగాతీసుకునే కర్నాటకలో గాలిసోదరులు ఓ ఆటఆడిస్తున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప, గాలి సోదరుల మధ్య రేగిన చిచ్చు చల్లార్చాలని బిజెపీ అధిష్ఠానం నడుం బిగించింది. సరిగా ఈ నేపథ్యంలో అద్వానీ, గాలి జనార్ధనరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...
అద్వానీ: హలో గాలి జనార్ధనేనా?
గాలి: ఎస్, గాలి స్పీకింగ్ హియర్..
అద్వానీ: (స్వగతం) అంతే, మనీపవర్ నెత్తికెక్కితే డైలాగ్స్ ఇలాగే ఉంటాయి,(పైకి) హలో గాలి, నేను అద్వానీని.
గాలి: ఏంటిసార్, తొందరగా చెప్పండి, అవతల శంషాబాద్ నోవాటెల్ లో నా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళాలి.
అద్వానీ: ఉండవయ్యా, నీ అసాధ్యం కూలా...తొందరపడకు. అయినా బెంగళూరులో మంచి హోటల్స్ చాలానే ఉంటే, శంషాబాద్ హోటలెందుకట...
గాలి: అదాసార్, చంద్రబాబు గతంలో హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేలను మూసేసి సీఎం సీటు దక్కించుకోలా. ఆ స్పూర్తితోనే హైదరాబాద్ ఎంచుకున్నా.
అద్వానీ: సర్లే, ఆ పాత వెన్నుపోట్ల మాటెత్తకు, నాకు వెన్నులో చలిపుట్టుకొస్తోంది. ఇంతకీ నీ డిమాండ్లేమిటి?
గాలి: పెద్దగా డిమాండ్లేమీలేవుసార్. నాకొన్నది ఒకటే డిమాండ్.
అద్వానీ: హాహ్హహ్హాఁ...ఒకటేనా, చెప్పేయ్, త్వరగా తీర్చేస్తా.
గాలి: జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: జగనా, అతనెవరూ...నీ దగ్గరున్న 50 మంది ఎమ్మెల్యేల్లో ఒకడా..అయినా ఈ పేరు వినలేదే.
గాలి: అతను కర్నాటక ఎమ్మెల్యే కాదుసార్.
అద్వానీ: మరీ!
గాలి: ఆంద్రా ఎంపీ. వైఎస్సార్ కొడుకు జగన్
అద్వానీ: అదేంటయ్యా! కాంగ్రెస్ ఎంపీ అయిన జగన్ ని మనమెలా సీఎంని చేస్తామయ్యా?
గాలి: అవన్నీ నాకు తెలియవుసార్. జగన్ ని సీఎం చేయాల్సిందే.
అద్వానీ: అది కుదరదయ్యా, ఇంకేదైనా అడుగు
గాలి: నాకు ఇంకేమీ వద్దుసార్. మా జగనన్న సీఎం అవ్వాల్సిందే.
అద్వానీ: (స్వగతం) ఓర్నాయనో, ఆంధ్రా జాఢ్యం కర్నాటకకు పట్టుకున్నట్టుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది.
గాలి: ఏంసార్. మాట్లాడటంలేదు. ఒకేనా. చెప్పండి. అవతల టైం లేదు. ప్రభుత్వం కూల్చేయాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: ఓరినా గాలో...అంతపని చేయకయ్యా. సర్లే సీఎంని చేద్దాం.ఇంతకీ ఏ రాష్ట్రానికి సీఎంని చేయాలి. ఆంధ్రాకా, కర్నాటకకా
గాలి:అదీ...అదీ...సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా...జగన్ ని అడిగి చెప్తా.
అద్వానీ: (స్వగతం) ఈ గాలి ఎప్పుడు ఎటువీస్తుందో అర్థంకావడంలేదు. కొంపదీసి గుజరాత్ కి సీఎంని చేయమని అడగడుకదా...
గాలి: సార్, తెలిసిందిసార్. మా జగనన్న ఆంధ్రకే సీఎం కావాలనుకుంటున్నాడు.
అద్వానీ: అమ్మయ్యా, నా టెన్షన్ తగ్గింది. మరైతే మధ్యలో నేనేం చేయాలయ్యా. నీ డిమాండ్ నాకర్థం కావడంలేదు.
గాలి: అవన్నీ నాకు తెలియదుసార్. జగన్ సీఎం అవ్వాలి. లేకుంటే నా 50 మంది ఎమ్మెల్యేలు...
అద్వానీ: ఆపవయ్యా, నీ రికార్డింగ్. ఆగిన రైల్లో చైన్ లాగేసే ఫేసూనువ్వూ...కాస్త ఆలోచించుకోనీ...ఆఁ, సర్లేవయ్యా, నేను సోనియాతో మాట్లాడతా...ఎలాగో ఒప్పిస్తా. జగన్ ని ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళి సోనియాను కలవమను. సెంటిమెంట్ అక్కరకు వస్తుంది.
గాలి: అట్లాగే సార్, త్వరగా తేల్చండి... అవతల నోవాటెల్ వాడు నా గనులు పిండుతున్నాడు. ఇంకొన్నాళ్లయితే, నా ఆస్తిమొత్తం లాక్కుంటాడేమో...
- టి. రాజేష్

కొత్త శీర్షిక: న్యూ కామెంట్ ప్లీజ్

అభిమాన `భ్లాగులోళ్లు' (బ్లాగర్స్) చూపిస్తున్న ఆదరణకు `నారదలోకం' కృతజ్ఞాతాభివందనాలు. ఇప్పుడు మీకోసం కొత్త శీర్షిక `న్యూకామెంట్ ప్లీజ్' ప్రారంభిస్తున్నాం. రాజకీయ, సామాజిక అంశాలపై సరదాగా మేమిచ్చే ప్రశ్నకు మీరు వెనువెంటనే కామెంట్ చేయవచ్చు. మీ కామెంట్స్ సరదాగా ఉండాలిసుమా... పోస్ట్ అయిన కామెంట్స్ లో చురుకైన వాటిని ఎంపికచేస్తాం. మేము రెడీ, మరి మీరు రెడీనా...
ప్రశ్న: జగన్ ఏం సాధించాడు?
మా సమాధానం : `కొండ'ను తవ్వి సురేఖను పట్టాడు
మరో సమాధానం: ఢిల్లీవెళ్ళి ఫ్యామిలీ ఫోటో దిగాడు
ఇలా మీరు కూడా మీ న్యూకామెంట్స్ ని పంపించండి.
మీ కామెంట్స్ ని ఇ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.
kanvasas@gmail.com

Saturday, November 7, 2009

ఫ్యామిలీ చిత్రం: జగన్ సకుటుంబ ఢిల్లీ యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ తన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. శనివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి చేరుకోవడంలో మతలబు ఏమిటనే అంశం రాజకీయ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కె.రోశయ్య ఢిల్లీకి శుక్రవారం సాయంత్రం తొలిసారి వెళ్లారు. తొలిరోజున ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తన పర్యటన రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నారు.
ఇంతలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి, భార్య, సోదరితో ప్రత్యక్షం కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేకుండానే ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏమిటన్నదే అసలు ప్రశ్న.

Thursday, November 5, 2009

సచిన్ కి జేజేలు


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. వన్డే క్రికెట్లో మరెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్, 17వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుతో గురువారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐదవ వన్డేలో 7పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. సచిన్ రికార్డు కోసమే ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.
ది గ్రేట్ సచిన్ కి జేజేలు చెప్పండి....

`గ్రేటర్' కేసీఆర్ ఔట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి టిఆర్ఎస్ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమమే తమ టార్గెట్ అని కేసీఆర్ తెల్చిచెప్పేశారు. `గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాకోలెక్కకాదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పోటీ చేయం. తెలంగాణ ఉద్యమం జోరేమిటో చూపిస్తాం...' అంటూ ఫైనల్ గా డిసైడ్ అయిపోయారు. ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సంస్థల నేతలతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారట.
ఒకవైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈనెలాఖరు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అంటున్నారు.
తెలంగాణా ప్రజలు నా శవయాత్రలో పాల్గొంటారో లేక విజయయాత్రలో పాల్గొంటారో వారే తేల్చుకోవాలన్నారు. తనను ఆదుకున్నా.. వదిలేసినా అది తెలంగాణా ప్రజల చేతుల్లోనే ఉందని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కొసమెరుపు: కేసీఆర్ మాటలు ఇలా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు నామినేషన్లు దాఖలు చేసేశారు.

రోశయ్యకు సోనియా ఏం చెప్పబోతున్నారు?

రోశయ్య హస్తిన యాత్ర ఖరారైంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రోశయ్య ఢిల్లీవెళ్ళి మేడం సోనియాను కలవబోవడం ఇదే మొదటిసారి. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరంచేస్తూ కంట్లో నలుసుగా మారిన నేపథ్యంలో రోశయ్యకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను సోనియాకు వివరించడానికే తాను ఢిల్లీ వెళుతున్నట్టుగా రోశయ్య చెబుతున్నా ఆమె ఏం చెప్పబోతున్నారో, రోశయ్య మాస్టారు ఆ తరువాత ఏం చేయబోతున్నారో ఈపాటికే అందరికీ అర్థమైంది. మేడం సోనియా సీఎం రోశయ్యతో ఇలా చెప్పేవచ్చు....
  • మీరు, కొందరనుకుంటున్నట్టుగా తాత్కాలిక ముఖ్యమంత్రికారు. మీరు హ్యాపీగా రూల్ చేసుకోండి.
  • జగన్ వర్గీయుల నుంచి ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మేం చూసుకుంటాం.
  • వీలైనంత త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసుకోండి. నా నుంచి ఎప్పుడూ మీకు గ్రీన్ సిగ్నలే.
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లొంగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజలకు సేవచేయగలిగినవారు, భాద్యతలను గుర్తెరిగిన యువత కావాలి.
  • ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మేం చెప్పినట్టు మీరు నడుచుకోండి. గ్రేటర్ ఎన్నికల్లో తోకజాడించే నాయకుల పేర్లు పంపించండి.
  • దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ బలోపేతమైంది. ఇలాంటి సమయంలో బలహీనపరిచే శక్తులను చూస్తూఊరుకోం. వాటిని ఎలా లొంగదీసుకోవాలో మాకు తెలుసు.
  • మీపని మీరు చేసుకోండి. మంచి సీఎంగా పేరుతెచ్చుకోండి. గుడ్ లక్....