Tuesday, October 6, 2009

ఎడిటర్స్ వాయిస్: గోరంత సేవకు కొడంత ప్రచారం!

నిన్నటిదాకా లేనిపోని భయాలు సృష్టించి, వరద న్యూస్ తో రేటింగ్ పెంచుకోవాలని చూసిన కొన్ని ఛానెళ్లు (కొన్ని ఛానెళ్లని ఎందుకనాల్సి వస్తుందంటే, ఒకటి రెండు న్యూస్ ఛానెళ్లలో ఇంకా జర్నలిజం ఎథిక్స్ చావలేదుకనుక) ఇప్పుడు వరద బాధితులకు తమ టివీ ఛానెల్ సహాయం చేస్తుందని ఊదరగొడుతున్నాయి. మందిస్తున్న సహాయక కార్యక్రమాలను పదేపదే చూపిస్తూ, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడంలేదన్న భ్రాంతి కలిగేలా చేస్తున్నారు. ఏక సంఖ్యతో ఉండే నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ మొదటి నుంచి వార్తా విశేషాలను రేటింగ్ కోణంలోనే ఇస్తోంది. కర్నూలు బాధితులకు సాయం చేయాని విజ్ఞప్తి చేస్తూ, ఏకంగా ఫ్యాక్షనిస్టులకు మేలుకొలుపు గీతం పాడింది. ఆ మేలుకొలుపు గీతం సారం ఇదే..
`మీరు ఫ్యాక్షనిస్టులుగా హత్యలు చేసి ఉంటారు. నెత్తురు పారించి ఉంటారు.మీ సీమ కష్టాల్లో పడింది. ఇప్పుడు మేలుకొండి. వరద బాధితులకు సాయం చేయండి. మీ పాపాలు కడుక్కొండి.'
ఇలా చెప్పడం వల్ల కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కత్తులు, బాంబులు ఓ మూలకు విసిరేసి బుద్ధిగా టాటా సుమోలెక్కి సదరు టివీ ఛానెల్ ఆఫీసుకు రయ్యిమంటూ వచ్చేసి సదరు ఛానెల్ సీఈఓ దగ్గర చెంపలు వాయించుకుని కోట్లు కుమ్మరింస్తారని నెంబర్ వన్ ఛానెల్ భ్రమించి ఉండవచ్చు. మీ పాపాలు కడుక్కొండి అంటూ నీతి వాక్యాలు వల్లించిన వాళ్లలో చాలా మంది ఫ్యాక్షనిస్టులకంటే అత్యంత ప్రమాదకరమైన కేపటలిస్టులే. నిజానికి ప్రస్తుతం అత్యంత గౌరవప్రదమైన జర్నలిజం క్యాపటలిజం చేతిలో నలిగిపోతున్నది. క్యాపటలిస్టులు జర్నలిస్టుల ముసుగులో అందిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారన్నది `జగ'మెరిగిన సత్యం.
మరో ముఖ్యమైన విషయం ఏమంటే, నెంబర్ వన్ ఛానెల్ నుంచి నిన్న మొన్న పుట్టిన `పుల్ల' ఛానెల్ దాకా చాలా మటుకు గోరింత సాయం చేస్తూ కొడంత ప్రచారం చేసేసుకుంటున్నాయి. అసలు ప్రభుత్వం కంటే తామే ఎక్కువ సాయం చేసేమన్న భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక టివీ రిపోర్టర్ ఓ మహిళామంత్రిని ఇదే విషయంపై ప్రశ్నిస్తూ, `మీ కంటే మేమే ఎక్కువ సాయం చేస్తున్నాం...మేము సాయం చేస్తున్న చోట్ల అధికారులు కనబడటంలేదు. ఇది అధికారుల వైఫల్యం కాదా?' అంటూ తన తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళా మంత్రి చాలా కూల్ గా సమాధానమిస్తూ, `మీ టీవీల వాళ్లు మమ్మల్ని అడిగే వెళుతున్నారు. మా అధికారుల సాయం తీసుకునే మీ వాళ్లు పనులు చక్కబెట్టుకుంటున్నారు. అధికార వైఫల్యం అన్నదే లేదు. ఎవరన్నా సాయం చేయడానికి వస్తే, వాళ్లు బాగా చేస్తుంటే అధికారులు మరో చోటకు వెళుతుంటారు. ఇదే జరుగుతోంది...' దీంతో అవాక్కవడం రిపోర్ట్ వంతైంది.
వరద సాయంగా చెక్కులు, నగదు పంపించాలంటే నేరుగా టివీ ఆఫీస్ కు పంపించవచ్చంటూ ఒకటి రెండు ఛానెళ్లు ఊదరగొట్టాయి. తమ పేరిటే చెక్కులు, డ్రాఫ్ట్ లు పంపమన్నారు. అయితే ఇదే సమయంలో మరో ఛానెల్ మాత్రం తమ పేరిట కాకుండా నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట క్రాస్డ్ చెక్ తమ కార్యాలయానికి పంపిస్తే వాటిని సీఎంకు అందజేస్తామంటూ తనలోని నిజాయితీని చాటుకోవడం గమనార్హం.

2 comments:

  1. వెల్

    చాలా బాగా వ్రాసారు

    ReplyDelete
  2. I agreed your comments, these capitalist channels should be seriously punished

    ReplyDelete