Sunday, October 18, 2009

సెటైర్ : సూక్తుల కేసీఆర్!

విలేఖరి లంబు తెలంగాణభవన్ వైపు ఓసారి చూశాడు. ఎందుకో ఆ భవన్ ని చూడగానే అతగాడికి అరుంధతి సినిమాలోని పాడుపడ్డ కోట గుర్తుకువచ్చింది. భవన్ వైపు అడుగులు వేయాలంటే భయపడుతున్నాడు. ఎప్పుడు దగ్గరకు వెళ్ళినా లోపలి నుంచి కేసీఆర్ మాటలు కర్ణకఠోరంగా వినబడుతుండేవి. ఆ ముచ్చట యాదవగానే లంబు చెవుల్లో కేసీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ లు వినిపించసాగాయి....
`ఓరేయ్...రారా...ఇన్నాళ్లుగా తెలంగాణ ఇవ్వకుండా కుళ్లబెట్టి, బొందపెట్టి మీరు కులుకుతార్రా...రండిరా...ఓసేయ్ బొమ్మాళీ...(ఈవెడవరో! సోనియానా?) తెలంగాణ ఇవ్వకుంటే నిన్నునేను వదలా...వదలను బొమ్మాళీ వదల. ఓరేయ్ రా... అడుగుముందుకేయ్. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీ బొందకు దగ్గరవుతుందిరా...నిన్ను వదలా...నీకు బొందపెడ్తా...పాడికడ్తా...రారా..రా...'
అందుకే లంబుకు తెలంగాణభవన్ కు వెళ్లాలంటే భయం. కానీ ఏంచేస్తాడు పాపం. ఎడిటర్ హుకం చేశాడయె...`వెళ్ళు, తెలంగాణభవన్ కు వెళ్ళు. కేసీఆర్ ప్రెస్ మీట్ పట్టాడు. ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడట...వెళ్ళి కవర్ చేయ్..'
ఇక, గతిలేక లంబు తెలంగాణభవన్ వైపు భయంభయంగా అడుగులువేసుకుంటూ వెళ్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చేసరికి దుర్గంధం స్థానే సుగంధం ముక్కుపుటాలకు సోకింది. మళ్ళీ అరుంధతి సినిమా గుర్తుకువచ్చింది. భయంగా చూశాడు. `ఇది భ్రాంతికాదుకదా...' అనుకుని ఒళ్లు గిల్లుకున్నాడు. కాదు, నిజమే...పరిమళ అగర్ బత్తి వాసనలు వస్తున్నాయి. అంతలో కేసీఆర్ ఒక సాధుపుంగవునిలా, శాంతమూర్తిలా ఎదురుపడ్డారు.
`రావోయ్ లంబు రా... ఎంటీ సంగతులు?'
`అదేంటి సార్....అది నేను అడగాల్సిన ప్రశ్న'
`అంతా బాగున్నారా?'
`సార్! మళ్ళీ నేను అడగాల్సిన ప్రశ్న వేస్తున్నారు. సార్, మీ పార్టీలో అంతా బాగున్నారా?'
`లోకాంసమస్తాం సుఖినోభవంతు'
`అదేంటీసార్! మీనోట సంస్కృతం...'
`దీని అర్థం తెలుసా?'
`అంటే, కొద్దిగా తెలుసు సార్..పూర్తిగా...'
`నేను చెప్తా రాస్కో...ఈ లోకాలన్నీ చల్లగా ఉండాలి. ఎవ్వరూ కొట్టుకోకూడదు. గిల్లుకోకూడదు'
`అంతా కలిసిఉంటేనేకదా సార్...చల్లగా ఉండేది. కలిసిఉంటే కలదు సుఖం అని కూడా మనవాళ్లు అన్నారుగా. అలాంటప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎందుకు సార్?' అమాయకంగా అడిగాడు లంబు.
`అది ఉద్యమం. ఆగదు. ఇది సూక్తి ... సాగుతూనే ఉంటుంది.'
ఈసారి లంబుకి నిజంగానే అర్థంకాలేదు. బుర్రగోక్కున్నాడు.
`యత్రనారీ పూజ్యంతు తత్ర...'
`మళ్లీ, ఇదేంటీసార్...!?'
`అంటే, ఎక్కడ మహిళలు పూజింపబడుదురో...'
`ఆంధ్ర ఉద్యోగులను మరెందుకు వెళ్లగొడుతున్నారు సార్. అందులో మహిళలు కూడా ఉన్నారుగా...'
`అది ఉద్యమం. నీకో విషయం తెలుసా... నిప్పులు చిమ్మతు నింగికి నేనెగిరితే నిభిడాశ్చర్యంతో వీరే...నెత్తురు కక్కుతూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే... ఇక్కడ వీరే అంటే...'
మళ్ళీ ఇదేంటీసార్...!
`అలజడి మన జీవితం కావాలి, ఆందోళన మన ఊపిరి కావాలి. తిరుగుబాటు మన వేదాంతం కావాలి...'
`సార్...మీకేమైందిసార్?'
కేసీఆర్ పాతసినిమాలోని పాట అందుకున్నాడు...
`నమ్మరే, నేను మారానంటే నమ్మరే...నేనొకనాడు...'
`నమ్ముతాం సార్...నమ్ముతాం. ఆపండిసార్ మీ పాట..'
`అయితే, ఈ కవిత విను...చిరకాలం జరిగిన మోసం...బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు...ఇంకానా ఇకపై సాగవు.'
కేసీఆర్ సూక్తులకూ, కవితలకు లంబు భయపడి ఒక్క గెంతుగెంతాడు. మెట్లు ఎక్కాడో, జారాడో తెలియదు. తలుపులు తోసుకుని వచ్చాడో, లేక విరగ్గొట్టుకు వచ్చాడో అంతకన్నా తెలియదు. క్షణాల్లో బయటకువచ్చేశాడు. ఆ పాత బూతులకంటే, ఈ కొత్త కవిత్వాలు వినడం మరీ కష్టమనిపించింది. అంతే, ఉరుకో..ఉరుకు. వెనక నుంచి...తెలంగాణ భవన్ నుంచి ఇంకా సూక్తులు, శ్లోకాలు వినబడుతూనే ఉన్నాయి...
కణ్వస

5 comments:

  1. మంచిగా చెప్పినారు సార్

    ReplyDelete
  2. ఏ ఎండకా గొడుగు. ఇదేగా ఆయన నినాదం, ఆయన ఉద్యమం. బాగా రాశారు.

    ReplyDelete
  3. ఆంధ్రోళ్ళు KCR పై రాయటం మామూలే... ఉద్యమం పై, ఆయనపై మీ సొల్లు ప్రసంగాలు ఆపండి.... పడితే లేచే కెరటం ఆయన...

    ReplyDelete
  4. KCR చేతకానివాడైతే తెలంగాణా వ్యతిరేకులకి లాభం. తెలంగాణా వ్యతిరేకులు అందుకు సంతోషించకుండా KCR గురించి ఇంతగా పట్టించుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. I am not anti-Telangana and I also know about hidden intentions that are in the minds of coastal Andhra people.

    ReplyDelete