Saturday, February 6, 2010

ఫోకస్: గోవింద`గానం'


ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది భక్తులు సమర్పించిన కానుకల సొమ్మేగాని టిటిడి చేర్మన్ గారి జేబులోది కాదు.పైగా లతాజీని ఆస్థాన విద్వాంసురాలుగా అదే సభలో ప్రకటించారు. ఇప్పటికే బాలమురళీక్రిష్ణ టిటిడి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు. మరి లతాజీ ఎందుకు ? ఎవరి ముచ్చట తీర్చేందుకు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది.
- `నారదలోకం' అభిమాని
హైదరాబాద్

Thursday, January 14, 2010

శుభాకాంక్షలు


నారదలోకం వీక్షకులకు
సంక్రాంతి శుభాకాంక్షలు


Thursday, December 31, 2009

హ్యాపీ న్యూ ఇయర్

నారదలోకం పాఠకులకు
2010
నూతన సంవత్సర శుభాకాంక్షలు
అతిత్వరలోనే మళ్లీ మీ ముందుకు విశేష వార్తలు తీసుకువస్తానని మాట ఇస్తూ ...
మీ కణ్వస
kanvasas@gmail.com

Monday, December 7, 2009

ప్రత్యేక రాష్ట్రం - పది ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావన మళ్ళీ నలుగురి నోటా వినిపిస్తున్నది! విభజనోద్యమం విద్యా ర్థులు, ఉద్యోగి వర్గాల చేతుల్లోకి వెళ్లడంతో అది తీవ్రరూపమే ధరిస్తున్నది. సమష్టి రాష్ట్రంలో తమకు అన్యాయాలు జరుగుతున్నవని తెలంగాణ సోదరులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. అయితే,విభజనకు సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను కూడా నిర్ణయించుకున్న తర్వాత విభజన ఆలోచన చేయడం జరిగింది.
'రాష్ట్రాన్ని విభజించడమంటే,కాగితాన్ని రెండు ముక్కలుగా చించడం కాదు! దానికి బోలెడు తతంగముంది అని ఆ మధ్య పిసిసి మాజీ అధ్యక్షులు కె.కేశవరావు అన్నమాట అక్షరాల నిజం. ఔను! రాష్ట్రవిభజన అనేది చెప్పేంటత సులభంకాదు. ఒక రాష్ట్రాన్ని విభజించడానికి రాజ్యాంగం సుదీర్ఘమైన కార్యక్రమాన్ని నిర్దేశించింది. విభజనకు ముందు ఎన్నో ప్రశ్నలకు,లేదా ఏర్పడబోయే సమస్యలకు సమాధానాలను కూడా సిద్ధం చేసు కోకుండా విభజన గురించి నిర్ణయించడమంటే, పైకి వచ్చే మార్గం చూసుకోకుండా నూతిలోదూకడం వంటిదే! ఆ ప్రశ్నలు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు. అవి మొత్తం రాష్ట్రానికి సంబంధించినవి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవశ్యం ఆలోచించవలసినవి.
1953లో సమష్టి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినపుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంగారికి కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో అప్పటి నాయకులు, ప్రజలు ఎదుర్కొనవలసిన సమస్యలను స్వయంగా చూసినవాడిని.ఆప్రశ్నలు
1.ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగితే, మిగిలిన ఆంధ్ర ప్రాంతానికి రాజధాని ఏది?1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కోస్తా జిల్లాలలో విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య వుండాలని ఆప్రాంతంవారు, కాదు, రాయలసీమలోనే వుండాలని ఆప్రాంతంవారు ఆందోళనలే చేశారు.చివరికి,1937లో దేశోద్ధారక కాశీనాథుని శివనాగేశ్వరరావు గృహం 'శ్రీబాగ్‌లో సర్కారు,రాయలసీమ ప్రాంతాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం,రాయలసీమ వారు రాజధానినే కోరుకున్నందున, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించారు.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
2.ఇప్పుడు కూడా రాయలసీమవారు అదే కోరవచ్చు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని రాయలసీమ హక్కుల సమితి ఎప్పటి నుంచో అంటున్నది.అసలు రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 1953కు పూర్వం నుంచి రాయలసీమ మహాసభ కోరుతూ వచ్చింది.ఆతరువాత భారత రాష్ట్రపతి పదవి,అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిత్వం వహించిన నీలం సంజీవ రెడ్డి ఒక దశలో రాయలసీమ మహాసభకు అధ్యక్షులుగా వున్నారు. రాష్ట్ర విభజన జరిగితే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనో లేదా రాజధానిని కర్నూలులోనో, తిరుపతి లోనో,మరొకచోటో నెలకొల్పాలని ఆ ప్రాంతం వారు కోరవచ్చు.
3. మరి,విశాఖపట్నం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలతో,నౌకానిర్మాణ కేంద్రం,ఉక్కు ఫ్యాక్టరీలతో అంతర్జాతీయ నగరంగా పరిఢవిల్లుతున్నదని,కాబట్టి దానినే ఆంధ్రరాష్ట్ర రాజధానిని చేయాలని ఆ నగరవాసులు, లేదా ఉత్తరాంధ్ర జిల్లాల వారు కోరవచ్చు.
4. అన్నట్టు, రాష్ట్రవిభజన జరిగితే,శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలతో 'ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కొంతకాలంగా వినవస్తున్నది.నిజానికి,విశాఖపట్టణాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధాని చేయాలని ఉత్తరాంధ్ర ఉక్కుమనిషి సర్దార్‌ లచ్చన్న 1953లోనే కోరారు.
భవనాలకు సొమ్ము ఏది?
5.ఎక్కడ కొత్త రాష్ట్రరాజధాని పెట్టినా,హైదరాబాదులో వలె ప్రభుత్వ కార్యాలయాలకు,అసెంబ్లీ,సెక్రటేరియట్‌లకు, హైకోర్టుకు,ఇంకా ఎన్నింటికో బ్రహ్మాండమైన భవనాలు కావాలి.వాటిని నిర్మించడానికి ఎన్నివేల కోట్ల రూపాయలు కావాలి. వీటిని ఎవరిస్తారు?ఆంధ్ర ప్రాంతంలో ఒక ఆధునిక రాజధానీ నగరాన్ని నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది? అంతకు వరకు కొత్త రాష్ట్ర రాజధాని ఒక 'కాందిశీకుల శిబిరంగానే వుండవలసిందేనా? అని ఆ ప్రాంతం వారు అడగరా?'రాష్ట్ర విభజన జరిగితే,అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలిపితే,మాకు నేత్రావతి నదీ జలాలు పుష్కలంగా లభించి,మేము బాగా అభివృద్ధి చెందుతామని ఆ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ముస్లింల కోర్కె
6 'ప్రత్యేక రాష్ట్రానికి మేము వ్యతిరేకం,రాష్ట్ర విభజన చేసేటప్పుడు మమ్మల్నికూడా సంప్రదించండిఅని ఆ మధ్య ఢిల్లీలో జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో,కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు నగరంలో తమ ప్రాబల్యం చెలాయిస్తున్న ఎమ్‌ఐఎమ్‌కు చెందిన ఎమ్‌పి అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.7 అంతేకాదు రాష్ట్రాన్ని రెండు ముక్కలో,మూడు ముక్కలో చేస్తే దాదాపు 60 లక్షల జనాభా వున్న హైదరాబాదు నగ రాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌ కూడా ఎమ్‌ఐఎమ్‌ నుంచి వినిపించడంలేదా?8.'హైదరాబాద్‌లేని రాష్ట్రం తలలేని మొండం వంటిది.ఆమహానగరంలేని ప్రత్యేక రాష్ట్రం మాకెందుకని విభజనవాదులు ఇదివరకే ధ్వనించారు.హైదరబాద్‌ నగరం చుట్టూ వున్నది తెలంగాణా ప్రాంతమే కాబట్టి హైదరాబాద్‌ను ఎలా వేరు చేస్తారని వారివాదన.అది కూడా వాస్తవమే.9 'హైదరాబాద్‌ నగరాన్ని ఈ స్థాయికి తీసుకు రావడానికి మాపెట్టుబడి,మాకృషి ప్రధానకారణం. దాన్ని ఎలా వదిలివేస్తామని ఆంద్ర ప్రాంతం వారి వాదనగా కనిపిస్తున్నది.10 రాష్ట్ర విభజన జరిగితే,కృష్ణా,గోదావరి నదీజలాలపై ప్రాజెక్టులపై నిర్మాణం సమస్య మరింత జటిలం కావచ్చు.అది రెండు ప్రాంతాల మధ్య నిత్య వివాదంగా పోరాటంగా పరిణమించవచ్చునని నీటి పారుదల సమస్యల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా,ఈ సమస్యలు, ప్రశ్నలనింటినిచూస్తే, రాష్ట్రవిభజన వ్యవహారం తేనెతుట్టెను కదపడం వంటిదని బోధపడటం లేదా?
- తుర్లపాటి కుటుంబరావు (`వార్త' సౌజన్యంతో)

Tuesday, November 24, 2009

సెటైర్: ఓటరు - గ్రేటరు

`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనం లాగించేసి కాసేపు టివీలో సినిమాలు చూశాడు. పెళ్లాంబిడ్డలతో కబుర్లాడాడు. రాత్రి పెందలాడే మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు. మంచి నిద్రపట్టేసింది. అంతలో ఎవరో వచ్చి తట్టిలేపారు. `ఛీ, అదివారం పూట కూడా హయిగా పడుకోనివ్వరు...' అంటూ విసుక్కున్నాడు గ్రేటర్. కానీ, ఆ వచ్చినవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. అందుకే మళ్ళీమళ్లీ తట్టిలేపుతూనే ఉన్నాడు. దీంతో గ్రేటర్ కి ముసుగుతీయక తప్పలేదు.
`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస

Sunday, November 22, 2009

సెటైర్: బిల్ గేట్స్ ని దాటిన జగన్

ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచం లోని అత్యధిక ధనవంతుల జాబితా ను చూసి అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కి ఒక డౌట్ వచ్చింది. అదేమిటంటే, కేవలం వైట్ మనీ తో వేసే లెక్క లు ఎంత వరుకు కరెక్టు అని!
వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఒక రహస్య సమావేశం ఏర్పాటుచేసి, ప్రపంచం లోని ధనవంతులదరిని పిలిచి, వారి బ్లాక్ మనీ వివరాలు కూడా తెలుసుకుని, ఆ తరువాత అసలు సిసలైన ప్రపంచ ధనవంతులెవరో తేల్చేసుకుందామని అనుకున్నాడు. ఆ వెంటనే, తన PA ని పిలిచి సమావేశానికి ఏర్పాట్లు చేసేయమన్నాడు. సమావేశ వివరాలు గోప్యంగా ఉంచుతామని అత్యంత గోప్యంగా హామీ ఇవ్వడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ధనికులు తమ బ్లాక్ మనీ రహస్యాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ముందుగా బిల్ గేట్స్ చాలా హుందాగా లేచాడు. టై సరిచేసుకున్నాడు. గొంతు విప్పాడు....
బిల్ గేట్స్: ఎస్, నేను మైక్రోసాఫ్ట్ కింగ్ ని నా సంపాదన ... ఫ్యూర్ వైట్... నాలుగువేల కోట్ల డాలర్లు. బ్లాక్ కూడా మరో నాలుగువేల కోట్లు ఉందనుకోండి...సో, వైటైనా, బ్లాక్ అయినా, నేనే అత్యంత ధనికుణ్ణి...ఎనీ డౌట్.
అనిల్ అంబానీ: నా వైట్ మనీ 1750 కోట్ల డాలర్లు. బ్లాక్ 8వేల కోట్ల డాలర్లు. టోటల్ గా సుమారు 10 వేల కోట్ల డాలర్లు. నేనే గ్రేట్. (సోదరుడు ముఖేష్ వైపు చూస్తూ ఎగతాళి నవ్వు నవ్వాడు)
ముఖేష్ అంబానీ: ఓరేయ్ అనిల్. నువ్వు పిల్లోడివేరా... వయసులోనూ, వైట్ లోనేకాదు, బ్లాక్ లోనూ నీకంటే ఎక్కువేరా... టోటల్ గా నా దగ్గర 15 వేల కోట్లు ఉందిరోయ్... నేనే నెంబర్ వన్.
ఇలా ఒక్కొక్కరూ లేచి తమ బ్లాక్ అండ్ వైట్ వివరాలు కలర్ పుల్ గా చెబుతుంటే అప్పుడు లేచాడు ఓ తెలుగోడు.
చంద్రబాబు: ఒక్కసారి నా లిస్టు చూస్తుంటే మీకే తెలుస్తుందీ, నేను ఎలా ముందుకు పోతున్నానో...నా వైట్, బ్లాక్ కలిపితే, 32వేల కోట్ల డాలర్లు. ఆ విధంగా తెలుగుజాతి ముందుకుపోతుంది. అందుకే మీకు చెబ్తున్నాను, హైదరాబాద్ ని నెంబర్ వన్ చేశాను, అదే మాదిరిగా, నేనూ నెంబర్ వన్ అయ్యాను.
ఇదే సమావేశానికి లేటుగా హాజరై చివరి వరసలో కూర్చున్న అల్లుఅరవింద్ తన బావ చిరంజీవితో అంటున్నాడు...
అల్లుఅరవింద్: చూశావా బావా...నేను ముందు నుంచి చెబ్తునే ఉన్నాను. సినిమాటికెట్లకంటే, పార్టీ టికెట్లు అమ్ముకుంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని. పదేళ్లకిందటే నువ్వు పార్టీ పెట్టిఉంటే, మనమే నెంబర్ వన్ అయ్యేవాళ్లం బావా...
ఇంతలో జగన్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. జగన్ తనదైన శైలిలో తలఎడమ పక్కకి వొంచుతూ, చాలా అమాయంకంగా చెప్పుకుపోతున్నాడు....
జగన్: బ్లాక్ మనీ అయినా, వైట్ మనీ అయినా, అందరికీ ఆదర్శం మా నాన్నగారే. ఆయన బాటలో నడుస్తున్న నేను బ్లాక్ అండ్ వైట్ లో ఎంత కూడబెట్టానని మిస్టర్ ఒబామా అడుగుతున్నారు. అయితే నేను చెబ్తున్నాను, అన్నీ కలర్ పేజీలు వేస్తున్న సాక్షిలో ఉన్నదంతా బ్లాక్ మనీనే...ఇంకా చెబ్తున్నా, నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలిపి సుమారుగా 1లక్షా 36వేల 760 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చు...ఇంకా..

అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఒబామాకు కళ్లు బైర్లుకమ్మాయి. `ఔరా' అని ఇంగ్లీష్ లో అనుకుంటుండగానే తన పక్కనే కూర్చున్న బిల్ గేట్స్ అవుట్ పుట్ రాని ప్రోగ్రాం లాగా సడన్ గా దబీమని పడిపోయాడు. గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నీళ్లు చల్లి లేపాక ఒకటే మాట కలవరిస్తున్నాడు....
బిల్ గేట్స్: నేను ఇండియా పోతా...నేను ఇండియా పోతా....పోతా...పో...

- రాజేష్

Saturday, November 14, 2009

రోశయ్య నోట `చిరు'నామస్మరణ

గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తుల వ్యవహారం బెడిసికొట్టినా కాంగ్రెస్ లో ఆశలు చావలేదు. ఈసారి మీడియాకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ప్రజారాజ్యం పార్టీని ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి బేరసారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బిహైండ్ ద కర్టెన్ వ్యవహారం కాగా, రోశయ్య మాస్టారు `చిరు'నామస్మరణకు దిగారు. బాలలదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుత తరం నటుల్లో చిరంజీవి అంటే తనకు మక్కువ అంటూ ముచ్చటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా, దానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి. చిరంజీవి గొప్పనటుడంటూ రోశయ్య కితాబు ఇచ్చారు. చిరంజీవిని నెమ్మదిగా కాంగ్రెస్ ముగ్గులోకి దింపడంకోసమే రోశయ్య మాస్టారు ఇలా చిరునామస్మరణ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.