Monday, October 5, 2009

ఫోకస్:ముఖ్యమంత్రి రోశయ్యా, చంద్రబాబా?!

 గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తలెత్తకమానదు. వైఎస్సార్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినమాట నిజమే కావచ్చు. కానీ వాలకం చూస్తుంటే రోశయ్య కంటే మరో ముగ్గురు తామే సీఎంలమైనట్టు ఫీలైపోతున్నారు. తాత్కాలిక ముఖ్యమంత్రి అన్న ముద్ర నుంచి బయటపడి తన పదవిని స్థీరకరించుకోవడానికి ఒక పక్క రోశయ్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే, మరో పక్క ముగ్గురు నేతలు (వేరువేరు పార్టీలకు చెందిన వారు) సీఎంలైనట్టు ప్రవర్తిస్తున్నారు. దీంతో అసలు ముఖ్యమంత్రి ఎవరన్న అనుమానం వచ్చేలా పరిస్థితి తలెత్తింది. సీఎంలా ఫోజులిచ్చేస్తున్న ఆ ముగ్గురి వివరాలు ఇవి...
 చంద్రబాబు నాయుడు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు ఈ మధ్య చాలా హుషారుగా ఉన్నారు. వైఎస్సార్ మరణానంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలను పార్టీ పరంగా `క్యాష్' చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తాజాగా వరద పరిస్థితిని సైతం తనకు అనుకూలంగా మలచుకునేందుకు నడుం బిగించారు. తానే సీఎం అయినట్టుగా ఫీలైపోతే జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు! అధికారులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు!! వరద పరిస్థితిని సమీక్షించడానికి ఒక పక్క ముఖ్యమంత్రి రోశయ్య హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేస్తుంటే, మరో పక్క చంద్రబాబు కూడా హెలికాప్టర్ ఎక్కేసి వరద ప్రాంతాలను పరిశీలించారు. బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఇలా బాధ్యతాయుతంగా పర్యటించడం ముదాహవమే. కాకపోతే ఆయన తీరు చూస్తుంటే మాత్రం రోశయ్య కంటే తానే అధికుడినన్న భావన కనపడుతోంది. రోశయ్య వరద పరిస్థితిని సమీక్షిస్తూ, ఏ క్షణంలోనైనా విపత్తు తలెత్తవచ్చు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పిన మాటలను చంద్రబాబు వక్రీకరించారు. సీఎం పోస్టులో ఉన్న వ్యక్తి జనాలను భయపెట్టేటట్టు మాట్లాడకూడదంటూ రోశయ్య మాటల్లో తప్పులు వెతికారు. అక్కడితో ఆగకుండా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. ఇలా పాఠాలు చెప్పడం చూస్తుంటే, మాజీ సీంగా తనకున్న అనుభవంతో చెప్పినట్టుగా లేదు, తానే సీఎం అయినట్టుగా ఉంది. మహా విపత్తు తలెత్తిన కొద్దిగంటల్లోనే అధికార యంత్రాంగం విఫలమైనట్టు చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదం. ఇది ఆయనలోని అనుభవ రాహిత్యాన్ని వేలెత్తి చూపుతోంది. మహా విలయం వచ్చినప్పుడు వెనువెంటనే ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నదే చరిత్ర చెప్పిన సత్యం. బలమైన ప్రతిపక్షం ఉండటం ప్రజాస్వామ్య దేశంలో అత్యవసరమే అయినప్పటికీ, ఇలా కాలికీ, వేలికీ అడ్డు తగలడం మాత్రం శోచనీయమే.
 చిరంజీవి: ప్రజారాజ్యం పెట్టేసి సీఎం కావాలని కలలుకని, ఎన్నికల్లో ఆశించిన ఫలితాలురాక బోల్తా కొట్టిన చిరంజీవికి మళ్ళీ కొత్తకళ వచ్చేస్తున్నది. వైఎస్సార్ మరణానంతరం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చేరువకావడం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. తిరుపతిలో ముఖ్యమంత్రి రోశయ్య పక్కన చేరి గంటన్నరసేపు మంతనాలు ఆడినప్పుడే చిరంజీవి అంతరంగం అవగతమైంది. రేపోమాపో కీలక హోం శాఖ అందుకోవడానికి కసరత్తు చేస్తున్న చిరంజీవి ఇప్పుడు వరదలను అడ్డుపెట్టుకుని ఏకంగా సీఎంగా చెలామణి చేయాలనుకుంటున్నారు. తన పార్టీ వాళ్లు వరద బాధితులకు సాయం చేయాలని చెప్తూ ఆయన అన్న మాటలు అభ్యంతరకరంగానే ఉన్నాయి. `మనకిపుడు చక్కని అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. నేను వరద ప్రాంతాలకు రాను. అలా వస్తే సహాయక కార్యక్రమాలకు అడ్డు తగిలినట్టు అవుతుంది. మీరంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి' అంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపులో రాజకీయ అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీని తిట్టలేక, అలా అని పొగడలేక చిరంజీవి సతమతమవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
 జగన్: తన తండ్రి వైఎస్సార్ మరణంతో జగన్ లో కొత్త మనిషి పుట్టుకొచ్చాడు. సీఎం పదవిని వారసత్వ పదవిగా భావించడం మొదలుపెట్టారు. తన చేతిలో ఉన్న పేపర్ `సాక్షి'గా ముఖ్యమంత్రి రోశయ్యపై బురద చల్లడం మొదలుపెట్టారు. రేపోమాపో వరద ప్రాంతాలను సందర్శించి తానే నిజమైన ముఖ్యమంత్రినన్న భ్రమ కల్పించడంకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
- కణ్వస

6 comments:

  1. చంద్రబాబు చేసినది సమయోచితమే. ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంది. ముఖ్యమంత్రిగా ఆయనకున్న తొమ్మిదేళ్ళ అనుభవం కాదనలేనిది. కలెక్టర్లతో మాట్లాడినంతమాత్రాన ఆదేశాలిచ్చినట్లు భాష్యం చెప్పడం సమంజసం కాదు. ప్రతిపక్ష నాయకుడుగా అది ఆయన విధి. ఏ నాయకుడూ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పరిపాలించినన్ని రోజులు పరిపాలించలేదనేది కూడా వాస్తవం. ఏమీ చేయకపోతే ఏమీ చేయలేదంటారు. చేస్తే ఎందుకు చేస్తున్నారంటారు. ప్రజాసేవకి పదవి అవసరం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబు నిరూపించి చూపించారు.

    --తాడేపల్లి

    ReplyDelete
  2. సార్ మీరు మిగిలిన ఇద్దరిని ఏమైనా అనండి కానీ అడ్మినిస్ట్రేషన్ లో బాబు కి ఎవరూ సాటి రారు... 1996 లో గోదావరి కి వరదలు వచినప్పుడు కోనసీమ మొత్తం మునిగిపోయింది.. (నేను అప్పుడు అక్కడే ఉన్నా).. చంద్రబాబు రాజమండ్రి లోనే మకాం వేసి అధికారులని పరుగులెట్టించి పని చేయించాడు.. వారం రోజుల్లోనే రోడ్లు, రవాణా పునరుద్ధరించబడింది.. అతను ఆ చొరవ చూపించకపోయి ఉంటే, వరద తీవ్రతని బట్టి కనీసం నెల రోజులు పట్టి ఉండేది.. ఇప్పుడు ఎంత త్వరగా ప్రభుత్వం స్పందిస్తుందో చూద్దాం!!

    ReplyDelete
  3. I agree with LBS & telugabbai completely. CBN also mentioned that we cannot blame CM Rosiah who is very much new to the post itself. Do not be so mean.

    ReplyDelete
  4. "మీరు మిగిలిన ఇద్దరిని ఏమైనా అనండి కానీ అడ్మినిస్ట్రేషన్ లో బాబు కి ఎవరూ సాటి రారు..." అన్న telugabbai గారి వ్యాఖ్య అక్షర సత్యం. నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అలాగే LBS గారి తో కూడా.
    కాని 1996 లో కోనసీమలో వచ్చినవి వరదలు కాదు.1996 నవంబరు 6 తుఫాను.ఆ తుఫానులో పూర్తిగా నష్టపోయినది మా మండలమే.సాయంత్రం 4 గంటలకు మొదలై తెల్లవారుఝాము 5 గంటలకు తగ్గిన ఆ తుఫాను తాకిడిని అనుభవించిన ప్రత్యక్ష సాక్షిని నేను.ఆ భీభత్సం,ఆ భయానక వాతావరణం ఈ రోజుకీ కళ్ళకు కట్టినట్టు చెప్పగలరు ఇక్కడి వాళ్ళు ఎవరయినా.ఆ రాత్రంతా ఈ మూలా, ఆ మూలా తలదాచుకుంటూ తుఫాను వెలిసి తెల్లవారాక మేము బయటికొచ్చాప్పటికి చంద్రబాబు కోనసీమలో వున్నాడు.ఆ సమయంలో మరే ముఖ్యమంత్రీ తీ
    సుకోలేని వేగంతో నిర్ణయాలు తీసుకొని అధ్భుతమైన చొరవ చూపించాడు.సముద్రం మద్యలోనున్న చిన్న దీవి భైరవపాలెం కూడా పడవలో ప్రయాణం చేస్తు వెళ్ళాడు ఆ సమయంలో.ఇక్కడి జనానికి కావలసిన Moral Suport ని అందించాడు.వూహించని విపత్తు, మీ పాట్లు మీరేపడండి,నేను ఏదోటి చేస్తాను అనలేదు.నిజంగానే అధికారులని పరుగులెట్టించి పని చేయించాడు. LBS, telugabbai గార్ల వ్యాఖ్యలు అక్షర సత్యాలు.

    ReplyDelete
  5. వల్లి గారు ఔను కదా.. అవి వరదలు కాదు తుఫాను .. గుర్తు చేసినందుకు నెనర్లు

    ReplyDelete
  6. ఈ రోజు ఎవడైనా ఏదైనా చేస్తున్నట్టు కనపడాలంటే తన చేతుల్లో టి.వి కాని, దినపత్రిక కాని ఉండాలి ;)

    ReplyDelete