ఒకవేళ జగన్ కోరికను మన్నించి సోనియా పిలుపు పంపించినా ఉభయుల మధ్య మర్యాదపూర్వకంగానే భేటీ ఉండవచ్చు. అంతకు మించి ఏదో ఊహించడం అత్యాశే అవుతుంది. తండ్రి మరణానంతరం మొదటిసారిగా ఢిల్లీకి వచ్చారుకనుక జగన్ కోరికను మేడం మన్నించవచ్చు.
జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయానికి సోనియా అక్కడలేరు. ఆమె ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. అది ముగించుకుని గురువారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. వచ్చీరాగానే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి సమీక్షిస్తారు. అవసరాన్నిబట్టి వ్యూహరచనలు చేసే పనిలో పడతారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా, ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీతో పంచుకునే విషయంపైనా ఇప్పటికే కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తలనొప్పిల నడుమ జగన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరిక, లేదా అభ్యర్థన విషయం తెరమరుగు అవుతుంది.
అంతా అనుకూలంగా ఉంటే శుక్రవారం మాత్రమే జగన్ మేడం సోనియాను కలిసే అవకాశం ఉంటుంది. ఆ భేటీ కూడా కేవలం నిమిషాల్లోనే పూర్తి కావచ్చు. పరామర్శలకే పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
-కణ్వస
No comments:
Post a Comment