`సీ' బ్లాక్ లో సీఎం రోశయ్య చాలా అసహనంగా అటూఇటూ తిరుగుతున్నారు. బట్టతలను పదేపదే తడుముకుంటున్నాడు. ఆలోచన ఎంతకీ తెగకపోవడంతో సలహాకోసం కేవీపీని కేకేశారు. `ఈ పెద్దాయన ఇప్పుడెందుకు పిలిచాడా...ఏం లెక్కలు చెప్పమంటాడో ఏమో...అవి ఏవరి పీకకు చుట్టుకుంటాయోఏమో...చెబితే ఒక తంటా, చెప్పకపోతే మరో తంటా. సీనియర్లు, జూనియర్లు తననుమరీ ఫుట్ బాల్ ఆడేస్తున్నార'నుకుంటూ పెదాలు తడుముకుంటూ గొణుక్కుంటూ కేవీపీ లోపలకు వచ్చాడు.
`చూడు కేవీపీ, నాకీ లెక్కతేలడంలేదు.'
`అదేంటీ, మీరే ఓ లెక్కలమాస్టారాయె...' నసిగాడు కేవీపీ
`కావచ్చు, కానీ ఈ లెక్క రావడంలేదు. అసలు ఎన్ని నందులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? చెప్పు..' సూటిగా అడిగాడు రోశయ్య.
రోశయ్యలో బెత్తంపట్టుకున్న మాస్టారు కేవీపీకి. బుర్రగోక్కున్నాడు.
కేవీపీకి అర్థంకాలా. నందులు ఇచ్చేశాక ఇప్పుడు నందులంటాడేమిటీ ఈయన! పెద్దరికం రావడంతో ఇట్టే మరచిపోతున్నాడేమో...అనుకుంటూ `అదేంటిసార్, నందులు ఇచ్చేశాంగా...'
`ఇచ్చేశారా! ఎప్పుడు? ఎవరికి?' రోశయ్య ప్రశ్నమీద ప్రశ్న సంధించారు.
కేవీపీ నసుగుతూ చెప్పాడు..గుర్తుతెచ్చుకుంటూ, `గమ్యం ...ఉత్తమ చిత్రం, రవితేజ ఉత్తమ హీరో, అరుంధతీ...ఉత్తమ...'
`ఛత్...ఇవికావు నేను అడిగేది, రాజకీయ నందుల గురించి.'
`రాజకీయ నందులా! ఇవిఎక్కడినుంచి వచ్చాయి...!'
`రాలేదు, రప్పించాలి. చూడు మిస్టర్ కేవీపీ, నువ్వుఏం చేస్తావో నాకు తెలియదు. 2009 సంవత్సరానికి వెంటనే రాజకీయ నందులు ప్రకటించాలి. వెంటనే వెళ్ళి పని చూడండి...'
.................... 2 ....................
కేవీపీ బయటకురాగానే తలుపుచాటునుంచీ వింటున్న కొండా సురేఖ కనిపించింది.
`ఏమిటిది? ఛండాలంగా...' అసహనంగా అన్నాడు కేవీపీ.
సురేఖ ముఖం తుడిచేసుకుంటూ,
`ఏంటీ పెద్దాయన పందులూ, గిందులూ అంటున్నాడు.'
కేవీపీకి మరోసారి చికాకేసింది. `పెద్దాయన అన్నది పందుల గురించికాదు, నందుల గురించి. సగం వినీ సగం వినక ప్రతిదీ హడావుడి చేయడం నీకలవాటైపోయింది.'
`నందులా భలేభలే..మళ్ళీ ఎవరికీ...?
`మనకే, అంటే రాజకీయనాయకులు ఇవ్వాలంటున్నాడు.'
`నందులన్నీ ఆయనే కొట్టేద్దామని ఆశదోశ అప్పడం..వడ...'
`ఆపు,నీ మెనూ...ఆయనేం ఈపోటీలో లేరు. అసలు ఆయనే ఒక పెద్దనంది. ఇంకా ఆయకెందుకు నంది...'
`అర్థంకాలా...'
`మరి,అదే, సీనియర్లను గౌరవించడం నేర్చుకో. రోశయ్యకు వైఎస్సారే శివయ్యలాంటివారు. వైఎస్సారీశ్వరునిమీద ఈగలు వాలితేచాలు తన శృంగాలతో పొడిచిపొడిచి చంపేవారు. నందిపాత్ర బాగా పోషించడంతో ఇప్పుడు ఇతరులకు నందులు ఇవ్వాలనుకుంటున్నారు...అదీ స్టోరీ....' చాలా తెలివిగా చెప్పాననుకున్నాడు కేవీపీ.
`హమ్మయ్యా, ఈ పెద్దాయన పోటీలో లేడుకదా...అయితే సంతోషమే. నాకో సందేహం.;
`ఏమిటో చెప్పు....'
`మరణానంతరం కూడా నందీ అవార్డులు ఇస్తారా...?'
`ఈవిషయం రోశయ్య చెప్పలేదు. అయినాఇదేం ప్రశ్న.'
`నా కోరిక తీరాలంటే, కృతజ్ఞతాభావం చెప్పుకోవాలంటే ఇదే చక్కని మార్గం. మరణానంతరం కూడా నందులు ఇస్తే, వైఎస్సార్ సార్ కి పది నందులు రావడం ఖాయం. ఆయన ఎలాగో లేరుకనుక ఆ నందులన్నీ మా జగన్ బాబే అందుకుంటారు. అలా జగన్ షోకేస్ లో పదినందులు చేరినట్టవుతుంది. సీఎం పోస్టు ఇప్పించలేకపోయినా, నందులన్నా ఇచ్చానన్న తృప్తి నాకు మిగులుతుంది'
`ఏడ్డినట్టుంది, నీ రాజకీయం. ఒక నందిలాంటి రోశయ్యనే చూసి జడుసుకుంటుంటే, పది నందులు షోకేస్ లో పెడతావా..చాల్లే పో...'
`సార్ మరో ఆశ...'
`మళ్ళీఏంటీ?'
`అరుంధతిలో నటించిన అనుష్కకు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారుగా, అలాగే నిరంతరం, ప్రతిక్షణం జగన్ సీఎం కావాలంటూ `ఆరంధి' (ఆ యావ)లోనే ఉంటున్న నాకూ స్పెషల్ అవార్డు ఇవ్వకూడదూ...'
`ఆరంధి' ఎక్కవయ్యే, రోశయ్య మాస్టారికి దూరం అయ్యావ్. నంది తరువాత నీ పదివి సంగతి ముందు చూసుకో..'
కేవీపీ పరుగుపరుగునవెళ్ళి రాజకీయ నందుల కోసం జ్యూరి ఏర్పాటు చేశాడు. వారంరోజుల్లో రాజకీయ నందులను ప్రకటించారు.
-కణ్వస