తెలుగుతల్లి ఆంధ్రావారికే సొంతమనీ, తెలంగాణవారికి వేరే తల్లి ఉన్నదన్న వాదన ఈమధ్య బలపడుతోంది. కడప జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో పిల్లలు తెలుగుమాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్య తీసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ `మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని విద్యార్థులచేత పాడించాలంటూ ఆదేశాలిచ్చింది. మాతృభాష అడుగంటిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నట్టుండి మరో వివాదానికి తెరలేపింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులు `మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడాల్సిన అవసరం లేదని కొందరు తెలంగాణ కవులు, మేథావులు పాయింట్ లేవనెత్తారు. తెలంగాణ పాటలు పాడే దేశ్పతి శ్రీనివాస్ మరో అడుగుముందేకిసి `మీ తెలుగుతల్లి మల్లెపూదండలు వేసుకుంటే వేసుకోమనండీ, మా తెలంగాణ తల్లి మాత్రం బంతిపూదండలు వేసుకుంటుంది...ఆ పాటలో తెలంగాణ వారి పట్ల అన్యాయం ధ్వనిస్తోంది. గలగలా గోదావరి కదిలిపోతుంటేను...అని పాడుతున్నారు. అంటే ఈ గోదావరి మా తెలంగాణ గడ్డమీద నుంచి కదలిపోతుంటే మేము చూస్తుండిపోవాలా...ఇక, బిలబలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, అని పాడుతున్నారు, అంటే, కృష్ణమ్మ కూడా పరుగులెత్తుకుంటూ ఆంధ్రవాళ్లవైపు వెళుతుంటే ఇక మాకేం మిగిలుతుంది...కష్టాలు, కన్నీళ్ళా?...ఇలాంటి పాటలు మాకొద్దు. మా పిల్లలచేత ఇలాంటి పాటలు పాడించం. ఈ తెలుగుతల్లి మాకొద్దూ...మా తెలంగాణతల్లి పాటలే మా పిల్లలు పాడుకుంటారు. ఆ తల్లికే బంతిపూల దండలు వేస్తుంటారు' అంటూ ఎంతో భావోద్వేగంతో అన్నారు.ఆయనలాజిక్ అయినది. అయితే, ఓ చిన్న వాస్తవాన్ని మరిచిపోతున్నట్టున్నారు ఈ మేథావులంతా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ...ఏ ప్రాంతంలోని వారైనా మాట్లాడేది తెలుగే అయినప్పుడు, వారి మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగుతల్లిని అగౌరవపరచడంలో అర్థంలేదు. మరో విషయమేమంటే, తెలుగుతల్లిని తెలంగాణ తల్లితో పోల్చకూడదు. తెలుగుతల్లి భాషకు ప్రతీక. తెలంగాణ తల్లి ప్రాంతానికి ప్రతీక. అలాంటప్పుడు ఈ రెంటినీ కలిపేసి విబేధాలు సృష్టించి లేతమనసుల్లో విషం ఎక్కించడం మంచిదేనా?
అవాంఛనీయమైన ఇలాంటి వ్యాఖ్యలవల్ల తెలుగుతల్లి కంటనీరు పెడుతున్నది. ఇది అత్యంత శోచనీయం. ఈ సమస్యను మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయడం మంచిది.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నారదలోకం ఆహ్వానిస్తోంది. చర్చలో పాల్గొనండి. సమస్య పరిష్కారానికి ఓ చక్కటి సలహా ఇవ్వండి.
(ఈ వ్యాసానికి సూచనలు ఇస్తున్న పాఠక మిత్రులకు ధన్యవాదాలు)
- ఎడిటర్






