Saturday, November 14, 2009

`గాలి' - కోడా ఇద్దరూ ఇద్దరే

ఓబుళాపురం గనుల్లో అక్రమాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలిజనార్దనరెడ్డికీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం...
సవాల్: తమపై మోపబడిన ఆరోపణలు నిజమని కోర్టులో నిర్ధారణ అయితే (కావని అన్నదే వారి దీమాలా కనబడుతోంది) రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్కమిస్తానంటూ ఇటు గాలి, అటు కోడా ఇద్దరూ సవాళ్లు విసిరారు.
ట్రంప్ కార్డ్ : ఇద్దరి చేతులో ట్రంప్ కార్డులున్నాయి. గాలి తన పేరులో రెడ్డి అన్న కులం పేరు ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు దాడిచేస్తున్నారనీ, ఒక వేళ తనపేరులో `రెడ్డి' అన్న పదం లేకుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని గాలి `కులం' కార్డు తీస్తే, మరో పక్క మధుకోడా `ట్రైబల్' కార్డు తీశారు. తాను గిరిజనుడైనందునే తనపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఎదిగినతీరు: వీరిద్దరూ ఇంచుమించూ ఒకేలా ఎదిగారు. ఎనిమిదేళ్ల కితం గాలిపేరుగానీ, అటు మధుకోడా పేరుగానీ ఎవ్వరికీ తెలియదు. మధుకోడా రోజువారీ కూలీ కుటుంబం నుంచి వేలాది కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. గాలి ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అండదండలతో విశ్వరూపం చూపించారు. ఇద్దరూ ఇనుప ఖనిజం గనులను నమ్ముకునే (అమ్ముకునే) కోట్లకు పడగలెత్తారు. ఆ తరువాత రాజకీయలవైపు దృష్టిపెట్టారు. అటుపై ఏకంగా సీఎం సీట్లో కూర్చోవడం, లేదా కూలదోయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
మధుకోడా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగా, గాలి కర్నాటక సీఎం సీటుని అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన `సోదరుడు' (ఈమాట గాలి జనార్దనరెడ్డి తాజ్ బంజారా హోటల్ లో మీట్ ద ప్రెస్ లో చెప్పారు) ఎప్పటికైనా అవుతాడని బల్లగుద్ది మరీ గాలి చెప్పేశారు.

1 comment:

  1. గాలి ఒకప్పుడు తాడిపత్రిలో ఎన్నోబుల్ ఇండియా చిట్ కంపెనీలో సైకిల్ పై తిరుగుతూ పనిచేసేవాడంట ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు.

    ReplyDelete