జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని మొదటి భాగంలోనే చెప్పాను. అలాంటి శక్తి బలహీనపడిందంటే, దానర్థం వ్యతిరేక శక్తులు బలోపేతమయ్యాయనే అర్థం చేసుకోవాలి. తాత్కాలిక ముఖ్యమంత్రిగానే రోశయ్య ఉంటారని జగన్ అనుయాయులు అనుకుంటే, అది కాస్తా రివర్సయింది. రోశయ్య మస్టారు సీఎం సీట్ ని ఫుల్ గానే ఆక్రమించేశారు. అంతేకాదు, బెత్తం పట్టుకుని దారికిరాని పిల్లల్ని (మంత్రులను, అధికారులను) లొంగదీసుకునే పని కూడా చేపట్టారు. రోశయ్య ఇలా బలోపేతమవుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరోపక్క బలోపేతమవుతున్నారు.
CBN బలోపేత క్రమం..
వైఎస్సార్ మరణం బాధాతకరమైనదే అయినా, రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరిపోసిందనే చెప్పాలి. వైఎస్సార్ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును నిద్రపోనియ్యకుండా చేశారు. గత ఎన్నికల్లో టిడిపీ ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ వైఎస్సార్ ముందు బెడిసికొట్టాయి. 2014నాటికి టిడిపీని నామరూపాలు లేకుండా చేయాలని వైఎస్సార్ అత్యంత రహస్యంగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే టిడిపీలోని ప్రముఖులను తనవైపు ఆకర్షింపజేసుకునే పని మొదలుపెట్టారు. ఈ ఆకర్షణకే సినీనటి రోజా కూడా పడిపోయింది. సరిగా అలాంటి సమయంలో దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం పాలయ్యారు. రాజకీయంగా ఆలోచిస్తే, ఇది టిడిపీకి నూతన జవసత్వాలను అందించిన ప్రధాన సంఘటనగా మారింది. సంతాప దినాలు పూర్తయ్యేదాకా మాట్లాడకుండా, ఆ తరువాత చంద్రబాబు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆరంభించారు.
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరువు, ఆతరువాత విరుచుకుపడిన వరదలు CBNకు రాజకీయంగా ప్లస్ పాయింట్లై కూర్చున్నాయి. వరదలు రాగానే బాబు చకచకా పావులు కదపడం మొదలుపెట్టారు. తానే సీఎం అయినట్టుగా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారుల్లోని వైఫల్యాలను ఎండగట్టారు. హెలికాప్టర్ లో ఎక్కి ఏరియల్ సర్వేలు నిర్వహించారు. వరదలు రావడానికి ప్రధాన కారణం అధికారుల్లో నిర్లక్ష్యమేనని తేల్చారు. తాను సీఎంగా ఉండగా, వరదలొచ్చినప్పుడు ఎలా స్పందించానో పోల్చి చెప్పారు. కర్నూలు పట్టణాన్ని కేవలం రెండు రోజుల్లో బాగుచేయవచ్చంటూ అసమర్థ అధికార గణాన్ని తూర్పారబట్టారు.
వరద సాయం కోసం చంద్రబాబు నడుం బిగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట నిధులు సేకరించే పనిలో పడ్డారు. అన్నార్తులను ఆదుకునేందుకు నేనున్నానంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల చెక్కును నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడంతో కంగుతున్న చంద్రబాబు ఆ వెంటనే తేరుకుని మేనళ్లుడిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ జూనియర్ (రాజకీయంగా జూనియరే) తన జేబులో నుంచి మరో 20 లక్షలు తీసి ట్రస్టుకు ఇవ్వక తప్పిందికాదు.
తానూ, తన పార్టీ ప్రజల మేలుకే ఉన్నదన్న అభిప్రాయం కలిగించేలా చంద్రబాబు రేయిబవళ్లు కృషిచేస్తున్నారు. ఇంతకాలం రాజకీయంగా తనకు పక్కలో బళ్లెంలా ఉన్న వైఎస్సార్ ఎలాగో లేరుకనుక అందివచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని 2014నాటికి బలోపేతమై అధికార పగ్గాలు చేపట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అదే సమయంలో మరో పక్క సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ముచ్చటపడిపోతున్న జగన్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నిన్నమొన్నటి దాకా ఊగిపోయిన జగన్ సేన `వరద సీన్లో' కనబడటంలేదు. ఒక వేళ కనిపించినా ప్రజాస్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇంకో పక్క సీఎం కావాలని తెగ తపించి సొంతంగా పార్టీ పెట్టుకుని భంగపడిన మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారో కూడా గమనించాల్సిందే...
(చిరంజీవి, కేసీఆర్ వ్యూహాలు తరువాయి భాగంలో)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment