Saturday, November 7, 2009

ఫ్యామిలీ చిత్రం: జగన్ సకుటుంబ ఢిల్లీ యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ తన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. శనివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి చేరుకోవడంలో మతలబు ఏమిటనే అంశం రాజకీయ వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా, సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కె.రోశయ్య ఢిల్లీకి శుక్రవారం సాయంత్రం తొలిసారి వెళ్లారు. తొలిరోజున ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తన పర్యటన రెండో రోజైన శనివారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నారు.
ఇంతలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి, భార్య, సోదరితో ప్రత్యక్షం కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేకుండానే ఆయన ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏమిటన్నదే అసలు ప్రశ్న.

No comments:

Post a Comment