Wednesday, September 30, 2009

రోశయ్యది `నీటి తత్వం'

ఈ సృష్టిలో అనేక పదార్ధాలున్నాయి. ప్రతి పదార్థానికి ఓ తత్వం ఉంటుంది. అలాగే మనుషుల్లో కూడా వేరువేరు తత్వాలు ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రోశయ్య తత్వమేమిటో అర్థంకానివారు ఇది చదవాలి... 55ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఈ కురువృద్ధ రాజకీయనేత అంతరంగాన్ని పసిగట్టడం చాలా కష్టమే. వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు సునిశితంగా గమనిస్తూనే మరో పక్క తామరాకుమీద నీటి బొట్టులా ఉండటం రోశయ్యకే చెల్లు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇమిడిపోగల తత్వం ఆయనది. వైఎస్సార్ ఉన్నంతకాలం ఆయన మీద ఈగవాలనీయలేదు ఈ వృద్ధ సింహం. ఆ తరువాత అదే తరహాలో రక్షణ కవచాన్ని వైఎస్సార్ కుమారుడు జగన్ కు ఇవ్వడానికి ఆయన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయలేదు. అలాఅని జగన్ ను పూర్తిగా వ్యతిరేకించడంలేదు. ఖమ్మం, రాజమండ్రి గొడవలనేపథ్యంలో రోశయ్య మాట్లాడుతూ, స్థానిక గొడవలకు జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు. జగన్ కు ఒక వర్గం, తనకొక వర్గం లేదని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం కూర్చోమంటే కూర్చున్నా, లేవమంటే లేచి వెళ్ళిపోతా, వేరే ఎవరు వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నావారికి సహకరిస్తానంటూ తన రాజకీయ తత్వం ఏమిటో భోదించారు. రోశయ్య రాజకీయాల్లో పండిపోయిన ఆకులాంటివారు. కాంగ్రెస్ అథిష్ఠానమంటే ఆయనకు వల్లమాలిన అభిమానం, గౌరవం. రోశయ్యలో మరో ప్రత్యేకత కూడా ఉంది. తనకుతానుగా అవకాశాల కోసం అర్రులుచాచరు. అలాఅని అవకాశం తలుపుతడితేమాత్రం తెరవకుండా ఉండరు. ఆయనది జల స్వభావం. ఏ సీసాలో పోస్తే ఆ సీసాలో వొదిగిపోతారు. అందుకే రోశయ్య ఇప్పుడు జగన్ వర్గీయులకూ, అటు జగన్ వైరి వర్గీయులకు `తన వాడిగానే' కనబడుతుంటారు. అదే, రోశయ్య తత్వం.

No comments:

Post a Comment