Wednesday, October 14, 2009

రోశయ్యా, ఇలాగైతే ఎట్లాగయ్యా? (పార్ట్-1)

రోశయ్యకు ఐదు పదులకు పైగానే విశేషంగా రాజకీయ అనుభవం ఉంటే ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతటి సంయమనం పాటించాలో, మరెంతటి హుందాగా మసులుకోవాలో ఈ పెద్దాయన వైఎస్సార్ పక్కనే ఉంటూ అన్నేళ్లు రాజకీయ సావాసం చేసినా వొంటపట్టించుకోలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ పెద్దకాపుదారుడిగా ఉన్న రోశయ్య ఆవేశపడినప్పుడల్లా ప్రతిపక్ష సభ్యులు నిరుత్తురలయ్యేవారు. అందుకే రోశయ్యను కొందరు `రోష'య్య అని కూడా చాటుమాటుగా పిలుచుకుంటున్నారు. ఇక పస్తుత విషయానికి వస్తే, రాజకీయంగా ఆయన శిఖరాగ్రానికి చేరారు. వైఎస్సార్ అనూహ్య మరణంతో ఎనభయేళ్లు నిండిన వయసులో ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించింది. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం సీట్లో కూర్చోవాలని తెగ ప్రయత్నిస్తున్న టైమ్ లో అధిష్ఠానం ఆశీస్సులతో రోశయ్య ఆ పదవి దక్కించుకున్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రి సీను ముగిసిన తరువాత రోశయ్యలో ఆవేశం పెరగడం మొదలైంది. మొదటి నుంచి `కట్టె, కొట్టె, తెచ్చే' అన్నట్టుగా మాట్లాడే నైజం ఉన్న రోశయ్య ప్రజారంజకుడు కాలేడన్న విమర్శలు వస్తున్నాయి. ఏ విషయంపైనైనా తెగేసి చెప్పడం, కుండబద్దల కొట్టడం సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి సరిపడదని చెప్పేవారేలేకపోవడంతో రోశయ్య తరచూ పప్పులో కాలేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న నాయకులుగానీ, అనుచరగణంలోని వారుకానీ ఆయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా ఉన్నవాళ్లు కారు. అందుకే ఈ పెద్దాయనకు మనసులోని మాట చెప్పి కొరివితో తలగోక్కోవడం ఎందుకని చాలా మంది నోరుమూసుకుంటున్నారు. ఆమాట కొస్తే, ఈ వ్యాస రచయత వయసు కూడా రోశయ్య రాజకీయ అనుభవమంత లేదు.
అయితే, ఒక సమర్ధవంతమైన ముఖ్యమంత్రి దారితప్పుతున్నప్పుడు, ప్రజలకు దూరమవుతున్నప్పుడు తెలియజెప్పాలన్న బాధ్యతను గుర్తెరిగి ఈ వ్యాసపరంపరకు పూనుకోవడం జరిగింది. పొగడ్తలతో ముంచెత్తే భట్రాజులకంటే, సద్వివిమర్శలు చేసేవారే నయం. మంచి మాటలు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్లు కూడా చక్కని సూచన చేసినప్పుడు దాన్ని పాజిటీవ్ దుక్పథంతో స్వీకరించాలి. రోశయ్య ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. అలా జరగకపోతే అది వైరి వర్గీయులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యకూ, దివగంత నేత వైఎస్సార్ కూ మధ్య ఉన్న తేడాలేమిటో విశ్లేషించుకోవాల్సిందే.
వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడో, లేదా అంతకు ముందు సీఎంగానే మీడియా ముందు మాట్లాడిన సందర్భాలనో పరిగణలోకి తీసుకుంటే రోశయ్య `సీనియారిటీ' ఆయన పాపులారిటీకి అక్కరకు రావడంలేదని అనిపిస్తోంది.
(మిగతా వివరాలు తరువాయి భాగంలో)
-కణ్వస

No comments:

Post a Comment