Saturday, October 3, 2009

సెటైర్: చూస్తూనే ఉండండి టివీ 99

టివీ  99 న్యూస్ ఛానెల్ లో మళ్ళీ వార్తలొచ్చేస్తున్నాయ్. అసలే వానలు, ఆపైన వరదలు రావడంతో జనం కూడా రాత్రంతా టివీ సెట్లకే అంటిపెట్టుకున్నారు. టివీ 99 న్యూస్ యాంకర్ బ్రహ్మం స్క్రీన్ మీదకొచ్చేసి తన సహజధోరణిలో ఓ నవ్వునవ్వేసి, కర్నూలు ప్రతినిధి శ్రీరామ్ ని లైన్లో కలిపాడు.
బ్రహ్మం; హలో శ్రీరామ్,శ్రీరామ్: .....
బ్రహ్మం; వినబడటంలేదా... శ్రీరామ్...శ్రీరామ్
శ్రీరామ్: అడగండి బ్రహ్మం, (తనలో) అడిగేవాడికి చెప్పేవాడికి లోకువేగా.
బ్రహ్మం; కర్నూలులో వరద పరిస్థితి ఎలా ఉంది?
శ్రీరామ్: ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావ్ బ్రహ్మం. రాత్రంతా అడుగుతూనే ఉన్నావ్. చెబుతూనే ఉన్నా.
బ్రహ్మం; తప్పదు శ్రీరామ్. ఎప్పటికప్పుడు వార్తలందిస్తామని మనం కమిటయ్యాం.
శ్రీరామ్: ఎవడినడిగి కమిటయ్యారట. ఇక్కడ కాళ్లవరకు నీరొచ్చి తడిసిపోతుంటే.
బ్రహ్మం: చాలా చక్కని విషయం చెప్పావ్ శ్రీరామ్. మా ప్రతినిధి కాళ్లవరకు నీళ్లొచ్చాయ్. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు మీకందిస్తుంటామ్..ఇప్పుడో చిన్న బ్రేక్.
.. బ్రేక్....బ్రేక్...బ్రేక్...
బ్రహ్మం; వెల్ కమ్ బ్యాక్. ఆఁ చెప్పు శ్రీరామ్. కాళ్లకిందకు నీళ్లొచ్చాయ్ అని చెప్పావ్. ఇక్కడ మన ఎనలిస్ట్ బట్టతల బాపూరావ్ కాచుకుని ఉన్నార్. చెప్పు..చెప్పు...
శ్రీరామ్: నా చెప్పుతెగి నేనేడుస్తుంటే, మధ్యలో వాడూ వచ్చాడూ...సర్లే, ఆఫీస్ ఉప్పుతింటున్నాక చెప్పక తప్పుతుందా... అడగండి.
ఎనలిస్ట్ బాపూరావ్: చూడు శ్రీరామ్. కాళ్లవరకు నీళ్లొచ్చాయని చెప్పావ్. అరికాళ్లవరకా...మోకాళ్ల వరకా?
శ్రీరామ్: మోకాళ్లవరకు.
ఎనలిస్ట్ బాపూరావ్: కుడిమోకాలా, ఎడమమోకాలా?
శ్రీరామ్: రెండు మోకాళ్లురా..నీ యవ్వాఁ...
బ్రహ్మం: కూల్ డౌన్ శ్రీరామ్... కూల్ డౌన్. ఇంతకీ బాపూరావ్ గారు ఎందుకని ఆ ప్రశ్న వేశారో వారినే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బాపూరావ్.
ఎనలిస్ట్ బాపూరావ్: ఇప్పటికే మోకాళ్ల వరకు నీళ్లొచ్చాయంటే, మరో రెండు గంటల్లో మీ వాడి బొడ్డుదాకా కూడా నీళ్లు రావచ్చు. ఇన్ నైంటీన్ సెవంటీ సెవన్ లో దివిసీమలో కూడా...
బ్రహ్మం: బాపూరావ్ గారూ మీ ఎనాలసిస్ ఆపండి. ఇప్పుడొక కాలర్ మనకోసం ఎదురుచూస్తున్నారు. హలో...హలో చెప్పండి...
కాలర్: ఇందాకటి నుంచి  కర్నూల్ జిల్లా ప్రజల గురించి చెప్పకుండా మీ ప్రతినిధికి కాళ్లకిందకు నీళ్లొచ్చాయా, ఏ మోకాలు తడిసిందని చర్చ పెడతారా...ఆయ్ఁ... పనిలేని ఆ బట్టతల బాపూరావ్ గాడ్ని ఎందుకు పిలిచార్రా...నీ యవ్ఁ
.... బీప్...బీప్....
బ్రహ్మం: లైన్ కట్టయింది. మరో కాలొచ్చేలోపు శ్రీరామ్ ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పు శ్రీరామ్. పిల్లలెలా ఉన్నారు?
శ్రీరామ్: నా పిల్లల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాను.
బ్రహ్మం: మనది న్యూస్ మీడియా శ్రీరామ్. మైక్ మందు మాత్రం  అందరి గురించే చెప్పుకోవాలి. సరే, మన కెమేరామన్ ఎలా ఉన్నాడు?
శ్రీరామ్: వాడా, కేమేరాను దండానికి కట్టి ఎప్పడో సురక్షిత ప్రాంతానికి చెక్కేశాడు.
బ్రహ్మం; ఆఁ, ఒకే...ఒకే. సరే, ప్రజలేమనుకుంటున్నారు?
శ్రీరామ్: కనబడితే తంతామంటున్నారు, బ్రహ్మం.
బ్రహ్మం: ఎవర్నీ! అధికారుల్నా?
శ్రీరామ్: కాదెహెఁ. మనల్నే.
బ్రహ్మం: (కట్ చేస్తూ) ఒకే, ఒకే శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం. సరే, చివరి మాటలు చెప్పేసేయ్.
శ్రీరామ్: (తనలో) ఓహ్ఁ, ఇదొకటి ఏడ్చింది కదూ...(బిగ్గరగా) కెమేరాను దండానికి కట్టేసి పారిపోయిన కేమేరామన్ ప్రకాష్ తో పారిపోవడానికి సిద్ధమైన శ్రీరామ్. టివీ 99 కర్నూలు.

- కణ్వస

3 comments:

  1. చాలా బావుంది VERY HILARIOUS

    ReplyDelete
  2. > రెండు మోకాళ్లురా..నీ యవ్వాఁ...
    lol

    ReplyDelete
  3. నవ్వలేక చస్తున్నాను ఈ పోస్ట్ చదివి.... సూపర్ గా రాస్తున్నారు.... కంటిన్యూ చేయండి... మనఃస్పూర్తిగా నవ్వుకుంటాం

    ReplyDelete