Thursday, October 8, 2009

పోకస్: బలహీనపడిన జగన్ - 1

 వైఎస్సార్ తనయుడు, పార్లమెంట్ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డి నిజానికి ఒక వ్యక్తి కాదు. అతనో శక్తి. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వైఎస్సార్ మరణానంతరం సీఎంగా జగన్ నే చూడాలని అనేకులు కోరుకున్నమాట కూడా నిజమే. మొదట్లో అనుకూల పవనాలు వీచినా ఆ తరువాత అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడంతో రాజకీయంగా జగన్ బలహీనపడటం మొదలైంది. జగన్ సేనలో కూడా మొదట్లో ఉన్న ఉత్సాహం, పట్టుదల క్రమేణా తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు.
 ముఖ్యమంత్రి పదవన్నది వారసత్వంగా వచ్చేది కాదని తెలిసినప్పటికీ,  వైఎస్సార్ వారసునిగా జగన్ నే ఆ సీట్లో కూర్చోబెట్టాలన్న పట్టుదల రాష్ట్రంలో శ్రుతిమించింది. ఎక్కడా, ఏ నలుగురు మాట్లాడుకున్నా జగన్ సీఎం అవుతాడా? కాదా? అన్న ప్రశ్నలే తలెత్తాయి. వైఎస్సార్ భౌతిక కాయం ఇంకా ఇడుపులపాయకు కూడా చేరకుండానే వ్యూహాత్మకంగా జగన్ ని సీఎం చేసే బృహత్తర కార్యక్రమం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే వైఎస్సార్ అనుంగు మిత్రుడు కేవీపీ ఢిల్లీ చుట్టూ బలపం కట్టుకుని మరీ తిరిగారు. మొదట్లో సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆ తరువాత బిగదీసుకోవడం మొదలెట్టింది. రోశయ్యను తాత్కాలిక మఖ్యమంత్రిగానే మొదట్లో భావించినా ఆ తరువాత మనసుమార్చుకుని `తాతయ్య'కే సీఎం సీటు ఖరారు చేయడంతో జగన్ వర్గీయులు కంగుతిన్నారు. దీంతో జగన్ బలహీన పడ్డాడు.
 చాలా ఆశ్చర్యకరమైన పరిణామమేమంటే, వైఎస్సార్ మరణానంతరం జగన్ బలహీనపడుతుంటే, మరో పక్క నలుగురు రాజకీయ ఉద్దండులు బలపడటం. వారిలో మొదటి వ్యక్తి రోశయ్య.
  వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడూ, ఇప్పుడూ అధిష్ఠానం మాటకే కట్టుబడిఉండే తత్వంగల ఈ కాంగ్రెస్ తాతయ్య ఒక్కమాటలో చెప్పాలంటే అధిష్ఠానం చేతిలో కీలుబొమ్మ. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అధిష్ఠానం ఎవ్వరిని సీఎం సీట్లో కూర్చోబెట్టినా తాను వారికి పూర్తి మద్దతు ఇస్తానంటూ చాలా లోక్యంగా సెలవిచ్చారు. రాష్ట్రాన్ని వరద బీభత్సం చుట్టుముట్టినా తనకున్న పాలనాచాతుర్యంతో తొట్రుపాటుపడకుండా రోశయ్య అత్యంత సమర్థవంతంగా సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు. వాస్తవ పరిస్థితులను కుండబద్దలుకొట్టినట్టు చెప్పేతత్వంగల రోశయ్య విషయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా గురి కుదిరినట్టే ఉంది. వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికని సోనియా వచ్చినప్పుడు రోశయ్య మాస్టారికి కితాబు ఇచ్చినట్టు సమాచారం అందింది. మేడం సోనియా పూర్తి ఆశీస్సులు ఉండబట్టే రోశయ్య వైఖరిలో మార్పు వచ్చింది. అందుకే పోలీస్ అధికారుల శాఖలను బదలాయించారు. వివాదాస్పద వ్యక్తులైన యూదవ్ వంటి వారిని దూరం నెట్టేశారు. జవాబుదారీతనం, పారదర్శకత పట్ల విశ్వాసం ఉన్న అధికారులను దరికిచేర్చుకున్నారు. అలాగే రేపోమాపో మంత్రివర్గాన్ని తనకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరించుకోవచ్చు. జగన్ ని చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయి ప్రేలాపనలు ఆడిన కొందరికి ఉద్వాసన తప్పేలాలేదు.
 రోశయ్య అతి త్వరలోనే మరోపని కూడా చేయబోతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాప్రయోజన పథకాలకు అవుతున్న వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత వెళుతున్నదీ, అలాగే, కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ప్రజలకు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పత్రికా ప్రకటన కూడా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాలంలోనూ, ఆ తరువాత కూడా రాష్ట్ర పజల్లో  సరైన అవగాహన లేక పథకాలన్నీ రాష్ట్ర ఖజానా నుంచే వస్తున్నాయన్న భ్రాంతి ఏర్పడింది. ప్రజలను ఈ భ్రాంతి నుంచి బయటపడేయాలని ఇప్పుడు రోశయ్య మాస్టారు లెక్కలు చెప్పాలనుకుంటున్నారు. దీని వల్ల కేంద్రం నుంచి ఎంత భారీగా సాయం అందుతుందన్న విషయం పజలకు కళ్లకుకట్టినట్టు కనబడుతుంది. ఈ వాస్తవాలు తెలియకనే చాలా మంది కేంద్ర ప్రభుత్వాన్నీ, దాన్ని వెనుక నుంచి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని (అధిష్ఠానాన్ని) చులకనచేసి మాట్లాడుతున్నారనీ, అందుకే వాస్తవాలు తెలియజెప్పి అధిష్ఠానం గొప్పదనాన్ని చాటిచెప్పాలని ఢిల్లీ నుంచి కబురు రావడంతో ఇక్కడ సీనియర్లలో కదలిక వచ్చింది. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ జలయజ్ఞంలో నాలుగైదు పథకాలను జాతీయ పథకాలుగా గుర్తించాలన్నా, అభయహస్తం మొదలుకుని రుణమాఫీల దాకా అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాల వెనుక కాంగ్రెస్ అధిష్ఠాన హస్తం ఉన్నదని చాటిచెప్పేందుకే రోశయ్య నడుం బిగించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంత మంది అడ్డుతగిలినా తన సీటు పదిలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే రోశయ్య అధిష్ఠానం ఆశీస్సులతో ఈ ఫార్ములాను ఎంచుకున్నారు. రోశయ్యేనే 2014 వరకు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. అందుకే వయసు పైబడినా రోశయ్య మాస్టారు శ్రమఅనుకోకుండా పనులు చక్కబెట్టుకుంటున్నారు.
 జగన్ బలహీన పడటానికి రోశయ్య ఒక్కరే కారణం కాదు. మరో ముగ్గురు (చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి)కూడా కారణభూతులే. ఇలాంటి సంకట స్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు? రాజకీయంగాఎలాంటి ఎత్తులు వేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.
    (ఆ వివరాలు తరువాయి భాగంలో..)
- కణ్వస

3 comments:

  1. అలానే - ఈ మధ్య దాకా ముక్కు మూసుకు జపం చేసిన ప్రతి పక్షాలన్నీ, ప్రజా స్రవంతి లోకి రావటం, ప్రభుత్వాన్నో, అధికారుల్నో విమర్శించడం, వరద బాధితుల ను పరామర్శించడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం - అసలు వార్తల్లోకి రావడం, ఆనందం కలిగించే విషయం. ఇదీ ఈ మధ్య లో వచ్చిన మార్పే ! వై. ఎస్. ఉన్నాన్నాళ్ళూ - ఈ ఉత్సాహం ఎందువల్ల కొరవడిందో మరి ?!

    ReplyDelete
  2. సీనియర్ ఐన రోసయ్య ను ముఖ్యమంత్రి గా చేసి అధిష్టానం చాలా మంచిపని చేసింది.లేకపోతే వాళ్ళ లో వాళ్ళే గొడవలు పడతాఉందురు.

    ReplyDelete
  3. Nice post ..

    btw, meeru great andhra ki raastaara ??

    ReplyDelete