Friday, October 16, 2009

దీపావళి ఏరోజు జరుపుకోవాలి ?

మరో దీపావళి పండుగ వచ్చేస్తోంది. అయితే దీపావళి ఎప్పుడు జరుపుకోవాలంటూ `నారదలోకం' సంపాదకవర్గాన్ని అనేక మంది ఈ-మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా అడుగుతున్నారు. నరకచతుర్దశి ఎప్పుడొస్తుంది? శనివారంనాడు చతుర్దశి అయితే, మరి పండుగ మర్నాడు ఆదివారం అవుతుందికదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తిథులుమారే సమయాలను బట్టీ, పండుగ తలంట్లు, టపాసులు కాల్చుకునే ఆచారవ్యవహారాలనుబట్టిచూస్తే శనివారమే నరక చతుర్దశి అవుతుంది. ఆ రోజు పొద్దున్నే తలంట్లు పోసుకోవాలి. అదే రోజు రాత్రివేళ ఆనందంగా దీపావళి జరుపుకోవడం శుభకరం. ఇప్పటికే రాష్ట్రాన్ని కీడు పట్టిపడీస్తున్న వేళలో ఆదివారం రాత్రి దీపావళి పండుగ జరుపుకోవడం ఏ రకంగా చూసినా మంచిది కాదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. శనివారం తెల్లవారుఝామున పండుగ తలంట్లు పోసుకోవడం శుభకరం. సరిగా ఆవేళలో నరక చతుర్దశి నడుస్తుంటుంది. నరకాసురుడి వధ అనంతరం తలంట్లు పోసుకోవడం మన ఆచారం. ఇక అదే రోజు, శనివారం రాత్రివేళ దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజాదికాలు పూర్తిచేసుకుని టపాసలు కాల్చాలి. బంధుమిత్రులతో కలిసి మధురపదార్ధాలు (స్వీట్స్) ఆరగించాలి.
ఈ ఏడాది తిథులు ఎలా మారాయో, దీపావళి అమావాస్య ఎప్పుడు వచ్చిందో సవివరంగా చూడండి...
  • త్రయోదశి శుక్రవారం మధ్యహ్నాం 2.31తో పూర్తవుతుంది.
  • ఆ తరువాత చతుర్దశి ప్రారంభమై అది శవివారం మధ్యాహ్నాం 12.37 వరకు ఉంటుంది.
  • అంటే శనివారం మధ్యాహ్నం తరువాత అమావాస్య వచ్చేస్తుంది.
  • శనివారం రాత్రి అమావాస్యే అందుకే శనివారమే దీపావళి.
  • ఈ అమావాస్య ఘడియలు ఆదివారం ఉదయం 11గంటల 40 నిమిషాల వరకు ఉంటాయి.
  • ఆ తరువాత కార్తీకమాసం పాడ్యమి మొదలవుతుంది.
  • పైన పేర్కొన్న టైమింగ్స్ భారతకాలమానం ప్రకారం వేసినవి,
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే kanvasas@gmail.comకి మెయిల్ చేయండి.
- కణ్వస

1 comment: