`ఎవరునువ్వు?' గట్టిగానే కసురుకున్నాడు గ్రేటర్.
`నేను ఓటర్ని...లే..త్వరగాలే...'
గ్రేటర్ కి కోపం నశాలానికంటింది.
`ఏంటీ లేచేది. సిటీబస్సులో స్టాండింగ్ ప్యాసింజర్లా ఏంటీ నీ చూపు. ఈవేళ ఆదివారం, నేను లేవను.'
`కాదు, నువ్వు లేవాల్సిందే. అది నీ బాధ్యత'
`ఎందుకులేవాలి. అసలు లేవమని అడిగే హక్కు నీకెక్కడిది? రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేసేవాడిలా ఏంటా చూపు? ఇంతకీ నువ్వెవరివి?'
`నేను ఓటర్ని..'
`అయితే, నన్నులేపే హక్కు నీకెక్కడిది...?'
`ఓటరుగా నిన్ను లేపే హక్కు నాకుంది. నిన్ను చైతన్యం చేయాలనే వచ్చాను. అసలు నేనెవరో కాదు, నీలోని ఓటర్ని....
`అదీ, అట్లా చెప్పు. గ్రేటర్ హైదరాబాద్ లో వేరేవాళ్లయితే, ఇలాంటి సాహసానికి దిగరు. నాలోనివాడివికాబట్టే నీకీ తెగువ. ఉండు, నీపనిబడతా...'
గ్రేటర్ మంచం దిగి ఓటరు పని పట్టాలని లేవబోయాడు. అంతలో ఆదివారం రెస్టావ్రతంలో ఉన్నానని తెలుసుకుని...
`ఊహూ, నేను రెస్ట్ల్ లో ఉన్నాను కనుక నువ్వు బతికిపోయావు. పో, నన్ను డిస్ట్రబ్ చేయకు.'
`నువ్వు పొమ్మంటే పోవడానికి నేను మామూలు మనిషినికాను. ఓటర్ని. నా బాధ్యతలు నేను చేసుకుంటూ పోతాను.'
`ఏంటీ నీ బాధ్యత?'
`నేచేత ఓటు వేయించాలి.'
`ఓహ్..గుర్తుకువచ్చింది. గ్రేటర్ ఎన్నికలుకదా...అయినా అది సోమవారం కదా..'
`పిచ్చినా గ్రేటరూ, ఆదివారం వెళ్లిపోయింది. తెల్లవారుజామైంది.. మరికాసేపట్లో తెల్లవారబోతున్నది. లే, లేచివెళ్ళి పవిత్రమైన ఓటువెయ్యి.'
`అబ్బో చాలా పెద్దమాటలే మాట్లాడుతున్నావ్. ఏ పార్టీవాళ్లైనా చేతులు తడిపారా ఏంటీ?'
`నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగను. ఊరికే మాటలతో కాలక్షేపం చేయకు, ఓటు వేయడానికి సిద్ధంకా...'
`ఎందుకు ఓటు వేయడం?'
`అదేం పిచ్చి ప్రశ్న. నీ నగరాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవద్దూ...'
ఆ మాటలకు గ్రేటర్ పగలబడినవ్వాడు. మంచంమీద అటూఇటూ పొర్లుతూమరీ నవ్వాడు.
` పిచ్చినా ఓటరూ, ఆర్నెళ్లకిందట ఓటు వేశాం ఏం జరిగింది?
అవి జనరల్ ఎలెక్షన్స్.'
`పీకావులే లాజిక్. మాకా విషయం తెలియదా. ఆ ఎలెక్షన్సప్పుడు ఇచ్చిన హామీలే తీర్చలేదు. ఇప్పుడేమీ పీకుతారట.'
`ఇవి గ్రేటర్ ఎన్నికలు. గ్రైటర్ హైదరాబాద్ లో రోడ్లు వెడల్పు అవుతాయి.
ఛా...నిజమా!'
`మాన్ హోల్స్ కనిపించవు'
`ఛా..నిజమే!!'
`ఎక్కడబడితే అక్కడ ప్లైఓవర్లు...'
`ఎందుకూ, కూలడానికా...?'
`మెట్రో రైళ్లు...'
`ఎక్కడా, కాగితాలమీదనా...?'
`బోలెడన్నీ సిటీబస్సులు'
`ఎందుకూ, ట్రాఫిక్ లో ఉన్నవే ముందుకు కదలడంలేదు. కొత్తవెందుకూ!!'
`నగర వాసులందరికీ ఆరోగ్యం'
`ఎట్టా!! కాలుష్యం ఇట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా వస్తుందబ్బా?!'
గ్రేటర్లందరీ భద్రత
`ఎక్కడా, గోకుల్ ఛాట్ లోనా, లుంబినీ పార్క్ లోనా...పాతబస్తీలోనా, అబిడ్స్ సెంటర్లోనా?'
` నువ్వు అలా అనకూడదు. మనిషి ఆశావాది. గ్రేటర్ లో కొత్త పాలన వచ్చేస్తుంది. నువ్వు ఓటు వేస్తే మెరుగైన పాలన వస్తుంది. లే, లేచి ఓటువెయ్యి.'
` చాల్లే, చెప్పొచ్చావ్...అభాగ్యనగర వాసులకు అంత సీను లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి ఓటు నీతులు చెప్పుకో...పో..'
`ఆ చెప్పడం మరిచాను, ఓటు వేయడానికి నీకు ఈరోజు సెలవు ఇచ్చారు. తెలుసా...'
`హాయ్... నిజమే, సమయానికి గుర్తుచేశావ్. ఇంకానయం మంచం దిగలేదు. ఆదివారం పక్కన సోమవారం కూడా సెలవా...భలే ఛాన్స్ లే..లలలా...లలలా లక్కీ ఛాన్స్ లే...'
`మరి నా ఓటు సంగతో...'
`రెండురోజులు సెలవు వస్తే ఏంటీ నీ నస. అసలే, చలిగా ఉంది. పొద్దున్నే గోలపెట్టకు. నువ్వు నాలోని వాడివేకదా...వచ్చేయ్...దుప్పట్లో దూరు..హాయిగా, వెచ్చగా పడుకుందాం. మనకెందుకు చెప్పు, ఈ ఓట్లూ, గీట్లు. ఎవరు వచ్చినా ఒరిగేదిలేదు. గ్రేటర్ హైదరాబాద్ వాసిగా నా కష్టాలు నాకు తప్పవు. సెలవు అయిందంటే హైదరా`బాధ'లే..రా, వచ్చేయ్..దుప్పట్లో దూరేయ్..'
అంతే, ఓటరు మారుమాటమాట్లాడకుండా గ్రేటర్ దుప్పట్లో దూరి ముసుగుతన్ని పడుకున్నాడు.
ఫలితం: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 44.15 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
- కణ్వస