Sunday, November 8, 2009

సెటైర్: ఈ గాలీ,ఆ జగనూ, అంతలో అద్వానీ

`పవర్' పాలిటిక్స్ కి వరుసావావి ఉండదు. నీరు ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తున్నట్టూ, గాలి ఎటువీస్తే అటే `పవర్' కదులుతున్నట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పయనం. ఈ పాలసీని ఆసరాగాతీసుకునే కర్నాటకలో గాలిసోదరులు ఓ ఆటఆడిస్తున్నారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప, గాలి సోదరుల మధ్య రేగిన చిచ్చు చల్లార్చాలని బిజెపీ అధిష్ఠానం నడుం బిగించింది. సరిగా ఈ నేపథ్యంలో అద్వానీ, గాలి జనార్ధనరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఇలా సాగింది...
అద్వానీ: హలో గాలి జనార్ధనేనా?
గాలి: ఎస్, గాలి స్పీకింగ్ హియర్..
అద్వానీ: (స్వగతం) అంతే, మనీపవర్ నెత్తికెక్కితే డైలాగ్స్ ఇలాగే ఉంటాయి,(పైకి) హలో గాలి, నేను అద్వానీని.
గాలి: ఏంటిసార్, తొందరగా చెప్పండి, అవతల శంషాబాద్ నోవాటెల్ లో నా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళాలి.
అద్వానీ: ఉండవయ్యా, నీ అసాధ్యం కూలా...తొందరపడకు. అయినా బెంగళూరులో మంచి హోటల్స్ చాలానే ఉంటే, శంషాబాద్ హోటలెందుకట...
గాలి: అదాసార్, చంద్రబాబు గతంలో హైదరాబాద్ హోటల్ లో ఎమ్మెల్యేలను మూసేసి సీఎం సీటు దక్కించుకోలా. ఆ స్పూర్తితోనే హైదరాబాద్ ఎంచుకున్నా.
అద్వానీ: సర్లే, ఆ పాత వెన్నుపోట్ల మాటెత్తకు, నాకు వెన్నులో చలిపుట్టుకొస్తోంది. ఇంతకీ నీ డిమాండ్లేమిటి?
గాలి: పెద్దగా డిమాండ్లేమీలేవుసార్. నాకొన్నది ఒకటే డిమాండ్.
అద్వానీ: హాహ్హహ్హాఁ...ఒకటేనా, చెప్పేయ్, త్వరగా తీర్చేస్తా.
గాలి: జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: జగనా, అతనెవరూ...నీ దగ్గరున్న 50 మంది ఎమ్మెల్యేల్లో ఒకడా..అయినా ఈ పేరు వినలేదే.
గాలి: అతను కర్నాటక ఎమ్మెల్యే కాదుసార్.
అద్వానీ: మరీ!
గాలి: ఆంద్రా ఎంపీ. వైఎస్సార్ కొడుకు జగన్
అద్వానీ: అదేంటయ్యా! కాంగ్రెస్ ఎంపీ అయిన జగన్ ని మనమెలా సీఎంని చేస్తామయ్యా?
గాలి: అవన్నీ నాకు తెలియవుసార్. జగన్ ని సీఎం చేయాల్సిందే.
అద్వానీ: అది కుదరదయ్యా, ఇంకేదైనా అడుగు
గాలి: నాకు ఇంకేమీ వద్దుసార్. మా జగనన్న సీఎం అవ్వాల్సిందే.
అద్వానీ: (స్వగతం) ఓర్నాయనో, ఆంధ్రా జాఢ్యం కర్నాటకకు పట్టుకున్నట్టుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టుంది.
గాలి: ఏంసార్. మాట్లాడటంలేదు. ఒకేనా. చెప్పండి. అవతల టైం లేదు. ప్రభుత్వం కూల్చేయాలి. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. జగన్ ని సీఎం చేయాలి.
అద్వానీ: ఓరినా గాలో...అంతపని చేయకయ్యా. సర్లే సీఎంని చేద్దాం.ఇంతకీ ఏ రాష్ట్రానికి సీఎంని చేయాలి. ఆంధ్రాకా, కర్నాటకకా
గాలి:అదీ...అదీ...సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా...జగన్ ని అడిగి చెప్తా.
అద్వానీ: (స్వగతం) ఈ గాలి ఎప్పుడు ఎటువీస్తుందో అర్థంకావడంలేదు. కొంపదీసి గుజరాత్ కి సీఎంని చేయమని అడగడుకదా...
గాలి: సార్, తెలిసిందిసార్. మా జగనన్న ఆంధ్రకే సీఎం కావాలనుకుంటున్నాడు.
అద్వానీ: అమ్మయ్యా, నా టెన్షన్ తగ్గింది. మరైతే మధ్యలో నేనేం చేయాలయ్యా. నీ డిమాండ్ నాకర్థం కావడంలేదు.
గాలి: అవన్నీ నాకు తెలియదుసార్. జగన్ సీఎం అవ్వాలి. లేకుంటే నా 50 మంది ఎమ్మెల్యేలు...
అద్వానీ: ఆపవయ్యా, నీ రికార్డింగ్. ఆగిన రైల్లో చైన్ లాగేసే ఫేసూనువ్వూ...కాస్త ఆలోచించుకోనీ...ఆఁ, సర్లేవయ్యా, నేను సోనియాతో మాట్లాడతా...ఎలాగో ఒప్పిస్తా. జగన్ ని ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళి సోనియాను కలవమను. సెంటిమెంట్ అక్కరకు వస్తుంది.
గాలి: అట్లాగే సార్, త్వరగా తేల్చండి... అవతల నోవాటెల్ వాడు నా గనులు పిండుతున్నాడు. ఇంకొన్నాళ్లయితే, నా ఆస్తిమొత్తం లాక్కుంటాడేమో...
- టి. రాజేష్

2 comments: