Thursday, October 1, 2009
దిమ్మ తిరిగింది...
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న బస్సు దహనాలు, సోనియా గాంధీ చిత్రం చించివేత వంటి ఘటనలతో కాంగ్రెస్ అధిష్ఠానం వైఎస్ జగన్ అనుకూల శిబిరంపై గురిపెట్టింది. ఇందులో భాగంగా తాము నియమించిన ముఖ్యమంత్రి రోశయ్యను ధిక్కరిస్తున్న స్వరాల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాజీనామా బెదిరింపులకు భయపడి ఒక వ్యక్తికోసం అనుకూల నిర్ణయం వెలువరించే ప్రసక్తే లేదని కేంద్రస్థాయి నాయకులతో తేల్చి చెప్పించింది. నాయకత్వ మార్పులను అధిష్ఠానం చూసుకుంటుందని, దానిపై చర్చించాల్సిన అగత్యం ప్రస్తుతం లేదని వెల్లడించింది. ఈ పరిణామం జగన్‌కు మద్దతు ఇస్తున్న వర్గాన్ని కుదేలు చేసినట్లు కనిపిస్తోంది. తాము ఒత్తిడి పెంచేకొద్దీ అధిష్ఠానం మరింత దృఢ వైఖరిని ప్రదర్శించడం జగన్ అనుకూల వర్గానికి మింగుడు పడటం లేదు. వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న కొందరు ఎమ్మెల్యేలు తమ స్వరాన్ని సవరించుకుంటున్నారు. తాము వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బావుంటుందని చెప్పాం కానీ... ఆయననే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తేలేదని క్రమంగా జారుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన షాక్‌ను పసిగట్టిన జగన్ వర్గం దిద్దుబాటు చర్యలుకు ఉపక్రమించింది. గత 15 రోజులుగా పీసీసి చీఫ్ డి. శ్రీనివాస్ మాటను ఖాతరు చేయకుండా సభ్యత్వ నమోదులను అడ్డుకుంటున్న కార్యకర్తల జిల్లాలకు వైఎస్ జగన్ స్వయంగా వెళ్లనున్నట్లు భోగట్టా. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తానే స్వయంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలందరూ కట్టుబడి ఉండాలని తొలిసారిగా సోనియా పేరును ప్రస్తావిస్తూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో సోనియాగాంధీకి తెలుసు. ఈ పరిస్థితిలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికే మనందరం కట్టుబడి ఉండాలి. అంతేగానీ పార్టీని అప్రతిష్టపాలుచేసే ఎటువంటి చర్యకు పాల్పడరాద"ని వైఎస్ జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనిని బట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిమాండ్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ తన మకాన్ని బెంగళూరు నుంచి రాష్ట్రరాజధానికి మార్చుకోవడాన్ని చూస్తే... ఇకపై జగన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలలో వైఎస్సార్ పట్ల ఉన్న సానుభూతి పవనాలను తను ముఖ్యమంత్రి అయ్యేవరకూ సజీవంగా ఉంచుకునేందుకు ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్ పర్యటన చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment