Thursday, December 31, 2009

హ్యాపీ న్యూ ఇయర్

నారదలోకం పాఠకులకు
2010
నూతన సంవత్సర శుభాకాంక్షలు
అతిత్వరలోనే మళ్లీ మీ ముందుకు విశేష వార్తలు తీసుకువస్తానని మాట ఇస్తూ ...
మీ కణ్వస
kanvasas@gmail.com

Monday, December 7, 2009

ప్రత్యేక రాష్ట్రం - పది ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావన మళ్ళీ నలుగురి నోటా వినిపిస్తున్నది! విభజనోద్యమం విద్యా ర్థులు, ఉద్యోగి వర్గాల చేతుల్లోకి వెళ్లడంతో అది తీవ్రరూపమే ధరిస్తున్నది. సమష్టి రాష్ట్రంలో తమకు అన్యాయాలు జరుగుతున్నవని తెలంగాణ సోదరులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. అయితే,విభజనకు సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను కూడా నిర్ణయించుకున్న తర్వాత విభజన ఆలోచన చేయడం జరిగింది.
'రాష్ట్రాన్ని విభజించడమంటే,కాగితాన్ని రెండు ముక్కలుగా చించడం కాదు! దానికి బోలెడు తతంగముంది అని ఆ మధ్య పిసిసి మాజీ అధ్యక్షులు కె.కేశవరావు అన్నమాట అక్షరాల నిజం. ఔను! రాష్ట్రవిభజన అనేది చెప్పేంటత సులభంకాదు. ఒక రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం సుదీర్ఘమైన కార్యక్రమాన్ని నిర్దేశించింది. విభజనకు ముందు ఎన్నో ప్రశ్నలకు,లేదా ఏర్పడబోయే సమస్యలకు సమాధానాలను కూడా సిద్ధం చేసు కోకుండా విభజన గురించి నిర్ణయించడమంటే, పైకి వచ్చే మార్గం చూసుకోకుండా నూతిలోదూకడం వంటిదే! ఆ ప్రశ్నలు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు. అవి మొత్తం రాష్ట్రానికి సంబంధించినవి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవశ్యం ఆలోచించవలసినవి.
1953లో సమష్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినపుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో అప్పటి నాయకులు, ప్రజలు ఎదుర్కొనవలసిన సమస్యలను స్వయంగా చూసినవాడిని.ఆప్రశ్నలు
1.ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగితే, మిగిలిన ఆంధ్ర ప్రాంతానికి రాజధాని ఏది?1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కోస్తా జిల్లాలలో విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య వుండాలని ఆప్రాంతంవారు, కాదు, రాయలసీమలోనే వుండాలని ఆప్రాంతంవారు ఆందోళనలే చేశారు.చివరికి,1937లో దేశోద్ధారక కాశీనాథుని శివనాగేశ్వరరావు గృహం 'శ్రీబాగ్‌లో సర్కారు,రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం,రాయలసీమ వారు రాజధానినే కోరుకున్నందున, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
2.ఇప్పుడు కూడా రాయలసీమవారు అదే కోరవచ్చు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని రాయలసీమ హక్కుల సమితి ఎప్పటి నుంచో అంటున్నది.అసలు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 1953కు పూర్వం నుంచి రాయలసీమ మహాసభ కోరుతూ వచ్చింది.ఆతరువాత భారత రాష్ట్రపతి పదవి,అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిత్వం వహించిన నీలం సంజీవ రెడ్డి ఒక దశలో రాయలసీమ మహాసభకు అధ్యక్షులుగా వున్నారు. రాష్ట్ర విభజన జరిగితే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనో లేదా రాజధానిని కర్నూలులోనో, తిరుపతి లోనో,మరొకచోటో నెలకొల్పాలని ఆ ప్రాంతం వారు కోరవచ్చు.
3. మరి,విశాఖపట్నం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలతో,నౌకానిర్మాణ కేంద్రం,ఉక్కు ఫ్యాక్టరీలతో అంతర్జాతీయ నగరంగా పరిఢవిల్లుతున్నదని,కాబట్టి దానినే ఆంధ్రరాష్ట్ర రాజధానిని చేయాలని ఆ నగరవాసులు, లేదా ఉత్తరాంధ్ర జిల్లాల వారు కోరవచ్చు.
4. అన్నట్టు, రాష్ట్రవిభజన జరిగితే,శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలతో 'ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కొంతకాలంగా వినవస్తున్నది.నిజానికి,విశాఖపట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ఉక్కుమనిషి సర్దార్‌ లచ్చన్న 1953లోనే కోరారు.
భవనాలకు సొమ్ము ఏది?
5.ఎక్కడ కొత్త రాష్ట్రరాజధాని పెట్టినా,హైదరాబాదులో వలె ప్రభుత్వ కార్యాలయాలకు,అసెంబ్లీ,సెక్రటేరియట్‌లకు, హైకోర్టుకు,ఇంకా ఎన్నింటికో బ్రహ్మాండమైన భవనాలు కావాలి.వాటిని నిర్మించడానికి ఎన్నివేల కోట్ల రూపాయలు కావాలి. వీటిని ఎవరిస్తారు?ఆంధ్ర ప్రాంతంలో ఒక ఆధునిక రాజధానీ నగరాన్ని నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది? అంతకు వరకు కొత్త రాష్ట్ర రాజధాని ఒక 'కాందిశీకుల శిబిరంగానే వుండవలసిందేనా? అని ఆ ప్రాంతం వారు అడగరా?'రాష్ట్ర విభజన జరిగితే,అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలిపితే,మాకు నేత్రావతి నదీ జలాలు పుష్కలంగా లభించి,మేము బాగా అభివృద్ధి చెందుతామని ఆ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ముస్లింల కోర్కె
6 'ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకం,రాష్ట్ర విభజన చేసేటప్పుడు మమ్మల్నికూడా సంప్రదించండిఅని ఆ మధ్య ఢిల్లీలో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో,కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు నగరంలో తమ ప్రాబల్యం చెలాయిస్తున్న ఎమ్‌ఐఎమ్‌కు చెందిన ఎమ్‌పి అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.7 అంతేకాదు రాష్ట్రాన్ని రెండు ముక్కలో,మూడు ముక్కలో చేస్తే దాదాపు 60 లక్షల జనాభా వున్న హైదరాబాదు నగ రాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌ కూడా ఎమ్‌ఐఎమ్‌ నుంచి వినిపించడంలేదా?8.'హైదరాబాద్‌లేని రాష్ట్రం తలలేని మొండం వంటిది.ఆమహానగరంలేని ప్రత్యేక రాష్ట్రం మాకెందుకని విభజనవాదులు ఇదివరకే ధ్వనించారు.హైదరబాద్‌ నగరం చుట్టూ వున్నది తెలంగాణా ప్రాంతమే కాబట్టి హైదరాబాద్‌ను ఎలా వేరు చేస్తారని వారివాదన.అది కూడా వాస్తవమే.9 'హైదరాబాద్‌ నగరాన్ని ఈ స్థాయికి తీసుకు రావడానికి మాపెట్టుబడి,మాకృషి ప్రధానకారణం. దాన్ని ఎలా వదిలివేస్తామని ఆంద్ర ప్రాంతం వారి వాదనగా కనిపిస్తున్నది.10 రాష్ట్ర విభజన జరిగితే,కృష్ణా,గోదావరి నదీజలాలపై ప్రాజెక్టులపై నిర్మాణం సమస్య మరింత జటిలం కావచ్చు.అది రెండు ప్రాంతాల మధ్య నిత్య వివాదంగా పోరాటంగా పరిణమించవచ్చునని నీటి పారుదల సమస్యల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా,ఈ సమస్యలు, ప్రశ్నలనింటినిచూస్తే, రాష్ట్రవిభజన వ్యవహారం తేనెతుట్టెను కదపడం వంటిదని బోధపడటం లేదా?
- తుర్లపాటి కుటుంబరావు (`వార్త' సౌజన్యంతో)