Saturday, October 17, 2009

సెటైర్: ఒబామా నోబెల్ వెనుక బుష్ హస్తం?!

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మేథావులు బుర్రలుగోక్కుంటున్నారు. తనకు నోబెల్ శాంతి ప్రైజ్ వస్తే వీళ్లంతా ఇంతలా బుర్రెందుకు గోక్కుంటున్నారో ఓ పట్టాన ఒబామాకు అర్థంకాలేదు. ఆమాటకొస్తే, తన పేరు నోబెల్ జ్యూరీ ఎందుకు సెలెక్ట్ చేసిందో కూడా నల్లజాతి శ్వేతసౌధాదీశునికి అర్థంకావడంలేదు. వెంటనే ఫోన్ అందుకున్నాడు. ప్రపంచ పటంలో తనకు గర్తున్న దేశాల అద్యక్షులకూ, ప్రధానులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, అర్జెంటీనా, చైనా...ఇలా ఆయా దేశాల అధినేతలను అడిగాడు. ఏమిటో వాళ్లు చెప్పిందేదీ మన బ్లాక్ చాంపియన్ కి సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏ దేశాలున్నాయా...అని ఆలోచిస్తుంటే, వెంటనే మొన్నీమధ్యనే జి-20 దేశాల సమావేశాల్లో కలుసుకున్న భారత ప్రధాని మన్మోహన్ చటుక్కన గుర్తుకువచ్చారు. అంతే ఢిల్లీకి ఫోన్ కలిపాడు.
ఒబామా: గుడ్ మార్నింగ్ మన్మోహన్ సింగ్ జీ.. నాకో సందేహం.
మన్మోహన్: ఆఁ..ఆఁ...గుడ్ ఈవినింగ్... త్వరగా చెప్పండి, అవతల మేడం సోనియా పిలుస్తున్నారు?
ఒబామా: అదే, అర్థమైచావడంలేదు.
మన్మోహన్: ఏమిటీ, చావడం అర్థంకావడంలేదా...?
ఒబామా: చావడం కాదు, రావడం... అదే, నోబెల్ ప్రైజ్ నాకెందుకు ఇచ్చారో అర్థం కావడంలేదు.
మన్మోహన్: అదా! నీ బండపడ... ఇందులో అర్థంకాకపోవడానికి ఏముందీ...జార్జి బుష్ వల్లనే కదా నీకీ అవార్డు వచ్చింది.
ఒబామా: అదేంటీ, జార్జి బుష్ నాకు శత్రువు, ఆయన వల్ల నాకు నోబెల్ ప్రైజ్ రావడమేమిటీ? అర్థంకాలా, కాస్తంత వివరంగా చెప్పండి. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా...
మన్మోహన్: అసలు కథ చెప్పాలంటే, మనం ఆరువేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.
ఒబామా: యూమీన్..సిక్స్ థౌజండ్ ఇయర్స్...!
మన్మోహన్: అవును, సిక్స్ థౌజండ్ ఇయర్సే. అప్పట్లో మా ఏరియాలో ద్వాపరయుగం నడిచేది. ఆకాలంలో నరకాసురుడు అనే ఓ విలన్ ఉండేవాడు. వాడు భూమ్మీద శాంతిలేకుండా చేశాడు. యుద్ధాలేయుద్ధాలు. చావులేచావులు. భూమికి పెనుముప్పుగా మారాడు.
ఒబామా: ఓహ్ఁ...ఈజిట్?
మన్మోహన్: ఎస్, ఇటీజ్ ...ఇక అప్పుడు శ్రీకృష్ణుడు తన వైఫ్ సత్యభామతో కలిసి వార్ కి వెళ్ళాడు. నరకాసురుణ్ణి వధించి ప్రపంచానికే పీస్ తీసుకొచ్చాడు. జనం ఆనందంగా దీపావళి చేసుకున్నారు.
ఒబామా: ఓహ్ఁ... గ్రేట్. కానీ, నాదో డౌట్. ఈ కథకీ, నా నోబెల్ కీ ఏమిటట సంబంధం?
మన్మోహన్: వస్తున్నా, అక్కడికే వస్తున్నా... ఒక వ్యక్తి హీరో కావాలన్నా, లోకరక్షకునిగా మారాలన్నా, అతనే గొప్పవాడవ్వాల్సిన పనిలేదు. అతని శత్రువు లోకకంఠకుడు అయితే చాలు. అలాంటి ఎనిమీని ఓడిస్తే, అఖండ కీర్తి అందుకోవడం ఖాయం. ఇదే ఈ కథలోని నీతి.
ఒబామా: అర్థంకాలా...
మన్మోహన్: (మనసులో) వీడికెవడ్రా ఇచ్చింది నోబెల్ ప్రైజ్. (పైకి) మీ ఏరియాలో బుష్ లేడూ, వాడూ, నేనిప్పుడు చెప్పిన కథలోని నరకాసురుడు ఒకటే టైప్. ఇప్పుడు అర్థమైందా...
ఒబామా: అంటే, బుష్ వల్లనే నాకు నోబెల్ వచ్చిందా?
మన్మోహన్: ఎస్. ఇదే కరెక్ట్. బుష్ యుద్ధాలు చేసి, సిటీలనుకూల్చి, ఆర్థికమాంద్యం తెచ్చేసి, టెర్రర్ పెంచి ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేశాడు.
ఒబామా: ఎస్..ఇదీ కరెక్టే... నా ఎన్నికల ప్రచారంలో ఇదే ఘాటుగా చెప్పాను.
మన్మోహన్: అదీ సంగతి, అలా నువ్వు ఘాటుగా బుష్ ను తిట్టబట్టీ, ఓడించబట్టీ, నోబెల్ జ్యూరీ వాళ్లకు నచ్చేసి నీకు నోబెల్ శాంతి ప్రేజ్ ఇచ్చారు.
ఒబామా: మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అయితే మన్మోహన్ జీ... మీరు నాకో మాటివ్వాలి.
మన్మోహన్: ఏంటది? త్వరగా చెప్పు, మేడం కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు.
ఒబామా: ఈ విషయం అమెరికన్ మీడియాకు చెప్పకండి. ప్లీజ్.

- కణ్వస

No comments:

Post a Comment